వారణాసి: రూలంటే రూలే. దేశానికి అధ్యక్షుడైనా కట్టుబడి ఉండాల్సిందే. అదే అమలు చేయాలనుకున్నారు అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చిన మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో అందుకు గాను అదనంగా ఫీజు చెల్లించాలని ఎయిరిండియా అధికారులు అడ్డుకున్నారు. ఆరుగురు సభ్యుల అధికార బృందంతోపాటు రెండు రోజుల పర్యటనకు కాశీకి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో లాల్‌బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆకాశ్‌దీప్ మాథుర్, జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ వరకు వెళ్లింది. విదేశీ గౌరవ ప్రతినిధి అయినందున ఆయనకు మినహాయింపు ఇవ్వాలని తెలపడంతో కథ సుఖాంతమయింది. సాధారణంగా ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులు 23 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకుమించి ప్రతి కేజీకి రూ.500, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment