ప్రజాభిప్రాయ సేకరణ సభను అడ్డుకుంటున్న రైతులు, బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు
సాక్షి, యాచారం: ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, వైస్ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నందివనపర్తి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, తహసీల్దార్ నాగయ్యలు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వంద అడుగుల రోడ్డు కోసం ఇరువైపులా 60 ఎకరాల వ్యవసాయ భూమి కావాల్సి ఉంది. భూమిని సేకరించడానికి నింబంధనల ప్రకారం నోటిఫికేషన్లు ప్రకటించిన అధికారులు బుధవారం నందివనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభంలో భూసేకరణ నింబంధనలను ఆర్డీఓ వెంకటాచారి రైతులకు వివరించారు. ఫార్మాసిటీ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఫార్మాను అడ్డుకోవద్దని సూచించారు.
సభలో గందరగోళం
ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతుండగానే రైతులు లేచి.. సార్ అసలు ఫార్మాసిటీ ఏర్పాటే వద్దని అంటుంటే.. రోడ్డు విస్తరణ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా వేదికపై కూర్చున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు లేచి ఫార్మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే రైతులంతా ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. కొంతమంది రైతులు అధికారులపై కుర్చీలు వేశారు. టెంటును కూల్చేశారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రైతులను, ఆందోళనకారులను పక్కకు తోసేశారు. కొంతమంది ఆందోళనకారులను, రైతులను అరెస్టు చేసి వాహనంలో యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సభ వద్ద ఉన్న మరికొందరు రైతులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో అధికారులపై దాడులు చేయడానికి యత్నించగా అధికారులు అర్ధంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ సభను నిలిపేసి వెళ్లిపోయారు. కాగా, నింబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ సభను పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.
ఇదేక్కడి దారుణం..
ఫార్మానే వద్దంటే.. అధికారులు బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ, పట్టా భూముల సేకరణకు జనరల్ అవార్డు పాస్‌చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. నందివనపర్తిలో రైతులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మాకు వ్యతిరేకంగా రైతుల్లో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో సర్కారు బలవంతంగా భూసేకరణకు దిగడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా న్యాయస్థానాలను ఆశ్రయించి బలవంత భూసేకరణను అడ్డుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాను రద్దు చేసి రైతుల భూములను తిరిగి ఇస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్యయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, బీజేపీ నాయకులు కొండూరి రామనాథం, గోగికార్ రమేష్, విజయకుమార్, నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ ముత్యాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment