TikTok: Several Kids Have Lost Their Lives Owing to the Infamous Blackout Challenge - Sakshi
Sakshi News home page

Tiktok Blackout Challenge: దిక్కుమాలిన టిక్‌టాక్‌ బ్లాకౌట్‌ ఛాలెంజ్‌! ఏడుగురు చిన్నారులు బలి

Published Fri, Jul 8 2022 2:22 PM | Last Updated on Sat, Jul 9 2022 8:59 AM

Several Kids Have Lost Their Lives Owing to the Infamous Blackout Challenge on TikTok  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే..  దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్‌ తీసుకొచ్చిన 'బ్లాకౌట్‌ ఛాలెంజ్‌' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. 

ఏమిటీ బ్లాకౌట్‌ ఛాలెంజ్‌?
యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్‌.. బ్లాకౌట్‌ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్‌.. ఆక్సిజన్‌ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. 

బ్లాకౌట్‌ ఛాలెంజ్‌ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్‌ న్యూస్‌ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్‌(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్‌లో పెన్సిల్వేనియాలో 10 ఏళ‍్ల బాలిక మృతి చెందారు.

టిక్‌టాక్‌ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్‌ అండర్సన్‌ తల్లి తవైన అండర్సన్‌. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. 

వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. 
టిక్‌టాక్‌ బ్లాకౌట్‌ ఛాలెంజ్‌ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్‌ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
చదవండి: మాల్‌ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్‌ స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement