సాక్షి, మహబూబ్‌నగర్: చంద్రబాబు నాయుడిలా తాను పిరికివాడిని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో కరెంట్ బాధ ఉందని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఇంత తప్పుడు మాటలు మాట్లాడొచ్చునా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కరెంట్, నీళ్ల సమస్య ఉందని నిరూపించాలని మోదీకి సవాల్ విసిరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఇంతకుముందు సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు.
‘గ్రహచారం బాలేక మోదీ మనతో పెట్టుకున్నారు. ఇంత తెలితక్కువ ప్రధాని అనుకోలేదు. నిజామాబాద్‌లో నీళ్లు, కరెంట్ సమస్య ఉందని మోదీ అన్నారు. హెలికాప్టర్ ఎక్కి మహబూబ్‌నగర్ నుంచి నేరుగా నిజామాబాద్‌కే వస్తా. దమ్ముంటే నిజానిజాలేంటో నిజామాబాద్‌లోనే తేల్చుకుందాం. ఎవరేంటో ప్రజలే తేలుస్తారు. తెలంగాణలో కరెంట్ సమస్య ఉందని మోదీ అబద్ధలాడారు. ప్రధానమంత్రి తప్పుడు మాటలు మాట్లాడొచ్చునా? ఇంత అల్పంగా మాట్లాడొచ్చునా? మాట్లాడతారు ఎందుకంటే రాజకీయం. అంత దరిద్రపుగొట్టు రాజకీయం. అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. వాళ్ల అధ్యక్షుడు కూడా ఇంతకుముందొచ్చి అడ్డంపొడుగు మాట్లాడారు. రుజువు చేస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని, రుజువు చేయలేకపోతే అబిడ్స్ దగ్గర ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరాను. ఈ రోజు కూడా మోదీని చాలెంజ్ చేస్తున్నాను. తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు. బాధ్యతాయుతమైన ప్రధాన మంత్రి పదవిలో ఉండి ఓట్ల కోసం అబద్దాలు చెప్పడం సరికాదు. ముఖ్యమంత్రిపై నిరాధార ఆరోపణలు చేయడం భావ్యం కాదు. నేనేవరికీ భయపడను. నేనేందుకు భయపడతా? నేనేమైనా చంద్రబాబు నాయుడినా భయపడటానికి? నాకేం భయం లేదు. నాదంతా తెరిచిన పుస్తకం. కాబట్టి నేనేవరికీ భయపడాల్సిన అవసరం లేద’ని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మజ్లిస్ పార్టీ తమ మిత్రపక్షమని స్పష్టం చేశారు. తమ రెండు పార్టీలు పక్కా తెలంగాణ పార్టీలని చెప్పుకొచ్చారు. మోదీతో కలిసి చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసిన కుట్ర గురించి తమకు సమాచారం ఇచ్చింది అసదుద్దీన్ ఒవైసీ అని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన పెట్టించాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. ఇటువంటి చంద్రబాబు అవసరం తెలంగాణకు లేదని అన్నారు. కాంగ్రెస్‌కు గెలిచే సత్తా లేక చంద్రబాబును భుజాలపై మోసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులను ఓడిస్తే తనకు సంతోషం కలగదని, డిపాజిట్ రాకుండా చేయాలని ఓటర్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment