సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ఘనవిజయం సాధించారు. ప్రజాకూటమి తరఫున బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై 51,554 ఓట్ల మెజార్టీతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పాచికలు కదిపిన ప్రజాకూటమి దారుణంగా భంగపడింది. గత ఎన్నికల్లో ఇదే వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ తరుఫున బరిలోకి దిగగా.. కేసీఆర్ కేవలం 19,391 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన నర్సారెడ్డి అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.
సరిగ్గా ఎన్నికల ముందు నర్సారెడ్డిని తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్ పెద్ద ఎత్తుగడనే వేసింది. నర్సారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిల కలయికతో సీఎం కేసీఆర్ ఓటమి తప్పదని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మేజార్టీతో గెలుపొందారు. కేసీఆర్, మంత్రి హరీష్‌రావుల వ్యూహాల ముందు కాంగ్రెస్ ఎత్తుగడలు పనిచేయలేదని ఫలితాలతో స్పష్టమైంది. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గం సిద్దిపేట కన్నా ఎక్కువగా గజ్వేల్‌ల్లోనే ప్రచారం నిర్వహించి కేసీఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment