రాజకీయ రణరంగం | telangana political leaders round ups in 2018 | Sakshi
Sakshi News home page

రాజకీయ రణరంగం

Published Sat, Dec 29 2018 12:56 AM | Last Updated on Sat, Dec 29 2018 11:26 AM

telangana political leaders round ups in 2018 - Sakshi

ముందస్తు ఎన్నికలతో 2018 చివరి ఐదు నెలలు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఎన్నికల నామ సంవత్సరం అధికార టీఆర్‌ఎస్‌ను మరింత ఉత్తేజితం చేసి అధికారాన్ని అప్పగించింది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అనుకూల రాజకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. కేసీఆర్‌ వ్యూహాలతో.. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచింది. జమిలి ఎన్నికల నినాదం దేశమంతటా వినిపిస్తున్న వేళ ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఘనవిజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మరోమారు సీఎంగా ఎంచుకున్నారు. దీనికితోడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానంటూ కేసీఆర్‌ ఈఏడాదిలోనే ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’జాతీయనేతగా తన ప్రయాణాన్ని మొద లుపెట్టారు. అటు, టీఆర్‌ఎస్‌ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్తయిపోయాయి. కాంగ్రెస్‌ మరోమారు పరాభవం పొందగా, కేంద్రంలో అధికారంలో ఉన్నా కమలనాథులు రాష్ట్రంలో కనీస ప్రతిభ చూపలేకపోయారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ దేశ వ్యాప్త పర్యటనలు, అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు, తెలంగాణ జనసమితి పేరిట ప్రొఫెసర్‌ కోదండరాం కొత్త పార్టీ, సీపీఎం జాతీయ మహాసభలు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం, ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ఎన్నికల వేళ రాజకీయ హడావుడి, జంపింగ్‌లు జపాంగ్‌లతో పార్టీలు మారిన నేతలు వంటి ఘటనలతో 2018 ఎన్నికలనామ వత్సరంగా మిగిలిపోయింది.    


టీఆర్‌ఎస్‌ అడ్డాగా తెలంగాణ 

2018 సంవత్సరం టీఆర్‌ఎస్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిలిచిపోయింది. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన టీఆర్‌ఎస్‌కు.. 2018 మరో అతిపెద్ద విజయాన్ని అందించింది. కుటుంబ పాలన, అవినీతి అక్రమాలంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా తెలంగాణ ప్రజానీకం కేసీఆరే తమ ఛాంపియన్‌గా నిర్ణయించారు. 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్‌ తీసుకున్న సాహసో పేత నిర్ణయానికి జైకొట్టారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిపించిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఏకంగా 88 స్థానాలను కట్టబెట్టి తెలంగాణ గడ్డ.. టీఆర్‌ఎస్‌ అడ్డా అనే రీతిలో తీర్పునిచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్‌ఎస్‌ పరిస్థితిలో కూడా పూర్తి మార్పు వచ్చి బలీయశక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పనిచేసిన నలుగురు మంత్రులు మాత్రమే ఓటమి పాలుకాగా, చాలా మంది కొత్త నేతలు శాసనసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై పట్టును నిరూపించుకున్న టీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌లోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. ఎలాగూ ఉత్తర తెలంగాణలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న గులాబీ పార్టీ దక్షిణ తెలంగాణలో లభించిన అనూహ్య విజయంతో పూర్తిస్థాయిలో కుదురుకుంటుందనేది రాజకీయ నిపుణుల అంచనా. ఇక పార్టీ పరంగా కూడా కీలక మార్పులకు 2018 వేదిక అయ్యింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగింది. రెండు, మూడేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తికావడంతో టీఆర్‌ఎస్‌కు రెండోబాస్‌గా కేటీఆర్‌ మరింత క్రియాశీలమవుతున్నారు. దీంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి పావులు కదుపుతుండటం గమనార్హం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్‌ దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు.  


కాంగ్రెస్‌కు రెండో‘సారీ’ 

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా వరుసగా రెండోసారి ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అధికారం దక్కుతుందనే కోటి ఆశలతో టీడీపీ సహా పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోరాడినా పెద్దగా కలసిరాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుబాటలో పయనిస్తే ఇక్కడ మాత్రం బోల్తాకొట్టింది. ఎన్నికల్లో ఓటమితో కేడర్‌ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోగా, కనీసం ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం ముందుకు రాకపోవడం, సమీక్షించుకుని మళ్లీ రణరంగంలో దిగేందుకు టీపీసీసీ ముఖ్యులు కూడా ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసివచ్చిందేమీ లేదు. ఎన్నికలు జరిగినప్పటికీ పార్టీ నుంచి ఎంత మంది వచ్చారో.. అంతే మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు పార్టీ కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయడం, రేవంత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించడం లాంటి పరిణామాలు తప్ప పెద్దగా జరిగిందేమీ లేకపోవడం గమనార్హం. 


మీ సోపతి.. మాకొద్దు ‘బాబో’య్‌ 

రాష్ట్ర రాజకీయాల్లో 2018లో జరిగిన కీలక పరిణామం.. తెలంగాణ ప్రజలు 
చంద్రబాబుతో సావాసాన్ని అంగీకరించకపోవడమే. తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ను కలిపి కుమ్మేశారు. చంద్రబాబు ప్రచార పటాటోపాలకు ఏమాత్రం తలొగ్గని తెలంగాణ ప్రజలు ఆయనతో సోపతి మాకు వద్దంటే వద్దని తేల్చేశారు. దీంతో 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న టీడీపీ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. నేతలు పార్టీ మారినా కేడర్‌పోలేదని, తమ ఓట్లు తమకున్నాయని గొప్పలు చెప్పుకున్న తమ్ముళ్ల గూబగుయ్‌మనేలా ప్రజలు తీర్పునిచ్చారు.  

పైన ఉన్నా.. ఇక్కడ సున్నా 
2018 కమలనాథులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మాతోనయినా కొంతమేర గట్టెక్కుదామని ఆశించిన రాష్ట్ర బీజేపీ నేతలకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. దక్షిణ భారతదేశంలో కాషాయదళం పాగా వేసేందుకు ప్రయోగాత్మకంగా తెలంగాణను బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరిగినా.. బీజేపీ మాత్రం ఉన్నస్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని స్వీకరించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సహా ముఖ్య నాయకులు కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో మళ్లీ సున్నా నుంచి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి తప్పలేదు. ఇక, పార్టీ పరంగా కూడా ఈ ఏడాది చెప్పుకోదగిన పరిణామాలేవీ సంభవించలేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో టికెట్లు రాని నేతలు ఎన్నికల వేళ పార్టీలో చేరడం మినహా బీజేపీకి 2018లో కలిసివచ్చిందేమీ కనిపించలేదు.

కమ్యూనిస్టులు ఖతమే!
ఈ ఏడాది రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్‌తో గుడ్డిగా పొత్తు కుదుర్చుకుని సీపీఐ, సామాజిక న్యాయం ఎజెండా అంటూ బీఎల్‌ఎఫ్‌ పేరుతో కూటమి కట్టిన సీపీఎంలు బొక్కబోర్లా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండో అసెంబ్లీలోనే వారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష ఓట్లు చీలుస్తామని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేమని తెలిసినా కులాల వారీ టికెట్లు కేటాయించి సీపీఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకోగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జట్టుకట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎంఐఎంకు మాత్రం 2018 మంచి మిత్రుడిని తెచ్చిపెట్టింది. టీఆర్‌ఎస్‌ రూపంలో లభించిన దోస్తానాతో మంచి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం పాతబస్తీలో మరోమారు తన పట్టు నిరూపించుకుంది.

2018లో జరిగిన ముఖ్య రాజకీయ ఘటనలు

మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ప్రకటించిన సీఎం కేసీఆర్‌. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి.
 
మార్చి 12: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగ సమయంలో కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన. కాంగ్రెస్‌ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్‌ తగిలి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి గాయం. 

మార్చి 13: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెన్షన్‌. ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా చర్యలు. 

మార్చి 23: జె.సంతోశ్, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్‌లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక. 

ఏప్రిల్‌ 2: తెలంగాణ జనసమితి పార్టీ పేరును ప్రకటించిన కోదండరాం. అదే నెల4వ తేదీన పార్టీ జెండావిష్కరణ. 

ఏప్రిల్‌ 18: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం. ఐదు రోజుల పాటు సభలు. 

ఏప్రిల్‌ 27: కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ. హైదరాబాద్‌లోనే ఉండి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.
 
మే 2: ఫెడరల్‌ఫ్రంట్‌ రూపకల్పనలో భాగంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌. 

మే 23: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం. తొలిసారి బహిరంగంగా ఒకేచోట కనిపించిన రాహుల్, చంద్రబాబు.
 
జూన్‌ 28: విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్‌. వజ్రఖచిత ముక్కుపుడక సమర్పణ. 

జూలై 27: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా ప్రభుత్వ భూమి కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం.
 
ఆగస్టు 4: ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్‌. జమిలి ఎన్నికలపై చర్చ. 

ఆగస్టు 13, 14: హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. స్వయం సహాయక సంఘాల మహిళలు, సెటిలర్లతో భేటీలు. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిరుద్యోగ గర్జన.
 
ఆగస్టు 22: ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సహచరులతో ఏడుగంటలపాటు సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ భేటీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించిన మంత్రివర్గ సహచరులు. 

ఆగస్టు 24: టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయిన కేసీఆర్‌.
 
ఆగస్టు 25: ఢిల్లీ వెళ్లి ప్రధానితో కేసీఆర్‌  ముందస్తుపై భేటీ. 

సెప్టెంబర్‌ 2: కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రగతినివేదన సభ. 

సెప్టెంబర్‌ 5: ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో సన్నబియ్యం, సొంతిల్లు లాంటి ప్రజాకర్షక హామీలు ప్రకటించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 

సెప్టెంబర్‌ 6: శాసనసభను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం. 8 నెలల 26 రోజుల ముందే సభను రద్దు చేస్తూ కేబినెట్‌ చేసిన తీర్మాన కాపీని గవర్నర్‌కు అందజేసిన సీఎం కేసీఆర్‌. వెంటనే 105 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన. 

సెప్టెంబర్‌ 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. 

సెప్టెంబర్‌ 19: ఎన్నికల సైన్యాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్‌ రెడ్డి, పొన్నం నియామకం. 

అక్టోబర్‌ 4: ఎన్నికల నగారా ఆలంపూర్‌ నుంచి ప్రారంభించిన కాంగ్రెస్‌. 

అక్టోబర్‌ 10: రాష్ట్రంలో ఎన్నికలకుషెడ్యూల్‌ విడుదల.  

నవంబర్‌ 5: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ.  

నవంబర్‌ 12: 65 మందితో కాంగ్రెస్, 9 మందితో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.
 
నవంబర్‌ 20: టీఆర్‌ఎస్‌కు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా. 

నవంబర్‌ 23: మేడ్చల్‌ కాంగ్రెస్‌ బహిరంగసభ. హాజరయిన సోనియా, రాహుల్‌.
 
నవంబర్‌ 27: నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రధాని మోదీ బహిరంగసభలు. ప్రజాకూటమి మేనిఫెస్టో విడుదల.
 
డిసెంబర్‌ 7: ప్రశాంతంగా శాసనసభకు ఎన్నికలు.
 
డిసెంబర్‌ 11: ఎన్నికల ఫలితాలు విడుదల. 88 స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపు.
 
డిసెంబర్‌ 13: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌. మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్‌ అలీ. 

డిసెంబర్‌ 14: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఎన్నిక.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement