
ఔషధనగరికి రాచమార్గం
ఫార్మాసిటీ కోసం నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం
ఔషధనగరికి కార్యరూపం ఇచ్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఔషధ దిగ్గజ కంపెనీలకు ఎర్రతివాచీ పరిచేందుకు నాలుగు వరుసల రహదారులను అభివృద్ధి చేస్తోంది. ఫార్మా సంస్థలన్నింటినీ ఇక్కడకు తరలించాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. కందుకూరు మండలం ముచ్చర్ల ఫార్మాసిటీని కలుపుతూ రహదారులను అనుసంధానం చేస్తోంది. ఒకవైపు శ్రీశైలం జాతీయ రహదారి నుంచి నాగార్జున సాగర్ హైవే, ఔటర్‌రింగ్‌రోడ్డును కలుపుతూ మరో మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఏడాది ఆఖరులోగా మోడల్‌ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రోడ్లు భవనాలశాఖ రోడ్డు సర్వే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తోంది. మొదటి విడతలో శ్రీశైలం రహదారి నుంచి మీర్కాన్‌పేట పరిధిలోని పెద్దమ్మ దేవాలయం వరకు నాలుగు వరుసల రహదారికి మార్గం సుగమం చేస్తోంది. - కందుకూరు
8.32 కి.మీలు
⇒ తొలిదశలో 150 అడుగుల వెడల్పుతో 8.32 కిలోమీటర్ల మేర కందుకూరు నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు నాలుగులేన్ల రోడ్డు నిర్మిస్తారు.
15 వేల ఎకరాలు
⇒ మొత్తం ఫార్మాసిటీకి సేకరించాల్సిన భూమి ఇది. అయితే తొలి దశలో మాత్రం ఆరు వేల ఎకరాల్లో ఔషధనగరిని నిర్మించాలని సర్కారు భావిస్తోంది.
65 ఎకరాలు
⇒ మోడల్ ఫార్మాసిటీ నిర్మించే ప్రాంతం. ఫార్మాసిటీ అంటే ఇలా ఉంటుందని, మరిన్ని కంపెనీలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తోంది.
రూ.75 కోట్లు
⇒ భూసేకరణ, రహదారి నిర్మాణానికి టీఎస్‌ఐఐసీ రూ.75 కోట్లను కేటాయించింది.