Pharma City
-
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అది ఫార్మా సిటీ కాదు..ఇండస్ట్రియల్ కారిడార్’: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో వామపక్ష పార్టీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని,ఇండస్ట్రీయల్ కారిడార్. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే నా ఉద్దేశ్యం. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి నా భాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తాం.భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం’అని తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
లగచర్ల ఘటన: NHRCలో బాధితుల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఘటన వ్యవహారం ఢిల్లీని తాకింది. లగచర్ల ఘటనకు బాధ్యులను చేస్తూ పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడంతో బాధితులు.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. లగచర్ల బాధితులు సోమవారం ఉదయం ఢిల్లీలో మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా లగచర్లలో అక్రమ అరెస్ట్‌లు, అక్కడ హింసపై బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. లగచర్లలో నేడు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్బంగా అక్కడున్న సమస్యలపై వివరాలు సేకరించనున్నారు ఎస్టీ కమిషన్ సభ్యులు. -
మా ప్రాణాలు తీసి.. భూములు లాక్కోండి
దుద్యాల్/ వికారాబాద్: ‘‘భూములే కావాలంటే.. ముందు మా ప్రాణాలు తీసి, లాక్కొండి. కొన్నాళ్లుగా మా ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక నిరసన తెలిపాం. ఇప్పుడు మా వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాం..’’ అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధిత గిరిజనులు వాపోయారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘లగచర్ల’ ఘటన, గిరిజనుల అరెస్టు నేపథ్యంలో శనివారం ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్.. ఫార్మా విలేజీ ప్రతిపాదిత గ్రామాలైన లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండాలలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో పోలీసులు మోహరించడంతో మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు. వ్యవసాయ పనులకూ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నలుగురు రిమాండ్‌కు.. లగచర్ల ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం పులిచర్లకుంటతండాకు చెందిన రూప్లా నాయక్, లగచర్లకు చెందిన మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు నలుగురిని శనివారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి విషయంలో స్పష్టత రాలేదు. కలెక్టర్‌తో ఏడీజీ భేటీ లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (ఏడీజీ) మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సమావేశమయ్యారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పోలీసులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంచారు. ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరో ఇద్దరు ఏఆర్ గన్మన్లను అదనంగా కేటాయించారు. పోలీసుల భయంతో వృద్ధురాలికి గుండెపోటు! ‘లగచర్ల’ ఘటనకు సంబంధించి పోలీసుల భయంతో డాకిడిబాయి అనే వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పులిచర్లకుంటతండాకు చెందిన డాకిడిబాయికి గ్రామ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఫార్మా విలేజీ భూసేకరణలో ఆ భూమి కూడా పోతోంది. ఆమె కుటుంబం ఈ ఆందోళనతోనే ఉంది. ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనంతరం.. ఆమె కుమారులు ఇద్దరు పోలీసుల భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. కుమారుల జాడ చెప్పాలంటూ ఒత్తిడి చేశారని, శుక్రవారం కూడా వచ్చి గట్టిగా బెదిరించారని స్థానికులు చెప్తున్నారు. ఈ భయాందోళనతో డాకిడిబాయి గుండెపోటుకు గురైందని పేర్కొంటున్నారు. తిండికి తిప్పలు వచ్చాయి ఇంట్లో బియ్యం, కారంపొడి తప్ప ఏమీ లేవు. కూరగాయలు అమ్మేందుకు సైతం తండాల్లోకి ఎవరూ రావడం లేదు. తిండికి తిప్పలొచ్చాయి. మాకున్న ఐదెకరాల భూమి ఫార్మా విలేజీలో పోతోంది. భూమి లేకపోతే ఏం చేసి బతకాలి. – సోనిబాయి, రోటిబండతండాపోలీసులమని బెదిరించి మేకలు ఎత్తుకెళ్లారుఅధికారులపై దాడి చేసిన వారి కోసం తండాలకు పోలీసులు తరచూ వస్తున్నారు. వారిలో కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు మామూలు డ్రెస్‌లలో ఉంటున్నారు. వచ్చినవారు ఎవరో తెలియడం లేదు. కొందరు దొంగలు పోలీసులమని బెదిరించి రెండు మేకలు ఎత్తుకెళ్లారు. తండాల్లో మగవాళ్లు ఎవరూ ఉండటం లేదని ఇలా చేస్తున్నారు. మాకు రక్షణ ఏది? – అంబిక, రోటిబండతండా -
లగచర్ల దాడి కేసు.. మరో ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లగచర్ల ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.ఇక, లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటకే 17 మందిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. డీజీ మహేస్ భగవత్ కూడా లగచర్ల ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం. -
ఫార్మాకు ‘భూ’ గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల (ఫార్మా విలేజ్‌లు) ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతోంది. భూ సేకరణకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం అవు తున్నాయి. తమ గ్రామాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దంటూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా రు. వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న తాము భూములు అప్పగించేది లేదని తేల్చి చెబుతున్నారు.ఫార్మా కంపెనీల ఏర్పాటుతో గాలి, భూ గర్భ జలాలు విషతుల్యమవుతాయని, తాము కాలుష్యం కోరల్లో చిక్కుకుంటామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదని కూడా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇవ్వజూపుతున్న మొత్తం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.భూముల పరిశీలనకు, అభిప్రాయ సేకరణకు వస్తున్న అధికారులను అడ్డుకుంటుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీయే కారణమని, రైతులను రెచ్చగొడుతూ అభివృద్ధిని, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫార్మాసిటీకి బదులుగా ఫార్మా విలేజ్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19 వేల ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎనిమిదేళ్ల క్రితం భూ సేకరణ ప్రారంభించి సుమారు 14 వేల ఎకరాలు సేకరించింది. మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో సకల వసతులతో కూడిన ఫోర్త్ సిటీని నిర్మిస్తామని, ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్మా రంగాన్ని రాష్ట్రమంతటా విస్తరించడం ద్వారా ఎక్కడికక్కడే విద్యావంతులకు, పరోక్షంగా అంతగా చదువుకోని వారికి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెబుతోంది. చిన్నచిన్న క్లస్టర్ల ద్వారా కాలుష్య రహితంగా వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తొలిదశలో నాలుగు ఫార్మా విలేజ్‌లు తొలిదశలో నాలుగు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహలు ప్రారంభించింది. ‘ఫార్మా సిటీ’ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన భూముల్లో రెండు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటితో పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఒకటి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలంలో మరో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.కొడంగల్ ఫార్మా విలేజ్ ఏర్పాటుకు 1,358.38 ఎకరాలు, జహీరాబాద్‌లో ఫార్మా విలేజ్‌కు 2,003 ఎకరాలు అవసరమని లెక్కలు వేశారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పట్టా, అసైన్డ్ భూములు అనే తేడా లేకుండా ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కలెక్టర్లు భూముల పరిశీలనకు, ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరం ధర రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. దీనితో పాటు కాలుష్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనాధారమైన భూముల్ని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులపై లగచర్లలో దాడికి దిగారు. దాడి చేసిన వారితో పాటు దాడికి కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనూ రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఫార్మా విలేజ్‌లకు భూ సేకరణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. నోటికాడి కూడు తీసుకుంటారా?తరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నమాకు భూములే జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో పని చేయడం మాకు తెలియదు. ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరిట మానోటి కాడ కూడును తీసుకుంటామంటున్నారు. అదే జరిగితే మా కుటుంబాలు రోడ్డు మీద పడి ఆగమవుతాయి. మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు. ఇక్కడ ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం ఏ మూలకూ సరిపోదు. – బేగరి విఠల్, రైతు, డప్పూర్, సంగారెడ్డి జిల్లాఎన్ని పైసలు ఇచ్చినా భూమి ఇవ్వం మా కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాలే జీవనాధారం. ఈ భూమిలో 15 ఏళ్లుగా పుదీనా పండిస్తూ నారాయణఖేడ్ మార్కెట్లో అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం మా భూములను లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? ఎన్ని డబ్బులు ఇచ్చినా మా భూములు అప్పగించం. పచ్చటి భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. – అజీమొద్దీన్, రైతు, మల్గి, సంగారెడ్డి జిల్లా -
ఊరంతా ఖాళీ
కొడంగల్/దుద్యాల్/పరిగి/పూడూరు: కలెక్టర్‌పై జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయానికల్లా మూడు గ్రామాలూ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక్కడ ఫార్మా సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు భూ సేకరణ సమావేశానికి హాజరైన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో లగచర్లకు చేరుకున్న సుమారు 300 మంది సాయుధ పోలీసులు 2 గంటల ప్రాంతంలో లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఇళ్లలో నిద్రిస్తున్న రైతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. పిలిచినా స్పందించని వారి తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లారు. మూడు గ్రామాల్లో సుమారు 50 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనుమానితులను గుర్తించిన పోలీసులు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏ ఇంటిని చూసినా తాళాలే.. అర్ధరాత్రి వేళ పోలీసులు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంతో మహిళలు భయాందోళనకు గుర య్యారు. అయితే ఎప్పుడైనా పోలీసులు దాడి చేసే అవకాశం ఉందని ఊహించిన పలువురు సాయంత్రంలోపే బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి వేళ పోలీసులు రావడంతో భయకంపితులైన మిగిలిన వారు ఉదయాన్నే ఇతర గ్రామాలకు తరలివెళ్లారు. దీంతో ఉదయం 8 గంటల లోపే గ్రామాలు ఖాళీ అయిపోయాయి. గ్రామాల్లో ఏ ఇంటిని చూసి నా తాళాలే దర్శనమిచ్చాయి. పశువులు, గొర్రెలు, మేకలు మాత్రం దొడ్లలోనే ఉన్నాయి. పోలీసుల అదుపులోనే 16 మంది అనుమానంతో అదుపులోకి తీసుకున్న సుమారు 50 మందిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపిస్తూ విచారణ నిర్వహించారు. దాడికి పాల్పడిన వారి, ఇందుకు ప్రేరేపించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న 16 మందిని పీఎస్‌లోనే ఉంచుకుని మిగిలిన వారిని వదిలేశారు. 16 మందికి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వీరిని కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రైతుల దాడిలో గాయపడిన కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి సోమవారం సాయంత్రం నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు.బీఆర్ఎస్ నేతల అరెస్టు లగచర్లలో ఫార్మా బాధిత రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్తీక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి లగచర్లకు వెళ్తుండగా చన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సుమారు 40 నిమిషాల తర్వాత హైదరాబాద్ పంపించేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల బతుకులను బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని అన్నారు. ఫార్మా కంపెనీ కోసం తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుని, వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు.రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోని పక్షంలో బీఆర్ఎస్ తరఫున ఆందోళన తప్పదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, ప్రతీకారేచ్ఛతోనే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఏనాడూ అధికారులపై దాడులను ప్రోత్సహించలేదన్నారు. ఫోన్ లాక్కెళ్లారు.. పరీక్షలు ఉన్నాయన్నా వినలేదు అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారు. అప్పుడు మా అత్త దేవీబాయి, నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా వెతికిన పోలీసులు మగవారు ఎవరూ లేరని గమనించి నా ఫోన్ లాక్కెళ్లారు. నేను పరిగిలోని పల్లవి కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫోన్ ద్వారా ప్రిపేర్ కావాలి సార్ అని బతిమాలినా వినలేదు. – అనూష, పులిచెర్లకుంట తండా -
ఫోర్ బ్రదర్స్ కోసమే ఫ్యూచర్‌సిటీ
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన నలుగురు సోదరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫ్యూచర్ సిటీ నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మా ఏర్పాటు కోసం 14 వేల ఎకరాలు సేకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పుకొని రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బొంగ్లూర్ సమీపంలో ఆదివారం నిర్వహించిన అలయ్‌బలయ్ (దసరా సమ్మేళనం) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్మా సిటీని రద్దు చేస్తే రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఫార్మాలో భూములు కోల్పోయిన 9 గ్రామాల్లో పర్యటించి రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలకు విడమరిచి చెబుతామన్నారు. పండుగలన్నీ కల తప్పాయి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ పండుగకు చీరలు లేవని, దసరా పండుగ కళ తప్పిందని, వినాయక చవితి కూడా పండుగలా లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రభుత్వంలోకి రాక ముందు రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పాడని, అయితే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాత్రం ఖరీఫ్‌కు పైసలు లేవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని అభివర్ణించారు. చిట్టినాయుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు.కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఎనుముల ఇంటెలిజెన్స్’టెక్నిక్! తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన చిత్రాన్ని వాడిన రీతిలోనే రుణమాఫీ జరిగిన రైతుల లెక్క విషయంలోనూ ముఖ్యమంత్రి ఏఐ టెక్నిక్ వాడారంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య ఏఐ (ఎనుముల ఇంటెలిజెన్స్)తో రేవంత్‌రెడ్డి రూపొందించిందేనని ఎద్దేవా చేశారు. మలేíÙయా తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానం మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ అసోసియేషన్ ఆహ్వానించింది. నవంబర్ 9వ తేదీన మలేíÙయాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఉత్సవాలకు అక్కడి తెలంగాణవాసులు పెద్దఎత్తున హాజరవుతారని తెలిపింది. కేటీఆర్‌ను ఆయన నివాసంలో మలేíÙయా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, మాజీఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కలిసింది. -
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం
సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ.. ఫోర్బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ చేసిండ్రు.. కేసీఆర్ కిట్లు లేవు.. రంజాన్ తోఫా లేదు.. క్రిస్మస్ కానుక లేదు. సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు. రికవరీ చేస్తాం... రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా రేషన్ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు. హైకోర్టునూ మోసం చేస్తున్నారు... ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్‌చేశారు. -
రైతుబంధు దరఖాస్తులు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ భూములకు సంబంధించి పిటి షన్లు దాఖలు చేసిన రైతుల నుంచి రైతుబంధు దరఖాస్తులు స్వీక రించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. వారంలో గా ఈ దరఖాస్తులను స్వీకరించాల ని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతిపాదిత ఫార్మా సిటీలో భూములున్న రైతులు, భూ యజమాను లకు రెవెన్యూ అధికారులు అడ్డంకులు సృష్టిస్తు న్నారని కుర్మిద్దకు చెందిన పి.నరసింహతోపాటు మరో 37 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగే మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. మేడిపల్లి, కుర్మిడ గ్రామాలకు చెందిన పిటిషనర్లు భూసేకరణ ప్రక్రియను సవాల్ చేసి విజయం సాధించామన్నారు. నానక్ నగర్‌కు చెందిన పిటిషనర్లు దాఖలు చేసిన కేసు లకు సంబంధించి కోర్టు స్వాధీన ప్రక్రియపై స్టే విధించిందని.. అయినా అధికారులు తమ భూ ములను నిషిద్ధ జాబితాలోనే కొనసాగించడంతో రైతుబంధు పథకం, పంట రుణాలు, భూముల లావాదేవీలు వంటి ప్రయోజనాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిష నర్ తరఫు న్యాయవాది రవికుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫార్మా సిటీకోసం వారి భూములను సేకరించేందుకు జారీచేసిన నోటిఫికేషన్‌ను పరి హారం ప్రకటించినప్పటి నుంచి రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నా రు. రైతుల భూమి వివరాలను రెవె న్యూ రికార్డుల్లో నమోదు చేయడా నికి అధికారులు అనుమతించడం లేదని, వ్యవసాయ భూములకు పూర్తి యాజమాన్య హక్కులను పొందకుండా నిరోధిస్తున్నారని చె ప్పారు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయ బోమని సీఎం రేవంత్ పత్రికా ప్రకటన లు చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొందని వెల్లడించారు.ఫార్మా సిటీపై అప్పీల్ పెండింగ్‌లో ఉంది..ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎ.సు దర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ’ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు 2016, జూన్ 10న ప్రభుత్వం జారీ చేసిన జీవో 31కి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంది. రైతులతో చర్చలు జరిపి న్యాయమైన, సహేతుకమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటుంది.పరిహారంతోపాటు రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. సింగిల్ జడ్జి భూసేకరణ పరిహార ఉత్తర్వులను గత ఆగస్టులో రద్దు చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్ పెండింగ్‌లో ఉంది’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల నుంచి రైతుబంధుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీవోను ఆదేశించారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్‌బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ఫ్యూచర్ సిటీపై ఆచితూచి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులో నాలుగో నగరంగా ఏర్పాటు చేసే ‘ఫ్యూచర్ సిటీ’పై ఆచితూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ సమస్యలు, ఇప్పటికే జరిగిన భూసేకరణపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించడం తదితరాలు ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు గతంలో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కాలుష్యరహిత ‘గ్రీన్ ఫార్మాసిటీ’ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భూములు కోల్పోయిన వారిని భాగస్వాములను చేస్తూ పరిసర గ్రామాలకు ఇబ్బంది లేకుండా ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన ప్రదేశాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని సీఎం రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘ప్యూచర్ సిటీ’మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఫార్మాసిటీ ప్రతిపాదన కొనసాగుతున్నదీ లేనిదీ ఈ నెల 20లోగా చెప్పాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుకు సంబంధించి స్పీడ్ తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు నిర్ణయాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మాస్టర్ ప్లాన్ మరింత ఆలస్యం న్యూయార్క్ కంటే ఆధునికంగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫ్యూచర్ సిటీ’ని నాలుగో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యంలేని ‘నెట్ జీరో కార్బన్ సిటీ’గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ముచ్చర్లలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’స్థానంలో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో సీఎం రేవంత్ ప్రకటనలు చేశారు. ఫ్యూచర్ సిటీని 8 జోన్లుగా విభజించి కృత్రిమ మేథస్సు, లైఫ్‌సైన్సెస్, ఆరోగ్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు, జనావాసాలు ఏర్పాటు చేసేలా మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ సుర్బానా జురోంగ్కు ఫ్యూచర్ సిటీ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యత అప్పగించింది. అయితే ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా క్లస్టర్లు ఔషధ ఉత్పత్తి రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19,333 ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 13 వేల ఎకరాలకుపైగా భూమిని కూడా సేకరించింది. 2019లో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం ‘నిమ్జ్’హోదాను ప్రకటించింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ కూడా గత ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే నిధుల లేమితో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ మార్పుతో.. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాల పర్యావరణ సమస్యలు, రైతుల అభ్యంతరాలు, భూసేకరణ వివాదాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫార్మాసిటీకి బదులుగా వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రవ్యాప్తంగా పది చోట్ల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’నిర్మిస్తామని ప్రకటించింది. ఫ్యూచర్ సిటీలో భాగంగా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఏఐ సిటీ, బీసీసీఐ సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి వాటిపై ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు. ప్రస్తుతం ముచ్చర్ల గ్రీన్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
గ్రీన్ ఫార్మా సిటీపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ సమీక్ష
-
అనకాపల్లి: సినర్జిన్ ప్రమాదంపై తలోమాట!
విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే.. సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. హోం మంత్రి అనిత ఏమన్నారంటే.. ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.అధికారులు ఏమన్నారంటే.. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది. అసలేం జరిగింది?పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు. సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. -
ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్మా సిటీ రద్దు చేసింనందున దాని కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్లో మంగళవారం(జులై 30) చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘రూ. 16 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం. లక్షా 50 వేల కోట్లు మీ ప్రభుత్వానికి ఎందుకు అవసమరమవుతున్నాయి. హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ రోడ్ల నిర్మాణ పనులను కొనసాగించాలి’అని కేటీఆర్ కోరారు. -
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్‌లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్‌గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
మెట్రో, ఫార్మా సిటీ రద్దు చెయ్యం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: గత ప్రభుత్వ హయాంలో తీసుసుకున్న మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోవట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న మెట్రో, పార్మా సిటీ నిర్ణయాలను రద్దు చేయడం లేదు. ప్రజా ప్రయోజనాన్ని దృషష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టుకు దూరం తగ్గిస్తాం. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. నాగోలు నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద ఛాంద్రాయణ గుట్ట వద్ద మెట్రో లైన్‌కు లింక్ చేస్తాం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రబాపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. అవసరమైతే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం అని అన్నారాయన. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారయన. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా.. 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. సంక్రాంతి లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వంలో.. ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవు. అన్ని నిర్ణయాల అమలుకు టార్గెట్ 100రోజులు పెట్టుకుని.. కచ్చితంగా అమలు చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పనులకు.. సీఎంగా కేసీఆర్ శంకుస్థాపన సైతం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణ ప్రతిపాదనతో పాటు ఫార్మా సిటీపైనా పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ఆయన రద్దు చేయవచ్చని అంతా భావించారు. అయితే.. రద్దు చేయకుండా వాటిలో సమూల మార్పులు చేయడం గమనార్హం. -
ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఫార్మాసిటీ ఉండకూడదని.. దాన్ని నగరానికి దూరంగా తరలించడం మంచిదని అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి, సీఎంఓ అధికారులు వి.శేషాద్రి, బి.శివధర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఔటర్‌రింగ్‌రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా సమంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్చాలని పేర్కొన్నారు. ఆ రెండు రూట్ల మీదుగా.. ‘‘హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చాలి. ఈ మేరకు ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు.. అలాగే ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలి. అలాగే మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పీ–7 రోడ్, లేదా బార్కాస్, పహడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు రూట్లను కూడా పరిశీలించాలి..’’ అని రేవంత్ సూచించారు. ఈ రూట్లలో మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేయాలని మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా ఉండే మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేపట్టలేదు? పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందినా ఓల్డ్‌సిటీ మెట్రోను పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేత నేపథ్యంలో.. జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక కోరారు. నగర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. మూసీ సుందరీకరణ చేపట్టాలన్నారు. తూర్పు నుంచి పడమర వరకు మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండాలని సూచించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉందని చెప్పారు. భవిష్యత్తులో 3 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. నేడు కేబినెట్ భేటీ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయి, సభ వాయిదా పడ్డాక ఈ భేటీని నిర్వహించనున్నారు. -
ఫార్మాసిటీతో రియల్ బూమ్: వాటికి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో శ్రీశైలం జాతీయ రహదారి రూపురేఖలే మారిపోయాయి. ఫార్మా సిటీ నుంచి కూతవేటు దూరంలో ఉన్న కడ్తాల్, కందుకూరు, ఆమన్‌గల్, తలకొండపల్లి వంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ హబ్‌గా మారిపోయాయి. విజయవాడ, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులతో పోలిస్తే శ్రీశైలం హైవేలోని గృహ అద్దెలకు, స్థలాలకు రెట్టింపు విలువ చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్పేట్, శంకర్పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతం ఏమైనా ఉందంటే అది ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే. హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే.. శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రోడ్ ఫేసింగ్‌ను బట్టి రూ.8 వేల నుంచి 30 వేల వరకున్నాయి. ప్రధా న నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లే అవుట్లు, విల్లాలకు డిమాండ్.. శ్రీశైలం రహదారిలో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. హాల్‌మార్క్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై, విశాల్ ప్రాజెక్ట్స్, రాంకీ, హస్తినా రియల్టీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్, జేఎస్ఆర్ గ్రూప్ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ. దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి.. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం రహదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. -
ఫార్మా కారిడార్‌లో.. రియల్ పెట్టుబడులు
ఐడీఏ బొల్లారం, పాశమైలారంలోని ఫార్మా కంపెనీలతో మియాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల అభివృద్ధి రూపురేఖలు మారిపోయాయి. జీనోమ్‌వ్యాలీ ఏర్పాటుతో షామీర్పేట, తుర్కపల్లి, మేడ్చల్, పఠాన్‌చెరు, కీసర వంటి ప్రాంతాలలో నివాస, రిటైల్ అభివృద్ధి జరిగింది. తాజాగా ముచ్చెర్లలో 19 వేల ఎకరాల్లో రానున్న ఫార్మా సిటీ.. దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి ఊహించలేనిదే. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ రంగం తర్వాత అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది ఫార్మా రంగమే. ఏ ప్రాంతంలోనైనా సరే పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దాని చుట్టూ 30 కి.మీ. వరకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ.. రీజినల్ రింగ్ రోడ్‌కు సమీప దూరంలోనే ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు అదనపు అంశం. ఇప్పటికే మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఆర్ఆర్ఆర్, ఫార్మా సిటీలు మణిహారంగా మారనున్నాయి. కలిసొచ్చిన కరోనా.. కోవిడ్–19 తర్వాతి నుంచి కొనుగోలుదారుల ఆలోచనలలో మార్పులొచ్చాయి. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం తప్పనిసరైన నేపథ్యంలో ఇరుకు ఇళ్లకు బదులుగా విశాలమైన గృహాలను ఎంచుకుంటున్నారు. ఓఆర్ఆర్, మెట్రో రైల్లతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం చాలా సులువైంది. దీంతో సిటీకి దూరమైన సరే ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రాజెక్ట్‌లలో కొంటున్నారు. బెంగళూరు, ముంబై, పుణే వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు కలిసొచ్చే ప్రధానమైన అంశం.. భూముల ధరలు తక్కువగా ఉండటమే. అందుకే స్థానిక కొనుగోలుదారులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, ప్రవాసులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. నౌ ఆర్ నెవర్ ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారంలో కంటే రియల్టీ పెట్టుబడులే రెట్టింపు ఆదాయాన్ని అందిస్తాయి. చేతిలోని నగదుతో ప్రతీ ఒక్కరూ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. సిటీకి దూరంగా ఉన్న వంద ఎకరాల భూమిని విక్రయించేసి.. అదే డబ్బుతో అందుబాటు ధరల్లో అభివృద్ధికి ఆస్కారం ఉండే రియల్టీ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ‘‘కరోనా టైంలో కస్టమర్లు ముందుకురారు అనుకున్నాం. కానీ, కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ప్రతికూల సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని, డెవలపర్లు ఆఫర్లూ అందిస్తారని పెట్టుబడులు పెట్టేందుకు కస్టమర్లే ముందుకొచ్చారని పేర్కొన్నారు. నౌ ఆర్ నెవర్ అనే భావన కస్టమర్లలో పెరిగిపోయింది. చదవండి: 3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ 2020లో అతిపెద్ద డీల్ హైదరాబాద్‌లోనే.. -
ఫార్మానే వద్దంటే.. రోడ్డెందుకు?
సాక్షి, యాచారం: ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, వైస్ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నందివనపర్తి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, తహసీల్దార్ నాగయ్యలు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వంద అడుగుల రోడ్డు కోసం ఇరువైపులా 60 ఎకరాల వ్యవసాయ భూమి కావాల్సి ఉంది. భూమిని సేకరించడానికి నింబంధనల ప్రకారం నోటిఫికేషన్లు ప్రకటించిన అధికారులు బుధవారం నందివనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభంలో భూసేకరణ నింబంధనలను ఆర్డీఓ వెంకటాచారి రైతులకు వివరించారు. ఫార్మాసిటీ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఫార్మాను అడ్డుకోవద్దని సూచించారు. సభలో గందరగోళం ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతుండగానే రైతులు లేచి.. సార్ అసలు ఫార్మాసిటీ ఏర్పాటే వద్దని అంటుంటే.. రోడ్డు విస్తరణ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా వేదికపై కూర్చున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు లేచి ఫార్మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే రైతులంతా ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. కొంతమంది రైతులు అధికారులపై కుర్చీలు వేశారు. టెంటును కూల్చేశారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రైతులను, ఆందోళనకారులను పక్కకు తోసేశారు. కొంతమంది ఆందోళనకారులను, రైతులను అరెస్టు చేసి వాహనంలో యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సభ వద్ద ఉన్న మరికొందరు రైతులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో అధికారులపై దాడులు చేయడానికి యత్నించగా అధికారులు అర్ధంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ సభను నిలిపేసి వెళ్లిపోయారు. కాగా, నింబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ సభను పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఇదేక్కడి దారుణం.. ఫార్మానే వద్దంటే.. అధికారులు బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ, పట్టా భూముల సేకరణకు జనరల్ అవార్డు పాస్‌చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. నందివనపర్తిలో రైతులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మాకు వ్యతిరేకంగా రైతుల్లో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో సర్కారు బలవంతంగా భూసేకరణకు దిగడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా న్యాయస్థానాలను ఆశ్రయించి బలవంత భూసేకరణను అడ్డుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాను రద్దు చేసి రైతుల భూములను తిరిగి ఇస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్యయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, బీజేపీ నాయకులు కొండూరి రామనాథం, గోగికార్ రమేష్, విజయకుమార్, నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ ముత్యాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీని రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక దళారీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమిని పంచుతామని చెప్పిన కేసీఆర్, ఫార్మాసిటీ పేరుతో దళిత, గిరిజన, పేదల భూములను ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల కోసం భూసేకరణను తాము తప్పుబట్టబోమని, కానీ ఫార్మాసిటీ పేరుతో అమెరికా సంస్థలకు, ఎంఎన్సీలకు భూములను కట్టబెట్టడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. బహుళజాతి సంస్థలకు భూములు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనం ఎలా అవుతుం దో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2 ల క్షల 60 వేల ఇండ్లు నిర్మిస్తామని కేసీఆర్, లక్ష ఇళ్లు నిర్మి స్తాం అంటూ కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన వీడియో క్లిప్‌ల ను భట్టి మీడియాకు చూపించారు. కానీ మంత్రి తలసాని తమకు 3,428 ఇండ్లు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. గత గ్రేటర్ ఎన్నికలకు సంబంధిం చిన టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్సైట్ నుంచి తీసేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ మాటలకు మరోసారి మోసపోవద్దని భట్టి విజ్ఞప్తి చేశారు. -
ఫార్మా పేరుతో రియల్ వ్యాపారం
యాచారం: ‘కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఫార్మాసిటీ పేరుతో బలవంతంగా లాక్కుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. మూడేళ్ల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేస్తాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫార్మా భూనిర్వాసితులకు భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీకి భూములు సేకరించనున్న రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్దలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ఐదు కిలోమీటర్లు కాలినడకన తిరిగి అక్కడి రైతుల పట్టా భూములను పరిశీలించారు. ‘ప్రపంచమే వెలివేసిన ఫార్మాను సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో 20 వేల ఎకరాల్లో వందలాది కంపెనీలతో ఏర్పాటు చేస్తున్నారు. ఫార్మాసిటీతో భూగర్భంలో వందలాది కిలోమీటర్ల మేర కాలుష్యం ఏర్పడి సమీపంలోని కృష్ణానదికి ప్రమాదం పొంచి ఉంది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. ఎకరానికి వారికి రూ.లక్షల్లో ఇచ్చి రూ.కోటిన్నర చొప్పున విక్రయిస్తూ కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారు. భూపంపిణీ ఏమైంది..? వైఎస్సార్ ఇచ్చిన భూములను లాక్కోవడం న్యాయమేనా..? రైతులు భయపడొద్దు.. ఐక్యంగా ఉద్యమాలు చేయండి. మూడేళ్ల పాటు ఫార్మాసిటీని అడ్డుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తాం. ఫార్మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతాం. అక్టోబర్ 11న ఇదే స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అప్పటివరకు రైతులు, నాయకులు, యువత ఉద్యమించాలి. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప’అని భట్టి రైతులనుద్దేశించి అన్నారు. ‘జైలుకైనా పోతాం.. ప్రాణాలైనా ఇస్తాం.. కానీ మా పట్టా భూములు మాత్రం ఫార్మాకు ఇవ్వం’అని కుర్మిద్ద రైతులు కాంగ్రెస్ నేతల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు భూముల కోసం తమను బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్ భూదోపిడీని తిప్పికొట్టాల్సిందే: సీతక్క తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న భూ దోపిడీని తిప్పికొట్టాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రైతులకు పిలుపునిచ్చారు. ‘ఫార్మాసిటీ పేరుతో సీఎం 19,333 ఎకరాలను సేకరిస్తూ రూ.20 వేల కోట్లను దోచుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు దున్నేవాడికే భూమి అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాత్రం వందలాది ఎకరాల్లో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకుని పేదలకు భూమి లేకుండా చేస్తున్నారు’అని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కె.లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11న సామూహిక నిరాహార దీక్షలు.. ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అక్టోబర్ 11వ తేదీకి మూ డేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అదేరోజున ఫార్మాసిటీకి భూములు తీసుకుంటున్న కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. -
ప్రజలు తిరస్కరించిన ఫార్మాసిటీ
వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా పటాన్ చెరు, జీడిమెట్ల, చౌటుప్పల్, కొత్తూర్ వంటి ప్రాంతాలలో, ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయం మనకు అనుభవమే. అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి మరియు అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులు ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలు అవుతూనే ఉన్నారు. పరిశ్రమ వేసే పవర్ బోర్ల తోటి స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతు న్నాయి. బర్రెలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు వంటివి కూడా కాలుష్యం బారిన పడి చనిపోవడంతో, వాటి మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిన ఉదంతాలు అనేకం. నష్ట పరిహారం ఇచ్చే ఆలోచన అటు పరిశ్రమలు కాని, ఇటు ప్రభుత్వం కాని చేయలేదు. ఉపరితల నీటి వనరుల కాలుష్యం ఒక బాధ కాగా, కొన్ని పరిశ్రమలు ఇంజక్షన్ బోర్లు వేసి ప్రమాదకర వ్యర్థ జలాలను భూగర్భంలోకి వదులుతున్నాయి. జీరో డిశ్చార్జి అంటూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా, వాటిని మూసివేయకుండా, ప్రజల నిరసనలు తెలియ జేస్తే వారి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన వైనాలు కూడా ఉన్నాయి. పోలేపల్లిలో కాలుష్యం గురించి ప్రజలు ఆందోళన చేస్తే, 22 జూలై 2017 నాడు జరిగిన సమీక్ష సమావేశంలో, పరిశ్రమల మంత్రితో సహా అధికారులు కాలుష్య నియంత్రణ మీద ఆలోచనలు పెట్టకుండా, కేవలం కంటితుడుపు మాటలతో తమ నిస్సహాయతను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కుల గురించి స్పష్టం చేసినా కూడా, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఇంకా ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కాలుష్యం చేసే పరిశ్రమల మీద ఈగ వాలనీయకుండా కాపాడుతున్నారు. పరిశ్రమల నేరపూరిత వ్యవహారాన్ని ఎండగట్టకుండా కాలుష్య నియంత్రణ అధికా రులు గ్రామీణులను మోసం చేస్తున్నారు. కాలుష్యం తగ్గించి, వనరులను పునర్వినియోగించి, పర్యావరణాన్ని కాపాడవలసిన తరుణంలో, పరిశ్ర మలు కేవలం తమకు వచ్చే లాభాల మీదనే దృష్టి పెడుతున్నాయి. ఔషధ పరిశ్రమలు ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు పొందుతూ, ప్రజల మీద పడుతున్న దుష్ప్రభావం గురించి పట్టించుకోవడం లేదు. అక్కడ ఒక్కటి, ఇక్కడ ఒకటి పరిశ్రమలు ఉన్నప్పుడే ఇంత దారుణ పరిస్థితి ఉండగా, హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట కొన్ని వందల ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే రాబోయే దుర్భర పరిస్థితులు ఊహకు కూడా అందవు. వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియం త్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఫార్మా సిటీ బారిన పడే అన్ని గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 20,000 ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు వలన కనీసం 100 కి.మీ. పరిధిలో పర్యావరణం, చెట్లు, చెరువులు, కుంటలు, చెలమలు, మట్టి, నేల, గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితం అయ్యి, స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ కాలుష్య ప్రభావం కొన్ని దశాబ్దాల వరకు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్ తరాల ఉనికికే ఇది ప్రమా దం. తెలంగాణ రాష్ట్రం మీద ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 14న జారీ చేసిన జీవో 63 గమనించాలి. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం తమ వనరులను అంచనా వేసుకుని, తమ స్థాయికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఈ ఉత్తర్వులు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి గ్రామం కూడా తమ అభివృద్ధిని నిర్దేశించుకునే అవకాశం ఉంది. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలో ఉన్న అనేక గ్రామాలు, ముచ్చెర్ల, మేడిపల్లి, కురుమిద్ద తదితర గ్రామాలతో సహా, ఎవరూ ఫార్మా సిటీ కోరుకోలేదు. స్థానిక యువతకు వారి చదువుకు, నైపుణ్యానికి తగ్గ ఉపాధి అవకాశాలు ఈ గ్రామాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయం, వృత్తులు ఇంకా అనేక ఇతర జీవనోపాధుల పునాదుల మీద అభివృద్ధి జరగాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు ఉపాధి దొరకకపోగా, స్థానిక గ్రామాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలే పరమావధిగా అసమగ్ర సమాచారం, అబద్ధాలతో కూడిన నివేదికలు ఇచ్చి, హైదరాబాద్ ఫార్మా సిటీకి అనుమతులు తీసుకుంది. ఫార్మా సిటీ లోపల ఉండే గ్రామాలు, నివాస ప్రాంతాల గురించి ప్రభుత్వం చేసిన ప్రణాళిక శూన్యం. అసైన్డ్ భూములకు, ఇతర భూములకు మధ్య నష్ట పరిహార పరిమాణంలో సరి సమానత లేదు. పేద, దళిత, బలహీన వర్గాల భూమి తన సొంత భూమిగా ప్రభుత్వం భావిస్తున్నది. భూమి లేని కుటుంబాలు, ఇతర వృత్తిదారుల పట్ల పునరావాస ప్రణాళికలు అసలే లేవు. వారికి భారత రాజ్యాంగం హక్కులు కల్పిస్తున్నది అనే వాస్తవం విస్మరించారు. ఇప్పటికే కొంత అవకతవకల నడుమ, చిన్న రైతులను బెదిరించి తీసుకున్న భూముల వ్యవహారంలో స్పష్టమైన అవినీతి మీద విచారణ చేపట్టలేదు. సింగపూర్ కంపెనీకి ఫార్మా సిటీ మాస్టర్ ప్రణాళిక తయారు చేయమని కాంట్రాక్ట్ ఇచ్చినా, వారి నివేదిక ప్రజలకు అందుబాటులో లేదు. మాస్టర్ ప్లాన్ తయారు కాకముందే, అసైన్డ్ భూములు, అటవీ, పట్టా భూముల సేకరణ చేపట్టడం సుపరిపాలన పద్ధతులకు వ్యతిరేకం. హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్ట్ ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త, పర్యావరణ విధాన విశ్లేషకులు -
కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు చూస్తున్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దాలని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. విండ్ ఫ్లో వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఫార్మాసిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జి యూనిట్లు ఎక్కువగా ఏర్పాటవుతాయని తెలిపారు. రసాయన వ్యర్థాలను కేంద్రీకృతంగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఫార్మాసిటీలో పనిచేసే వారికి అక్కడే నివాస సౌకర్యం ఉంటుందన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.