కూకట్‌పల్లి నియోజకవర్గం కైతలాపూర్‌లో సోమవారం జరిగిన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, చంద్రబాబు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ తదితరులు
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే గడువుండడంతో రాజకీయ పార్టీలు సోమవారం ప్రచారంలో పోటీపడ్డాయి. బీజేపీ జాతీయనేత, ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ నాయకుడు చంద్రబాబు, సీపీఐ నేత నారాయణ తదితరులు తమ ప్రసంగాలతో హోరెత్తించారు. ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లిల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చంద్రబాబు, రాహుల్, నారాయణ కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఆధునిక నగరంగా హైదరాబాద్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దానని, దేశంలో నెంబర్–1 స్థానంలో ఉండాల్సిన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో హైదరాబాద్‌లో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కొన్ని లక్షల మందికి ఎన్టీఆర్ రాజకీయ జన్మనిస్తే సమర్థులను తాను ప్రోత్సహించానన్నారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుంటే పనులు కావని, జనంలోకి వస్తేనే పనులవుతాయన్నారు.
రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశం, కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా దివాళా తీశాయన్నారు. కేసీర్ అంటే ఖావో కమీషన్‌రావు అని, టీఆర్‌ఎస్ తెలంగాణ ఆరెస్సెస్ అని అభివర్ణించారు. సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని, కేసీఆర్ ఫాంహౌస్‌లో వంకాయలు పండించుకోవాల్సిందేనన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పాలనను అందించలేని వారు కేంద్ర రాజకీయాల్లో వేలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
పదేపదే అదే మాట.. పాట
సోమవారం నిర్వహించిన రోడ్‌షోల్లో నేతల ప్రసంగాలు గతంలో చెప్పిందే మళ్లీమళ్లీ చెప్పారు. హైదరాబాద్‌ను పూర్తిగా అభివృద్ధి చేశానని చంద్రబాబు పదే పదే చెప్పుకోవడం గమనార్హం. దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో కలిశానన్నారు. రాహుల్ ప్రసంగంలోనూ ఎక్కడా కొత్తదనం కనిపించలేదు. కొద్ది రోజులుగా అన్ని సభల్లో మాట్లాడుతున్న అంశాలనే నగరంలోనూ ఉద్ఘాటించారు.
గెలుపు మంత్రం.. గ్లామర్ తంత్రం
ప్రజాకూటమిలో అగ్రనేతలు, జాతీయ నాయకులు, సినీ గ్లామర్‌తో ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్, టీడీపీ అగ్ర నేతలు నగరంలోనే తిష్టవేసి కూటమి అభ్యర్థలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు పార్టీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల్లోనూ ఉత్తేజం కనిపిస్తున్నా ప్రత్యర్థులకు మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు. మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా మిగితాచోట్ల పరిస్ధితి అంతంతంట్లుంది. సోమవారం కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంలు పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు.
ప్రచారంలో పెద్దలు..
కాంగ్రెస్ పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సనత్‌నగర్, నాంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, రేవంత్ రెడ్డి, అధికార ప్రతినిధి మధుయాష్కి, ఏఐసీసీ ప్రతినిధులు సిద్ధూ, మాజీ కేంద్ర మంత్రులు అహ్మద్ పటేల్, జైపాల్‌రెడ్డి, మైనారిటీ సెల్ జాతీయ అధ్యక్షడు నదీమ్ జావిద్, కపిల్ సిబల్.. సినీ తారలు విజయశాంతి, కుష్బు, నగ్మా, ఏపీ, మహాæరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్ తదితరుల రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యులు, మాజీ మంత్రులు నగరంలో సుడిగాలి పర్యటనలు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీటీడీపీ అధ్యక్షుడు ఎన్. రమణ, సినీనటులు బాలకృష్ణ, తారకరత్న, కళ్యాణ్‌రామ్ తదితరులు ప్రచారంలో భాగం పంచుకున్నారు. టీజేఎస్ పక్షాన కోదండరాం, సీపీఐ చాడ వెంకట్‌రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి కూడా ప్రచారం చేశారు.
కనిపించని గట్టిపోటీ
గ్రేటర్‌లోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15, టీడీపీ ఏడు, టీజేఎస్ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రజా కూటమి నవంబర్ మొదటి వారంలో జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నా సాధ్యం కాలేదు. అసమ్మతి, బుజ్జగింపులతో మినేషన్ల ఉపసంహరణ కూడా చివరి వారం వరకు కొనసాగింది. ప్రత్యేకంగా పాతబస్తీపై దృష్టి సారించి మజ్లిస్‌ను టార్గెట్æ చేసింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించినా బలమైన అభ్యర్థులను మాత్రం రంగంలోకి దింపలేక పోయింది. మిగితా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినా ఎక్కడా గట్టి పోటీ మాత్రం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment