‘నాగేందర్‌కు తిక్కలేచి నాపై విమర్శలు చేస్తున్నాడు’ | TPCC Chief Uttam Kumar Reddy Fires On Danam Nagender | Sakshi
Sakshi News home page

‘వాళ్లు కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయం’

Published Mon, Sep 3 2018 5:58 PM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

TPCC Chief Uttam Kumar Reddy Fires On Danam Nagender - Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ యువతకు కేసీఆర్‌ ద్రోహం చేశారని, వాళ్లు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ పాలనలో వారి ఆశలు నీరుగారాయని అన్నారు.

తన ఇంట్లో అందరికి ఉద్యోగాలు నింపుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ నిరుద్యోగుల గురించి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థపై కేసీఆర్‌ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్‌ పూర్తిగా వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లోన్స్‌ మంజూరులో సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ నిరుద్యోగ భృతి అంటే అవహేళన చేసిన కేసీఆర్‌.. అధికారం నుంచి దిగిపోయే ముందు నిరుద్యోగ భృతి గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు.  అధికారంలో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్స్‌కు దోచిపెట్టడానికే కేసీఆర్‌కు సమయం సరిపోయిందని చెప్పారు. నాగేందర్‌కు తిక్కలేచి తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భూకబ్జా దారులున తనపై విమర్శలు చేసే నైతికత ఎక్కడుందని, అతను ఎంతకు అమ్ముడు పోయాడో చెప్పాలని ప్రశ్నించారు. పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement