సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు మద్దతు తెలిపారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దు, దళితులు, మైనార్టీలపై దాడులు, జీడీపీ పతనం ఇలా ప్రతి విషయంలో కేసీఆర్ బీజేపీ వెంట నడిచారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన గుల్బర్గా నుంచి తను ప్రాతినథ్యం వహిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అన్ని పక్షాలను ఒప్పించి తెలంగాణ ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి తెలంగాణ కోసం ఉద్యమించారో అది సాకారం కాలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం వెళ్లి సోనియాను ఎందుకు కలిశారు.. కాళ్లు ఎందుకు మొక్కారని ప్రశ్నించారు.
హైదరాబాద్ సంస్కృతి చాలా మంచిదని ఖర్గే వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఈసీ.. ఇలా అన్ని వ్యవస్థలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందని ఆరోపించారు. సీబీఐ చీఫ్ ఎంపికలో నిబంధనలు పాటించాలని సూచించాం.. కానీ వాళ్ల ఇష్టానికి వారు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ, నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సెక్యూలర్ అని చెప్పుకునే కేసీఆర్ ఎంఐఎంతో కలిసి బీజేపీకి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment