రైతులతో మాట్లాడుతున్న సీతక్క, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి తదితరులు
యాచారం: ‘కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఫార్మాసిటీ పేరుతో బలవంతంగా లాక్కుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. మూడేళ్ల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేస్తాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫార్మా భూనిర్వాసితులకు భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీకి భూములు సేకరించనున్న రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్దలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ఐదు కిలోమీటర్లు కాలినడకన తిరిగి అక్కడి రైతుల పట్టా భూములను పరిశీలించారు. ‘ప్రపంచమే వెలివేసిన ఫార్మాను సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో 20 వేల ఎకరాల్లో వందలాది కంపెనీలతో ఏర్పాటు చేస్తున్నారు.
ఫార్మాసిటీతో భూగర్భంలో వందలాది కిలోమీటర్ల మేర కాలుష్యం ఏర్పడి సమీపంలోని కృష్ణానదికి ప్రమాదం పొంచి ఉంది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. ఎకరానికి వారికి రూ.లక్షల్లో ఇచ్చి రూ.కోటిన్నర చొప్పున విక్రయిస్తూ కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారు. భూపంపిణీ ఏమైంది..? వైఎస్సార్ ఇచ్చిన భూములను లాక్కోవడం న్యాయమేనా..? రైతులు భయపడొద్దు.. ఐక్యంగా ఉద్యమాలు చేయండి. మూడేళ్ల పాటు ఫార్మాసిటీని అడ్డుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తాం. ఫార్మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతాం. అక్టోబర్ 11న ఇదే స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అప్పటివరకు రైతులు, నాయకులు, యువత ఉద్యమించాలి. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప’అని భట్టి రైతులనుద్దేశించి అన్నారు. ‘జైలుకైనా పోతాం.. ప్రాణాలైనా ఇస్తాం.. కానీ మా పట్టా భూములు మాత్రం ఫార్మాకు ఇవ్వం’అని కుర్మిద్ద రైతులు కాంగ్రెస్ నేతల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు భూముల కోసం తమను బెదిరిస్తున్నారన్నారు.
కేసీఆర్ భూదోపిడీని తిప్పికొట్టాల్సిందే: సీతక్క
తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న భూ దోపిడీని తిప్పికొట్టాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రైతులకు పిలుపునిచ్చారు. ‘ఫార్మాసిటీ పేరుతో సీఎం 19,333 ఎకరాలను సేకరిస్తూ రూ.20 వేల కోట్లను దోచుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు దున్నేవాడికే భూమి అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాత్రం వందలాది ఎకరాల్లో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకుని పేదలకు భూమి లేకుండా చేస్తున్నారు’అని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కె.లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్), కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
11న సామూహిక నిరాహార దీక్షలు..
ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అక్టోబర్ 11వ తేదీకి మూ డేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అదేరోజున ఫార్మాసిటీకి భూములు తీసుకుంటున్న కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment