PCC chief N. Uttam Kumar Reddy
-
‘నాగేందర్‌కు తిక్కలేచి నాపై విమర్శలు చేస్తున్నాడు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ ద్రోహం చేశారని, వాళ్లు రగిలిపోతున్నారని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో వారి ఆశలు నీరుగారాయని అన్నారు. తన ఇంట్లో అందరికి ఉద్యోగాలు నింపుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ నిరుద్యోగుల గురించి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లోన్స్ మంజూరులో సర్కార్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి అంటే అవహేళన చేసిన కేసీఆర్.. అధికారం నుంచి దిగిపోయే ముందు నిరుద్యోగ భృతి గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్స్‌కు దోచిపెట్టడానికే కేసీఆర్‌కు సమయం సరిపోయిందని చెప్పారు. నాగేందర్‌కు తిక్కలేచి తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భూకబ్జా దారులున తనపై విమర్శలు చేసే నైతికత ఎక్కడుందని, అతను ఎంతకు అమ్ముడు పోయాడో చెప్పాలని ప్రశ్నించారు. పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
యువత కేసీఆర్‌కు బుద్ది చెప్పటం ఖాయం
-
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అధికార టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య దంపతులను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో చేపట్టనున్న బస్సుయాత్ర సందర్భంగా సమ్మయ్య దంపతులు సొంతగూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్లో ప్రాధాన్యత కరువవడంతో కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న కావేటి సమ్మయ్య, ఆయన సతీమణి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కావేటి సాయిలీలను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కావేటి సమ్మయ్యతో ఫోన్లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. తన అనుయాయులు, సన్నిహితులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో పార్టీ మారే విషయంలో సమ్మయ్య, సాయిలీలతుది నిర్ణయం తీసుకుంటానని ఉత్తమ్‌తో సమ్మ య్య చెప్పినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2014 ఎన్నికల్లో ఓటమితో తెరవెనక్కి... కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కావేటి సమ్మయ్య తన సతీమణి సాయిలీలను 2001లో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలిపించుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తా చాటారు. ఈ నేపథ్యంలో సాయిలీల కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పొందారు. ఏఐసీసీ సభ్యురాలిగా, పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా కూడా సేవలు అందించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇక్కడ కాంగ్రెస్ నుంచి కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కావేటి సమ్మయ్య దంపతులు ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో 2007లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సమ్మయ్య 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. 2009లో గెలిచిన తరువాత రెండుసార్లు ఉప ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించినప్పటికీ, 2014 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరుపున పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించి, ఆ వెంటనే టీఆర్ఎస్లో చేరారు. కోనప్ప అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మారిపోవడంతో సమ్మయ్యకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. దాంతో ఆయన కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంలో ప్రాధాన్యత కరువు ఐదేళ్లు సిర్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కావేటి సమ్మయ్య 2014లో ఓడిపోగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కోనప్పతో పాటు బీఎస్పీ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిని కూడా గులాబీ గూటికి చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చింది. అయితే కోనప్పను పార్టీలో చేర్చుకున్నప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సమ్మయ్యకు టీఆర్ఎస్లో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు భావించారు. అయితే నాలుగేళ్లయినా సమ్మయ్యకు ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఆయన వర్గీయులు కూడా రాజకీయంగా తెర వెనక్కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్, బీఎస్పీ ప్రయత్నించాయి. అయితే కేసీఆర్ మీద నమ్మకంతో నాలుగేళ్లు వేచిచూసిన ఆయన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనల్లో పడ్డట్టు సమాచారం. 2019లో సిర్పూర్ టిక్కెట్టుపైహామీ ఇచ్చిన ఉత్తమ్! టీఆర్ఎస్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న కావేటి సమ్మయ్యను సొంతగూటికి రావలసిందిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టిక్కెట్టుతో పాటు కావేటి సాయిలీలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనను టిక్కెట్టు హామీతోనే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర్పించారు. అలాగే పీసీసీ సభ్యుడిగా పనిచేస్తున్న గోసుల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కావేటి సమ్మయ్య సొంతగూటికి చేరితే కాంగ్రెస్ టిక్కెట్టు కోసం చతుర్ముఖ పోటీ నెలకొంటుంది. -
అమెరికా నుంచి రాగానే హల్ చల్
► ఆయన ఉంటే కాంగ్రెస్ బతికి బట్టకట్టలేదని వ్యాఖ్య ► తన సోదరుడిని ఆయనే ఓడించారని ఆరోపణ ► డబ్బులిచ్చి మరీ ఓటమి పాలు చేశారని ఆవేదన ► పీసీసీ అధ్యక్ష పదవిస్తే పార్టీని గాడిలో పెడతానని వెల్లడి ► వెంకట్‌రెడ్డి ఆంతర్యమేమిటో తెలియక ► తలపట్టుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు ► గతంలో పీసీసీ చీఫ్‌గా పొన్నాలను ఎంపిక చేసి తప్పు చేశారు. ఆ తర్వాత ఉత్తమ్‌ను నియమించి మరో తప్పు చేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలతోపాటు స్వపక్షంలోని రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే కోమటిరెడ్డి ఈసారి హాట్‌హాట్ కామెంట్లు చేశారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్, ఇటు జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా పీసీసీ చీఫ్, మాజీ మంత్రి, హుజూర్నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో తన చిరకాల ప్రత్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉంటే పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని అంటూనే ఆ పదవిని తనకిస్తే పార్టీని గాడిలో పెడతానని చెప్పడం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతర్గత ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌లో ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతలపై విమర్శలు కొంత జోరందుకున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆ విమర్శల వేడి పతాక స్థాయికి చేరింది. హరీశ్‌ను కలిసి... దాదాపు 20 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని గురువారం హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి శనివారం హడావుడి చేశారు. ఉదయం రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావును కలవడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆయన పార్టీ మారతారని ఎప్పటి నుంచో పుకార్లు వస్తుండడం.. అంతకుముందు రోజే ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో హరీశ్, కోమటిరెడ్డి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. హరీశ్‌ను కలిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో సాదాసీదాగానే మాట్లాడారు. తానెప్పుడూ టీఆర్ఎస్లో చేరతానని చెప్పలేదంటూనే పార్టీ మార్పుపై నోకామెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాత్రం సన్నివేశాన్ని పూర్తి స్థాయిలో రక్తికట్టించారు. ఉత్తమ్‌ను టార్గెట్ చేసి... హరీశ్‌ను కలిసివచ్చిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి పూర్తి స్థాయిలో దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను ఎంపిక చేసే తప్పు చేశారని, ఆ తర్వాత ఉత్తమ్‌ను నియమించి మరో తప్పు చేశారని పేర్కొన్నారు. ఉత్తమ్ ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. పొన్నాల కన్నా ఉత్తమ్ మరీ వీక్ అని, ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్‌దే బాధ్యత అని అన్నారు. తానే పీసీసీ అధ్యక్షుడిని అయి ఉంటే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే వాడినని, లేదంటే రాజీనామా చేసేవాడినని చెబుతూనే తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని గాడిలో పెడతానని మనసులో మాటను బయటపెట్టారు. వీటన్నింటి కన్నా మరో సంచలన ఆరోపణ చేశారు కోమటిరెడ్డి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమికి కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డే బాధ్యుడని, ఆయనే మూడు నియోజకవర్గాల్లో డబ్బులిచ్చి మరీ తన సోదరుడిని ఓడించాడని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో.. తన సోదరుడిని ఉత్తమ్ ఓడించారని ఎందుకు ఆరోపించారో కాంగ్రెస్ శ్రేణులకుఅంతుపట్టడం లేదు. ఉత్తమ్ అంటే ఒంటికాలిపై లేచే కోమటిరెడ్డి ఈసారి తన జోరును మరింత పెంచారని, పదునైన విమర్శలు చేయడం ద్వారా పార్టీలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని, అందుకే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సోనియాకు లేఖ రాస్తానని కూడా చెప్పారని రాజకీయ వర్గాలంటున్నాయి. కొన్ని రోజులుగా వార్తల్లో... కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని రోజులుగా వార్తల్లో ప్రముఖంగా ఉంటున్నారు. ఆయన టీఆర్ఎస్లోకి వెళుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఎక్కడా తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పకుండానే, వె ళ్లడం లేదని స్పష్టం చేయకుండానే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. కోమటిరెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన అనుచరులు నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెడలో కాంగ్రెస్ కండువా లేకపోవడం పెద్ద చర్చకే దారి తీసింది. ఒకే ఫ్లెక్సీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి మెడలో కాంగ్రెస్ కండువా ఉండి, అన్న కోమటిరెడ్డి మెడలో లేకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జూన్ ఆరో తేదీన ఆయన టీఆర్ఎస్లో చేరతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి. వీటికిు తోడు కోమటిరెడ్డి శనివారం హైదరాబాద్‌లో చేసిన హల్చల్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో.. ఏ క్షణంలో ఏం మార్పులు జరుగుతాయో అర్థం కాక సగటు కాంగ్రెస్ అభిమానులు తలలు బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలంటున్నాయి.