జాబితాలో హైవే ఇన్‌ఫ్రా
కాసాగ్రాండ్ ప్రీమియర్
రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ
డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్‌సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్‌కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం..
ఐకేర్ కంపెనీ
పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
రియల్టీ డెవలపర్
పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
మౌలిక రంగ సంస్థ
ఈపీసీ ఇన్‌ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది.
మెషీనరీ తయారీ
ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
వెనకడుగులో..
ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్‌లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment