గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసిన ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయా? అసెంబ్లీ రద్దుకు ఈ సెప్టెంబర్‌లోనే సిఫారసు చేసే అవకాశముందా? గత రెండ్రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ఆ దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేస్తున్న అడుగులను చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో సీఎం జరిపిన సుదీర్ఘ భేటీ అనంతరం గురువారం వడివడిగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవడం, మంత్రి కె.తారక రామారావు ఢిల్లీలోనే ఉండి పలు కీలక భేటీలు జరుపుతుండటం రాజకీయవర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. దీనికితోడు శుక్రవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం పూర్తి కాగానే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ తన మనోగతాన్ని ఎవరికీ వెల్లడించకపోయినా.. జరుగుతున్న పరిణామాలు, ఈ వరుస సమావేశాలు ఎన్నికల మూడ్‌లోకి తీసుకుపోయే విధంగానే ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
నాలుగు రాష్ట్రాలతోపాటు..
మంత్రులతో జరిగిన సమావేశంలో.. ఎన్నికలు ఫలానా సమయంలో జరుగుతాయని సీఎం చెప్పనప్పటికీ.. సన్నద్ధంగా ఉండాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. శాసనసభ రద్దుచేయాలా? వద్దా? చేయాల్సి వస్తే ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలి? అన్నదానిపై సర్వాధికారాలను మంత్రులు సీఎంకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం రాజకీయ వర్గాల్లో, పార్టీల్లో హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంట్, శాసనసభ్యులతో కీలకమైన సమావేశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక రోజు ముందుగా గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిసి తాజా పరిణామాలను వివరించడం రాజకీయంగా వేడిని రగిల్చింది. మంత్రివర్గ సహచరులతో జరిపిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను తెలపడంతోపాటు షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న తన ఆలోచనను వివరించారని సమాచారం. సెప్టెంబర్‌లో శాసనసభను రద్దు చేయడం ద్వారా.. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటూ తామూ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హుటాహుటిన ఢిల్లీకి..
‘ముందస్తు’ అంచనాలకు తగ్గట్టుగా అటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ గురువారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘రాష్ట్ర ప్రభుత్వం షెడ్యుల్ కంటే కాస్త ముందుగా.. ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయంతో ఉంది. అదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఈసీ దృష్టికి తెచ్చారు. దానికి అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సమకూర్చుకోవడం, ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తే ఆటోమెటిక్‌గా ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను మేం ఇప్పటికే ప్రారంభించాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఈసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇటు మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర పెద్దలతోపాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కొందరితో ఆయన భేటీలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
వడివడిగా ప్రారంభాలు..
ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను కూడా అనుకున్న దాని కంటే ముందే ప్రారంభించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయింది. ముఖ్యంగా మిషన్ భగీరథతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సెప్టెంబర్‌లోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఇస్తున్న ఎకరాకు రూ.4 వేల సాయాన్ని కూడా సభ రద్దు కంటే ముందే మరోసారి అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడం గమనార్హం. మంత్రివర్గ సభ్యులతో సమావేశం కాకముందు సెప్టెంబర్ 2న నిర్వహించాలనుకున్న ప్రగతి నివేదన సభను విరమించుకుంటారనే వాదనలు వినిపించాయి. అయితే, అందుకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను యథాతథంగా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్‌లో నిర్వహించే ఈ సభకు కనీసం 25 లక్షల మందిని సమీకరించాలని మంత్రులకు మార్గనిర్దేశనం చేశారు. దీంతో ఈ సభ నుంచే కేసీఆర్ అధికారికంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారనే విషయం స్పష్టమవుతోంది.
2019 జనవరి నాటికి కొత్త ప్రభుత్వం!
నాలుగు రాష్ట్రాలతో పాటే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకు సెప్టెంబర్‌లోనే సిఫారసు చేస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకు అనుగుణంగా అక్టోబర్ నెలలో రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ నెల నుంచే ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ నిమగ్నమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే అదే నెల చివరి వారం... లేదంటే జనవరి మొదటి వారంలో ఎన్నికలు జరపవచ్చు. మొత్తంమీద 2019 జనవరి చివరి నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment