తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్
సాక్షి, హైదరాబాద్ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లుగానే తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్ వన్‌గా, అవినీతిలో నెంబర్ 2గా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమకు ఒక కుటుంబం ప్రగతి మాత్రమే కనబడుతోందని, ప్రగతి ఇంకా ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు.
అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్ 12న దీక్ష చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోందన్నారు. దేశంలో సెక్రటేరియట్‌కు రాని నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ను గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు. సమయానుకూలంగా తాము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ‘‘25,000 మంది వీఆర్‌ఏలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వస్తుంటే వారిని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలి. రింగ్ రోడ్డును మార్చుతున్నారు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ రైతుల భూములు ఇవ్వమని అభ్యంతరం తెలిపినా వినటం లేదు. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. వారిది ప్రగతి నివేదన మాది ప్రజల ఆవేదన. ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదు.
మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 13,000 టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసింది. మరో 10 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ అయ్యాయి. మన తెలంగాణలో అక్షరాస్యత 36 శాతం ఉంది. స్కూల్‌కు వెళ్లని వారు 30 శాతంపైగా ఉన్నారు. 57 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 పాఠశాలలు మూసివేశారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రైతు అప్పులలో 2 స్థానంలో ఉండగా దాదాపు 35000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సగానికిపైగా ఇప్పటికీ ఖర్చు కాలేదు. పెన్షన్లు అందరికి ఇవ్వడం లేదు.
ఉపాధి హామీ, పెన్షన్‌లపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఒక కుటుంబం కోసం, ఒక కాంట్రక్టర్ కోసం పాలన సాగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పథకం అవినీతి మయం అయ్యాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రగతి నివేదన సభకు రమ్మని అడిగితే ప్రజల సమస్యలను గురించి అడగండి. ధర్నాచౌక్ ఎందుకు ఎత్తి వేసారో అడగండి, పండిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదని అడగండి. నేరేళ్ళలో దళితుల మీద దాడులు ఎందుకు చేశారో అడగండి. అధికార పక్షం వాళ్లు మన దగ్గరకి వస్తున్నారు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అడగండి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావు జాధవ్, గూడ అంజన్నలను కూడా మనం గౌరవించుకోవాల’’ని కోదంరామ్ అన్నారు. (చదవండి: హరికృష్ణ కారు ప్రమాదం.. మరి మా పరిస్థితి ఏంటి!?)
Comments
Please login to add a commentAdd a comment