ఫార్మా సిటీపై అధ్యయనం
సమగ్ర నివేదిక తయారీకి సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యర్థాల ట్రీట్‌మెంట్ సరిగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉండే అమెరికా, జపాన్, యూరప్ దేశాలలో పర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలన్న సీఎం, సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని శుక్రవారం నిర్ణయించారు. ‘‘హైదరాబాద్‌లో నెలకొల్పే ఫార్మా సిటీపై జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
కాబట్టి ఫార్మా సిటీ నూటికి నూరు శాతం ప్రమాదరహితంగా, వ్యర్థాలు బయటికి వచ్చే వీలు లేకుండా ఉండాల్సిన అవసరముంది. గతంలో నగరంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీలతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆ పరిస్థితి పునరావృతం కావద్దు’’ అని అధికారులకు ఆయన సూచించారు.
ఏప్రిల్‌లో తొలి దశ!
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మా సిటీ తొలి దశ పనులను ఏప్రిల్‌లో ప్రారంభించాలని అధికారులకు సీఎం సంకేతాలిచ్చారు. ఆ దిశగా మాస్టర్ ప్లాన్‌తో పాటు పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ తయారీకి అంతర్జాతీయ కంపెనీల నుంచి టీఎస్‌ఐఐసీ ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. మొదటి దశలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ముచ్చర్లలో మొత్తం 12 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలోని 5,000 ఎకరాలకు గాను 3,000 ఎకరాలను ఇప్పటికే సేకరించారు.
మార్చి నెలాఖరుకల్లా మిగతా రెండు వేల ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. ఒక్కో పారిశ్రామికవేత్త కనీసం ఎకరం నుంచి గరిష్టంగా 150 ఎకరాలు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. తొలి దశ పనుల మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, అసోసియేషన్లు, ఆర్ అండ్ బీ, కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు మరికొన్ని విభాగాలు ఇందులో ఉన్నాయి. ప్రాజెక్టు రిపోర్టుతో పాటు స్థలాల కేటాయింపులు, పర్యావరణ అనుమతులు, లే అవుట్ల తయారీ తదితర అంశాలన్నీ టాస్క్‌ఫోర్స్ అధ్వర్యంలో జరుగుతాయి.