ఫార్మాసిటీ భూసేకరణపై కోర్టు కేసుల నేపథ్యంలో ప్రభుత్వం మల్లగుల్లాలు
ఇప్పటికే ఏఐ సిటీ, స్కిల్స్ వర్సిటీ, స్పోర్ట్స్ హబ్‌లపై ప్రకటనలు
ఈ నెల 20లోగా ఫార్మాసిటీపై ప్రభుత్వ వైఖరి చెప్పాలన్న హైకోర్టు
దీంతో ‘నాలుగో నగరం’పై స్పీడ్ తగ్గించే యోచనలో ప్రభుత్వం
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లే యోచన
ప్రస్తుతానికి గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉండేలా ప్రణాళికలు
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో మార్పులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులో నాలుగో నగరంగా ఏర్పాటు చేసే ‘ఫ్యూచర్ సిటీ’పై ఆచితూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ సమస్యలు, ఇప్పటికే జరిగిన భూసేకరణపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించడం తదితరాలు ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు గతంలో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కాలుష్యరహిత ‘గ్రీన్ ఫార్మాసిటీ’ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
భూములు కోల్పోయిన వారిని భాగస్వాములను చేస్తూ పరిసర గ్రామాలకు ఇబ్బంది లేకుండా ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన ప్రదేశాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని సీఎం రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘ప్యూచర్ సిటీ’మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఫార్మాసిటీ ప్రతిపాదన కొనసాగుతున్నదీ లేనిదీ ఈ నెల 20లోగా చెప్పాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటుకు సంబంధించి స్పీడ్ తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు నిర్ణయాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
మాస్టర్ ప్లాన్ మరింత ఆలస్యం
న్యూయార్క్ కంటే ఆధునికంగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫ్యూచర్ సిటీ’ని నాలుగో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యంలేని ‘నెట్ జీరో కార్బన్ సిటీ’గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ముచ్చర్లలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’స్థానంలో ‘ఫ్యూచర్ సిటీ’ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో సీఎం రేవంత్ ప్రకటనలు చేశారు.
ఫ్యూచర్ సిటీని 8 జోన్లుగా విభజించి కృత్రిమ మేథస్సు, లైఫ్‌సైన్సెస్, ఆరోగ్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు, జనావాసాలు ఏర్పాటు చేసేలా మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ సుర్బానా జురోంగ్‌కు ఫ్యూచర్ సిటీ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యత అప్పగించింది. అయితే ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా క్లస్టర్లు
ఔషధ ఉత్పత్తి రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19,333 ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 13 వేల ఎకరాలకుపైగా భూమిని కూడా సేకరించింది. 2019లో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం ‘నిమ్జ్’హోదాను ప్రకటించింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ కూడా గత ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే నిధుల లేమితో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు.
ప్రభుత్వ మార్పుతో..
గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాల పర్యావరణ సమస్యలు, రైతుల అభ్యంతరాలు, భూసేకరణ వివాదాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫార్మాసిటీకి బదులుగా వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రవ్యాప్తంగా పది చోట్ల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ‘ఫ్యూచర్ సిటీ’నిర్మిస్తామని ప్రకటించింది.
ఫ్యూచర్ సిటీలో భాగంగా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఏఐ సిటీ, బీసీసీఐ సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి వాటిపై ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు. ప్రస్తుతం ముచ్చర్ల గ్రీన్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment