blackout
-
దిక్కుమాలిన టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్‌టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్ -
పరిమితికి మించి లగేజీ ఉందని..
వారణాసి: రూలంటే రూలే. దేశానికి అధ్యక్షుడైనా కట్టుబడి ఉండాల్సిందే. అదే అమలు చేయాలనుకున్నారు అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చిన మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో అందుకు గాను అదనంగా ఫీజు చెల్లించాలని ఎయిరిండియా అధికారులు అడ్డుకున్నారు. ఆరుగురు సభ్యుల అధికార బృందంతోపాటు రెండు రోజుల పర్యటనకు కాశీకి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో లాల్‌బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆకాశ్‌దీప్ మాథుర్, జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ వరకు వెళ్లింది. విదేశీ గౌరవ ప్రతినిధి అయినందున ఆయనకు మినహాయింపు ఇవ్వాలని తెలపడంతో కథ సుఖాంతమయింది. సాధారణంగా ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులు 23 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకుమించి ప్రతి కేజీకి రూ.500, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. -
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం
సాక్షి, మేడ్చల్: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి తన సొంత ఇలాకాలో బుధవారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పుట్టిపెరిగిన ఊరు, మంత్రికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల సామ్రాజ్యంతో నిండిపోయిన మైసమ్మగూడలో మంత్రి మల్లారెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వివరాల్లోకెళ్తే... గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం మైసమ్మగూడలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు వస్తున్న మంత్రి కాన్వాయ్‌ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమ కాలనీలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. దీంతో కంగు తిన్న మంత్రి మల్లారెడ్డి కాలనీలో పర్యటించి సమస్యలు తెలసుకున్నారు. గ్రామంలోని కాలనీల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
బలవంతంగా భూమిని తీసుకుంటే ఊరుకోం
సాక్షి, యాచారం: ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయొద్దు.. ఇప్పటికే సేకరించిన అసైన్డ్ భూములకు సంబంధించి రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదు. పర్యావరణానికి హాని చేసే ఫార్మాసిటీ తమకు వద్దని బుధవారం యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రైతులు బహిష్కరించారు. ఫార్మాసిటీ ఏర్పాటును తాము ఇప్పటికే నిరాకరించామని, తిరిగి ఎందుకు వచ్చారని అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామస్తులకు మద్దతుగా సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ బాబురావు ఫార్మాసిటీ అభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. తాడిపర్తి రెవెన్యూ పరిధిలోని 104తోపాటు మరికొన్ని సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 900 ఎకరాలకు పైగా భూమిని సేకరించే క్రమంలో బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. ఎంపీపీ జాపాల సుకన్యభాషా, సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ బాబురావు, తహసీల్దార్ పుష్పలత తదితరులు హాజరయ్యారు. మొదట ఆర్డీఓ అమరేందర్ గ్రామంలోని 104 సర్వే నంబరులోని పట్టా భూమి 820 ఫార్మాసిటీ ఏర్పాటుకు ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అభ్యంతరాలుంటే చెప్పాలని రైతులు, గ్రామస్తులకు సూచించారు. దీంతో పలువురు రైతులు ఫార్మాసిటీ మాకు వద్దని ఇప్పటికే చెప్పాం. మళ్లీ భూసేకరణ ఏంటీ.. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకంటూ నిలదీశారు. 104 సర్వే నంబరులో అందరూ భూస్వాములు ఉన్నారు. పట్టాలున్న వారెవరూ స్థానికులు కాదన్నారు. ఏళ్ల క్రితం ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో కొన్ని నకిలీ పట్టాలు కూడా ఉన్నాయన్నారు. కలెక్టర్ స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణకు రావాలని రైతులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ వెంకటయ్య పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈక్రమంలో అధికారులు, పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. న్యాయమైన పరిహారమేదీ? రెండేళ్ల క్రితం తాడిపర్తి గ్రామంలోని 155, 66 తదితర అసైన్డ్ సర్వే నంబర్లల్లోని వందల ఎకరాల భూములను ఫార్మాసిటీ కోసం బలవంతంగా సేకరించారని రైతులు తెలిపారు. భూములు ఇవ్వకపోతే పీఓటీ కింద స్వాధీనం చేసుకుంటామని బెదిరించడంతో భూములు ఇచ్చామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పలు సర్వేనంబర్లలో అసైన్డ్ పట్టాలిచ్చారని తెలిపారు. తాము కబ్జాలో ఉన్నా 37 మంది రైతులకు ఏళ్లు గడుస్తున్నా పరిహారమే అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ రజత్‌కుమార్ సైనీ, రాళ్లు, గుట్టల భూములకు, పాసుపుస్తకంలో ఉన్న విస్తీర్ణం మొత్తానికి న్యాయమైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాతే పట్టా భూముల జోలికి రావాలని స్పష్టం చేశారు. ఫార్మాసిటీకి భూసేకరణ చేసేందుకు తహసీల్దార్ పుష్పలత తమ భూములకు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తా: ఆర్డీఓ తాడిపర్తి గ్రామంలో పట్టా భూములను సేకరించే విషయంలో గ్రామస్తులు, రైతుల అభిప్రాయాలను కలెక్టర్‌కు హరీష్ దృష్టికి తీసుకెళ్తానని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్ పేర్కొన్నారు. దయచేసి ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించాలని రైతులను కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు అసలు ఫార్మాసిటీ వద్దంటే.. వద్దు అని అంటుంటే సహకరించాలని చెప్పడం ఏంటన్నారు. ఆర్డీఓ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రశాంతంగా కూర్చీల్లో కూర్చున్న రైతులు వేదికపైకి దూసుకెళ్లి ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తాడిపర్తి సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సభ్యుడు బాబురావు ఫార్మాసిటీకి మేం పూర్తిగా వ్యతిరేకం, 104 సర్వేనంబర్‌లోని పట్టాదారులు గ్రామంలో ఉండడం లేని చెప్పారు. ఫార్మాసిటీ వద్దు, ఏదైనా కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూ సేకరణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం, అధికారులు వెళ్లిపోవాలని కోరారు. దీంతో చేసేదేమి లేక ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులు అక్కడి నుంచి నిష్కమించారు. విషమిచ్చి చంపేయండి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రకృతికి హాని తలపెట్టే ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంది. కాలుష్యం వల్ల రోగాలబారిన పడి చచ్చే బదులు, ఒకేసారి అందరికీ విషం ఇచ్చి చంపేయండి. అందరం ఏకమై ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకుంటాం. రైతులకు న్యాయం చేయాలి. – కె. నారాయణ, రైతు తాడిపర్తి ఫార్మాసిటీకి వ్యతిరేకం... ఫార్మాసిటీకి మేము పూర్తి వ్యతిరేకం. ఫార్మాకు బదులు కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయండి. నేనే ముందుండి భూములు ఇప్పిస్తా. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం. అధికారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. – డి. రమేష్, సర్పంచ్ తాడిపర్తి -
చొప్పదండి ఎమ్మెల్యేకు చుక్కెదురు.!
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాల్లో సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను నీలోజిపల్లి, కుదురుపాక గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట పరిసరాల్లో ఎంపీ సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే వచ్చారు. మొదట ప్రాజెక్ట్ సమీపంలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తనను నిర్వాసితులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో నిర్వాసితులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మిడ్‌మానేరు కట్టపై నుంచి గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న నిర్వాసితులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే వాహనం ఎదుట బైఠాయించారు. వెంట ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుతప్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రావాలని నిర్వాసితులు పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనం దిగి నిర్వాసితులు కూర్చున్న స్థలం వద్దకు వచ్చి కూర్చున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.2 లక్షల ప్యాకేజీతోపాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ను బతిమిలాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో సమస్యలపై మాట్లాడేందుకు రావాలని ఎమ్మెల్యే వారిని కోరినా స్పందించకపోవడంతో బైఠాయించిన నిర్వాసితులను పోలీసులు పక్కకు తొలగించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కోటవురట్ల(పాయకరావుపేట): టి.జగ్గంపేట గ్రామంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. టి.జగ్గంపేట గ్రామంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ బాలికకు వివాహం చేస్తున్నట్టు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ ద్వారా కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. తక్షణమే వివాహాన్ని ఆపాలని ఆయన ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. పీడీ ఆదేశాలతో స్థానిక సీడీపీవో ఇందిరాదేవి సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని విచారణ చేశారు. బాలికకు అదే గ్రామంలో ఉన్న ఆమె మేనమామతో వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారని, శుక్రవారం రాత్రికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు తెలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులను కలుసుకుని బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మేజరు కాకుండా వివాహం చేయడం చట్టరిత్యా నేరమని, వెంటనే పెళ్లిని ఆపాలని కోరారు. ఎస్ఐ తారకేశ్వరరావు బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వివాహం నిలిపివేసేందుకు బాలిక తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు.