సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నేతలకు చోటు కల్పించే విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వనితుడిగా నియమించడం వెనుక పార్టీ హైకమాండ్‌కు భారీ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు, సామాజిక సమతుల్యతలను దృష్టిలో ఉంచుకునే, ఎవరూ ఊహించని విధంగా దామోదరకు స్థానం కల్పించారని, దళిత వర్గాలను ఆకట్టుకోవాలనే ఆలోచనతోనే ఆయనకు అత్యున్నత హోదాను కట్టబెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో నాయకుడు, విద్యార్థి సంఘం నుంచి పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి కూడా పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.
చాలాకాలంగా ఆయన ఢిల్లీ కేంద్రంగా పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీ.. పార్టీ పెద్దలకు అనేక అంశాల్లో సహాయకారిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా వంశీ సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఆయనను ప్రత్యేక ఆహ్వనితుడిగా నియమించినట్టు సమాచారం.
అయితే, సీడబ్ల్యూసీలో స్థానం కల్పిస్తారంటూ ప్రచారం జరిగిన కొందరికి చోటు దక్కకకపోవడం, పార్టీపరంగా ఏ మాత్రం ప్రభావం లేని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు నేరుగా స్థానం కల్పించి, అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలంగాణ నేతలను మాత్రం ఆహ్వనితుల హోదాకు మాత్రమే పరిమితం చేయడంపై రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో స్థానం దక్కవచ్చనే చర్చ గతంలో జరిగింది.
మరో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆ రేసులో ఉన్నారని, గిరిజన మహిళ కోటాలో సీతక్కకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అనూహ్యంగా దామోదర, వంశీలకు స్థానం కల్పించడం గమనార్హం.
రేవంత్, భట్టి అభినందనలు
కాంగ్రెస్ అత్యున్నత స్థాయి కమిటీ అయిన సీడబ్ల్యూసీలో స్థానం పొందిన తెలంగాణ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు అభినందనలు తెలిపారు. తెలంగాణకు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించినందుకు గాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీకి ఆదివారం వారు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ వర్గంలో కీలకంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కడం పట్ల భట్టి హర్షం వ్యక్తం చేశారు.
ఆశావహుల్లో అసంతృప్తి!
ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీలో కచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి కొంతకాలం పాటు అసమ్మతితో ఉన్నా ఆ తర్వాత క్రమంగా సర్దుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆయనను స్టార్ క్యాంపెయినర్ హోదాకు మాత్రమే పరిమితం చేసింది.
ఇటీవల నియమించిన స్క్రీనింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కకపోవడంతో అధిష్టానం ఏదైనా మంచి హోదా కల్పిస్తుందనే ఆశతో కోమటిరెడ్డి శిబిరం ఉంది. కానీ సీడబ్ల్యూసీ లోనూ పేరు కనిపించకపోవడంతో కోమటిరెడ్డి అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని భావించిన సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల కూడా హైకమాండ్ తాజా నిర్ణయంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక మొదటి నుంచి కాంగ్రెస్ వర్గాల చర్చలో ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కూడా అవకాశం రాకపోవడం, రాహుల్ దృష్టిలో ఉన్నారని, రేవంత్ కూడా సిఫారసు చేశారని ప్రచారం జరిగి, గిరిజన కోటాలో ఈ సారి చాన్స్ ఉంటుందని భావించిన ఎమ్మెల్యే సీతక్కపేరు కూడా జాబితాలో కనిపించక పోవడంతో వారి మద్దతుదారులు అసంతృప్తిలో మునిగిపోయారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణకు చెందిన మరో ఒకరిద్దరు నేతలకు సీడబ్లూసీలో చోటు కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment