దునియా మొత్తం ఇటే చూస్తోంది
► పరిశ్రమలకు అనువైన వాతావరణముందని ప్రధానే అన్నారు: సీఎం కేసీఆర్
► సాధారణమైన గుర్తింపు కాదు... దీన్ని నిలబెట్టుకుందాం
► హైదరాబాద్‌లో పెట్టుబడులకు పలు దేశాల ఆసక్తి
► మౌలిక వసతులు, ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి
► విధానాలు, ప్రణాళికలు పక్కాగా ఉండాలన్న సీఎం
► ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీ ఆవిష్కరణ: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు, ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధానిస్థాయివారు కూడా పేర్కొనడం సాధారణ విషయం కాదన్నారు. ‘‘ఇలాంటి గుర్తింపు సాధారణ విషయం కాదు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, పెట్టుబడులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ ఉండాలి’’ అని అధికారులను ఆదేశించారు.
ఫార్మా సిటీ, ఐటీ, టెక్స్‌టైల్స్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తదితరాలపై గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రపంచమంతటా ఆసక్తి ఉందన్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే అనువైన ప్రాంతమని అందరూ గుర్తించారన్నారు. మానవాళికి ఔషధాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా పరిశ్రమ మరింతగా విస్తరిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. ఫార్మా సిటీలో భాగంగానే నివాస ప్రాంతాలు, కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లుండాలి. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్లు ఎలా పని చేస్తున్నాయో అధ్యయనం చేయండి. ఘన వ్యర్థాల నిర్వహణలో కొత్త ధోరణులనూ నిశితంగా పరిశీలించండి’’ అని అధికారులను ఆదేశించారు.
ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి
ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని అధికారులను సీఎం కోరారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాదే అనువైనవని అంతా గుర్తిస్తున్నారన్నారు. ‘‘ఇటీవలి పెను తుపాను కారణంగా చెన్నై నుంచి కొన్ని కంపెనీలు వెనుదిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌పై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకోవాలి. పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు అవసరమైన పూర్వ రంగాన్ని సిద్ధం చేయాలి’’ అని సూచించారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీకి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టీ-హబ్ కూడా మంచి ఫలితాలనిస్తున్నదని ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్యాక్ ఆఫీసులను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు.
వరంగల్‌లో అతి పెద్ద టెక్స్‌టైల్ పార్క్ రాబోతున్నది. దానితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలు భారీగా బారులు తీరుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ ఉండేలా ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్లు రావాలో ప్రణాళికలు సిద్ధం చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. మైక్రోమ్యాక్స్ కంపెనీ యాజమాన్యం పంపిన సందేశాన్ని ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.
‘‘ఉత్తరాఖండ్‌లో ప్లాంట్ ప్రారంభించడానికి మాకు రెండున్నరేళ్లు పట్టింది. అలాంటిది, తెలంగాణలో కేవలం ఆరు నెలల్లోనే పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించగలిగాం. తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్లనే ఈ ఘనత సాధ్యమైంది’’ అని ఆ సందేశంలో కంపెనీ పేర్కొందన్నారు. ప్రభుత్వం తెచ్చిన సరళమైన పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల తాము ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పనులు చేసుకోగలిగామన్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.
ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏప్రిల్ 4న ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఐటీ మంత్రి కె.తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తదితర ఐటీ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త విధానంలో ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో విధాన రూపకల్పన జరిగినట్టుసమాచారం. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ అత్యధికంగా ఉండటంతో విదేశాల నుంచి దిగుమతుల అవసరం పెరిగింది. అందుకే కేంద్రం కూడా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రాయితీలు ప్రకటించింది.
దాంతో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. రెండో ప్రాధాన్యంగా యానిమేషన్, గేమింగ్‌లకు పెద్ద పీట వేయనుంది. ఈ సంస్థలకు, కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ కంపెనీలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాయితీలివ్వాలని నిర్ణయించింది. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి లభించటంతో పాటు ఐటీ పరిశ్రమను మరింత విస్తరించే లక్ష్యమూ నెరవేరుతుందని భావిస్తోంది.