సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరంలో ప్రచార ఘట్టం ముగిసింది. హోరెత్తించిన మైకులన్నీ మూగబోయాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఫుల్‌స్టాప్ పడింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగింది. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ప్రచార బాధ్యతలు తనపైనే వేసుకుని రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. 87 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తోడ్పాటునందించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో ఏర్పాటైన ప్రజాకూటమి, బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అతిరథులంతా తరలి వచ్చారు. 80 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఎన్నడూ లేని స్థాయిలో నగదు ఏరులై పారింది. కూటమి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు రంగప్రవేశం చేయడంతో అది తారాస్థాయికి చేరింది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రంలో రూ.129.46 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటేనే ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.10.87 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు. శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రూ.వందల కోట్లు ఖర్చు చేయడానికి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి నుంచే డబ్బు పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
జోరుగా కాంగ్రెస్ ప్రచారం...
గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు పలువురు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల గెలు పునకు తీవ్రంగా శ్రమించారు. రాహుల్ అక్టోబర్ 20న రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించారు. ఆరోజున బైంసా, కామారెడ్డి సభల్లో పాల్గొన్నారు. అనంతరం సోనియా, రాహుల్ ఇద్దరూ కలిసి 23న మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. 28న రాహుల్‌గాంధీ ఖమ్మంలో తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి రోడ్‌షోల్లో ప్రచారం చేశారు. 29న పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 3న రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. పరిగి, గద్వాల, తాండూరు సభల్లో మాట్లాడారు. ప్రచారానికి చివరిరోజైన బుధవారం కోదాడ బహిరంగ సభకు చంద్రబాబుతో కలిసి హాజరయ్యారు. మొత్తంమీద 6 సార్లు రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. 26 నియోజకవర్గాలకు సంబంధించి 17 సభల్లో పాల్గొన్నారు. సోనియా, రాహుల్‌తోపాటు ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మొత్తం ప్రచారంలో పాలుపంచుకుంది. అహ్మద్ పటేల్, జైరాంరమేశ్, జైపాల్‌రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఆజాద్, చిదంబరం, కపిల్ సిబల్, వీరప్పమొయిలీ, డి.కె.శివకుమార్, ఆనంద్‌శర్మ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఉమెన్ చాందీ, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు, అజహారుద్దీన్, ఖుష్బూ, నగ్మా, సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ తదితరులు ప్రచారం చేశారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌లతోపాటు మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు మినహా మిగిలిన రాష్ట్ర నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితయ్యారు. టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేయగా.. టీజేఎస్ పక్షాన కోదండరాం, సీపీఐ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం, జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారం నిర్వహించారు.
కీలక భూమిక పోషించే లక్ష్యంతో బీజేపీ...
కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలన్న యోచనతో బీజేపీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్ గంగ్వార్, జగత్ ప్రకాశ్ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్ ఓరమ్, మాజీ మంత్రి పురంధేశ్వరి సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు 180కి పైగా సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ గతనెల 27న నిజామాబాద్, మహబూబ్‌నగర్ సభల్లో.. ఈ నెల 3న హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక అమిత్‌షా 3 రోజులు పాటు ప్రచారం చేశారు. స్వామి పరిపూర్ణానంద 80కి పైగా సభల్లో పాల్గొన్నారు. ఇక బీఎల్‌ఎఫ్ తరఫున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆ పార్టీ నేతలు బృందా కారత్, బి.వి.రాఘవులు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు.
ఒకేఒక్కడు.. కేసీఆర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం మొత్తం సింగిల్‌గా చుట్టేశారు. గత ఎన్నికల్లో 110 సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈసారి ఏకంగా 116 అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరుతో సెప్టెంబర్ 7న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేసీఆర్.. ఇదే జిల్లాలోని సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నవంబర్ 5న ముగించారు. తొలుత సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. తర్వాత నాలుగు రోజులకు సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసి, 7న ప్రచారం ప్రారంభించారు. అక్టోబరు 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్(వనపర్తి), నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబర్ 19 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. అక్టోబర్ 24, నవంబర్ 1న రెండు రోజులు మినహా ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు గజ్వేల్‌లో ఒకే సభతో ప్రచారం పూర్తిచేశారు. కొంగరకలాన్ సభ మినహాయిస్తే.. మొత్తం 87 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్ చేశారు. నల్లగొండ, వనపర్తిలో రెండుసార్లు ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధంచేశారు. వాటిని అమలుచేసే బాధ్యతను కేటీఆర్, హరీశ్‌లకు అప్పగించారు. సభల నిర్వ హణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ముఖ్యనేతల కు, అభ్యర్థులకు ప్రయాణంలోనే ఆదేశాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment