సాక్షి, రంగారెడ్డిజిల్లా: మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతల ను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బ ందిని ఏర్పాటు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తల్లులను కోల్పోయిన పిల్లలు
►ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో ముగ్గురు తల్లులు మృత్యువాత పడగా, మరొకరు వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు.
►ఆమనగల్లు మండలం గౌరారం గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి (ఆదిలక్ష్మీ నర్సింగ్ హోం/సీబీఎం) తరలించారు. ఈ నెల 23న వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగింపు సర్జరీ చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతిచెందగా పిల్లలు అనాథలయ్యారు.
బిడ్డలను కోల్పోయిన తల్లులు
►కొందుర్గు మండలం, తంగెళ్లపల్లికి చెందిన మేఘమాల పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గత గురువారం చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకున్న సిబ్బంది ఆ తర్వాత నిర్లక్ష్యం చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నొప్పులు అధికమై బిడ్డ కడుపులో అడ్డం తిరగడంతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. హుటాహుటిన ప్లేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిడ్డ చనిపోయింది.
►నందనవనంలో నివసించే సరిత(24) పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 4న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి మరో నెల ఉందన్నారు. నొప్పులు భరించలేక పోతున్నానని సరిత చెప్పడంతో అడ్మిట్ చేశారు. ఉదయం అడ్మిటైన గర్భిణిని సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సిజేరియన్ చేయగా అప్పటికే కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది.
అట్టుడికిన ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం: కు.ని ఆపరేషన్లు వికటించి ముగ్గు రు మహిళలు మృతి చెందిన సంఘటనతో సోమవా రం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుష్మ మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉంచి ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వీరికి మద్దతుగా నిలిచారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్వలక్ష్మిని చుట్టుముట్టి నిలదీశారు.
ఎక్స్‌గ్రేషియా.. డబుల్ బెడ్రూం.. విచారణకు హామీ
ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీఓ వెంకటాచారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినా ససేమిరా అనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్డీఓ విషయాన్ని ఫోన్‌ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు.
సమగ్ర విచారణ జరిపిస్తాం
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీహెంహెచ్‌ఓ నాగజ్యోతితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 25న డీపీఎల్ క్యాంపులో 34 మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. వీరిలో నలుగురికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. వీరిలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎక్స్‌పర్ట్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
– ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్
చదవండి: (తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1)
Comments
Please login to add a commentAdd a comment