విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానంటున్న ఆర్డీఓ అమరేందర్
సాక్షి, యాచారం: ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయొద్దు.. ఇప్పటికే సేకరించిన అసైన్డ్ భూములకు సంబంధించి రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదు. పర్యావరణానికి హాని చేసే ఫార్మాసిటీ తమకు వద్దని బుధవారం యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రైతులు బహిష్కరించారు. ఫార్మాసిటీ ఏర్పాటును తాము ఇప్పటికే నిరాకరించామని, తిరిగి ఎందుకు వచ్చారని అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామస్తులకు మద్దతుగా సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ బాబురావు ఫార్మాసిటీ అభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. తాడిపర్తి రెవెన్యూ పరిధిలోని 104తోపాటు మరికొన్ని సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 900 ఎకరాలకు పైగా భూమిని సేకరించే క్రమంలో బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు.
ఎంపీపీ జాపాల సుకన్యభాషా, సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ బాబురావు, తహసీల్దార్ పుష్పలత తదితరులు హాజరయ్యారు. మొదట ఆర్డీఓ అమరేందర్ గ్రామంలోని 104 సర్వే నంబరులోని పట్టా భూమి 820 ఫార్మాసిటీ ఏర్పాటుకు ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అభ్యంతరాలుంటే చెప్పాలని రైతులు, గ్రామస్తులకు సూచించారు. దీంతో పలువురు రైతులు ఫార్మాసిటీ మాకు వద్దని ఇప్పటికే చెప్పాం. మళ్లీ భూసేకరణ ఏంటీ.. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకంటూ నిలదీశారు. 104 సర్వే నంబరులో అందరూ భూస్వాములు ఉన్నారు. పట్టాలున్న వారెవరూ స్థానికులు కాదన్నారు. ఏళ్ల క్రితం ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో కొన్ని నకిలీ పట్టాలు కూడా ఉన్నాయన్నారు. కలెక్టర్ స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణకు రావాలని రైతులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌ఐ వెంకటయ్య పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈక్రమంలో అధికారులు, పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
న్యాయమైన పరిహారమేదీ?
రెండేళ్ల క్రితం తాడిపర్తి గ్రామంలోని 155, 66 తదితర అసైన్డ్ సర్వే నంబర్లల్లోని వందల ఎకరాల భూములను ఫార్మాసిటీ కోసం బలవంతంగా సేకరించారని రైతులు తెలిపారు. భూములు ఇవ్వకపోతే పీఓటీ కింద స్వాధీనం చేసుకుంటామని బెదిరించడంతో భూములు ఇచ్చామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పలు సర్వేనంబర్లలో అసైన్డ్ పట్టాలిచ్చారని తెలిపారు. తాము కబ్జాలో ఉన్నా 37 మంది రైతులకు ఏళ్లు గడుస్తున్నా పరిహారమే అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ రజత్‌కుమార్ సైనీ, రాళ్లు, గుట్టల భూములకు, పాసుపుస్తకంలో ఉన్న విస్తీర్ణం మొత్తానికి న్యాయమైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాతే పట్టా భూముల జోలికి రావాలని స్పష్టం చేశారు. ఫార్మాసిటీకి భూసేకరణ చేసేందుకు తహసీల్దార్ పుష్పలత తమ భూములకు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తా: ఆర్డీఓ
తాడిపర్తి గ్రామంలో పట్టా భూములను సేకరించే విషయంలో గ్రామస్తులు, రైతుల అభిప్రాయాలను కలెక్టర్‌కు హరీష్ దృష్టికి తీసుకెళ్తానని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్ పేర్కొన్నారు. దయచేసి ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించాలని రైతులను కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు అసలు ఫార్మాసిటీ వద్దంటే.. వద్దు అని అంటుంటే సహకరించాలని చెప్పడం ఏంటన్నారు. ఆర్డీఓ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రశాంతంగా కూర్చీల్లో కూర్చున్న రైతులు వేదికపైకి దూసుకెళ్లి ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తాడిపర్తి సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సభ్యుడు బాబురావు ఫార్మాసిటీకి మేం పూర్తిగా వ్యతిరేకం, 104 సర్వేనంబర్‌లోని పట్టాదారులు గ్రామంలో ఉండడం లేని చెప్పారు. ఫార్మాసిటీ వద్దు, ఏదైనా కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూ సేకరణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం, అధికారులు వెళ్లిపోవాలని కోరారు. దీంతో చేసేదేమి లేక ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులు అక్కడి నుంచి నిష్కమించారు.
విషమిచ్చి చంపేయండి
ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రకృతికి హాని తలపెట్టే ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. కాలుష్యం వల్ల రోగాలబారిన పడి చచ్చే బదులు, ఒకేసారి అందరికీ విషం ఇచ్చి చంపేయండి. అందరం ఏకమై ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకుంటాం. రైతులకు న్యాయం చేయాలి.
– కె. నారాయణ, రైతు తాడిపర్తి
ఫార్మాసిటీకి వ్యతిరేకం...
ఫార్మాసిటీకి మేము పూర్తి వ్యతిరేకం. ఫార్మాకు బదులు కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయండి. నేనే ముందుండి భూములు ఇప్పిస్తా. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం. అధికారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
– డి. రమేష్, సర్పంచ్ తాడిపర్తి
Comments
Please login to add a commentAdd a comment