విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. చిత్రంలో కోదండరాం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కలలుకన్న తెలంగాణను నిర్మించడంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, ముస్లింలీగ్‌తో కూడిన ప్రజాకూటమి నేతలు ఆరోపించారు. ఆయన నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలన్నా, ప్రజాపాలన రావాలన్నా తమను గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే పాలనలో అందరినీ భాగస్వాములను చేస్తామని, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిరక్షణ, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. విజయవంతమైన డైనమిక్ తెలంగాణను నిర్మిస్తామన్నారు.
ఇందుకు తెలంగాణ ప్రజలు ఈసారి తమను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలంగాణ అధ్యక్షుడు ఘనీ సాహెబ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ అధికార ప్రతినిధులు మధుయాష్కీగౌడ్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కర్ణాటక ఎంపీ నాసిర్ హుస్సేన్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు రాహుల్, చంద్రబాబు, ఉత్తమ్ సమాధానాలిచ్చారు. ఆ సమాధానాలు వారి మాటల్లోనే...
కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిందే...
రైతు సంక్షోభం అనేది జాతీయ సమస్య. రైతులంటే అప్పులే అనే భావనలో ప్రస్తుత పాలకులున్నారు. కానీ మేం జాతిసంపద అనుకుంటున్నాం. 15 మంది బడాబాబులకు రూ. 3.50 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్రధాని మోదీ కోట్లాది మంది రైతులకు దాన్ని ఎందుకు వర్తింపజేయలేదు? మేం రైతు రుణమాఫీని తెలంగాణలో చేసి చూపిస్తాం. సాంకేతిక పరిజ్ఞా నంతో ఇక్కడి రైతులను జాతీయ, ప్రపంచ స్థాయిలో అనుసంధానిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు గౌరవం లభించాలి. రైతుల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరు అవుతారనేది అప్రస్తుతం. కేసీఆర్‌ను గద్దెదించడమే మా మొదటి లక్ష్యం. అది జరిగిన తర్వాత సీఎం ఎవరనే చర్చ ప్రారంభమవుతుంది. మేం ఎవరికీ తాయిలాలు ఇవ్వాలనుకోవట్లేదు. ఉపాధి కల్పన, రైతుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తాం. జిల్లాస్థాయిలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం. విద్య, వైద్య రంగాలకు అదనపు నిధులు కేటాయిస్తాం.
ప్రభుత్వ సంస్థల్లోనే నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. నోట్ల రద్దు అనేది యువకులు టార్గెట్‌గా మోదీ చేసిన నేరం. ఆ నిర్ణయాన్ని కేసీఆర్ ఎలా సపోర్ట్ చేశారు? జీఎస్టీ అమలు ఇలా కాదని ఎందుకు చెప్పలేకపోయారు? అందుకు కారణం ఒక్కటే.. అవినీతి. ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కుడిని కాదు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలి. అందుకే మేం గెలుస్తామన్న విశ్వాసం ఉంది. ఇందుకు కేసీఆర్ వ్యవహారశైలి కూడా అద్దం పడుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆహార్యం, చేస్తున్న వ్యాఖ్యలు, తిట్లు ఆయన అభద్రతకు, నైరాశ్యానికి అద్దంపడుతున్నాయి. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిందే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఇంకెవరినీ కన్విన్స్ చేయాల్సిన పనిలేదు. దేశంలోని అన్ని వ్యవస్థలపై మోదీ, అమిత్ షా దాడి చేస్తున్నారని చంద్రబాబు నన్ను కలిసినప్పుడు చర్చించుకున్నాం.
– రాహుల్
తెలంగాణ నేతలే పాలిస్తారు...
కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన జరుగుతుందనే వ్యాఖ్యలు అర్థరహితం. రాబోయే కూటమి ప్రభుత్వంలో పాలన హైదరాబాద్ నుంచే జరుగుతుంది. తెలంగాణ నేతలే పాలిస్తారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఏమీ మాట్లాడటానికి లేకనే అసందర్భంగా కేసీఆర్ ఈ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఇలాంటివి చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారు.
– ఉత్తమ్
కాళేశ్వరం తప్ప అన్నీ నేనే..
తెలంగాణలో కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులన్నీ నేను ప్రారంభించినవే. వాటిని కాంగ్రెస్ కొనసాగించింది. నేను ప్రాజెక్టులు అడ్డుకుంటాననేందుకు ఆధారాలున్నాయా? అదంతా తప్పుడు ప్రచారం. 2,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ తయారు చేసింది ఎవరు? ఆ విజన్ నేనే ఇచ్చాను. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? మేమంతా కూర్చొని మాట్లాడుకొని అన్ని విషయాలను పరిష్కరించుకుంటాం. ఇప్పటికే మాట్లాడుకున్నాం. మేమంతా కలసి తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇక్కడి పాలనలో నేను జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. తెలంగాణ ప్రజలే భాగస్వాములవుతారు. కోదండరాం కమిటీ మా మేనిఫెస్టోను అమలు చేస్తుంది. సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడలేక టీఆర్‌ఎస్ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. – చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment