బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కోటవురట్ల(పాయకరావుపేట): టి.జగ్గంపేట గ్రామంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. టి.జగ్గంపేట గ్రామంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ బాలికకు వివాహం చేస్తున్నట్టు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ ద్వారా కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. తక్షణమే వివాహాన్ని ఆపాలని ఆయన ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. పీడీ ఆదేశాలతో స్థానిక సీడీపీవో ఇందిరాదేవి సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.
బాలికకు అదే గ్రామంలో ఉన్న ఆమె మేనమామతో వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారని, శుక్రవారం రాత్రికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు తెలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులను కలుసుకుని బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మేజరు కాకుండా వివాహం చేయడం చట్టరిత్యా నేరమని, వెంటనే పెళ్లిని ఆపాలని కోరారు. ఎస్‌ఐ తారకేశ్వరరావు బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వివాహం నిలిపివేసేందుకు బాలిక తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు.