అమెరికా నుంచి రాగానే హల్ చల్ | Komatireddy hits out at Uttam, other party leaders | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి రాగానే హల్ చల్

Published Sun, Jun 5 2016 9:58 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

అమెరికా నుంచి రాగానే హల్ చల్ - Sakshi

అమెరికా నుంచి రాగానే హల్ చల్

ఆయన ఉంటే కాంగ్రెస్ బతికి బట్టకట్టలేదని వ్యాఖ్య
తన సోదరుడిని ఆయనే ఓడించారని ఆరోపణ
డబ్బులిచ్చి మరీ ఓటమి పాలు చేశారని ఆవేదన
పీసీసీ అధ్యక్ష పదవిస్తే పార్టీని గాడిలో పెడతానని వెల్లడి
వెంకట్‌రెడ్డి ఆంతర్యమేమిటో తెలియక
తలపట్టుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
 

 
గతంలో పీసీసీ చీఫ్‌గా పొన్నాలను ఎంపిక చేసి తప్పు చేశారు. ఆ తర్వాత  ఉత్తమ్‌ను నియమించి మరో తప్పు చేశారు.
 
 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  జిల్లా కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి హల్‌చల్ చేశారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలతోపాటు స్వపక్షంలోని రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే కోమటిరెడ్డి ఈసారి హాట్‌హాట్ కామెంట్లు చేశారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్, ఇటు జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా పీసీసీ చీఫ్, మాజీ మంత్రి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో తన చిరకాల ప్రత్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉంటే పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని అంటూనే ఆ పదవిని తనకిస్తే పార్టీని గాడిలో పెడతానని చెప్పడం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతర్గత ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌లో ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతలపై విమర్శలు కొంత జోరందుకున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆ విమర్శల వేడి పతాక స్థాయికి చేరింది.


 హరీశ్‌ను కలిసి...
దాదాపు 20 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని గురువారం హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి శనివారం హడావుడి చేశారు. ఉదయం రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావును కలవడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆయన పార్టీ మారతారని ఎప్పటి నుంచో పుకార్లు వస్తుండడం.. అంతకుముందు రోజే ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో హరీశ్, కోమటిరెడ్డి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. హరీశ్‌ను కలిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో సాదాసీదాగానే మాట్లాడారు. తానెప్పుడూ టీఆర్‌ఎస్‌లో చేరతానని చెప్పలేదంటూనే పార్టీ మార్పుపై నోకామెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాత్రం సన్నివేశాన్ని పూర్తి స్థాయిలో రక్తికట్టించారు.


 ఉత్తమ్‌ను టార్గెట్ చేసి...
 హరీశ్‌ను కలిసివచ్చిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి పూర్తి స్థాయిలో దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను ఎంపిక చేసే తప్పు చేశారని, ఆ తర్వాత ఉత్తమ్‌ను నియమించి మరో తప్పు చేశారని పేర్కొన్నారు. ఉత్తమ్ ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. పొన్నాల కన్నా ఉత్తమ్ మరీ వీక్ అని, ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్‌దే బాధ్యత అని అన్నారు. తానే పీసీసీ అధ్యక్షుడిని అయి ఉంటే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే వాడినని, లేదంటే రాజీనామా చేసేవాడినని చెబుతూనే తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని గాడిలో పెడతానని మనసులో మాటను బయటపెట్టారు.

వీటన్నింటి కన్నా మరో సంచలన ఆరోపణ చేశారు కోమటిరెడ్డి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమికి కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డే బాధ్యుడని, ఆయనే మూడు నియోజకవర్గాల్లో డబ్బులిచ్చి మరీ తన సోదరుడిని ఓడించాడని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో.. తన సోదరుడిని ఉత్తమ్ ఓడించారని ఎందుకు ఆరోపించారో కాంగ్రెస్ శ్రేణులకుఅంతుపట్టడం లేదు. ఉత్తమ్ అంటే ఒంటికాలిపై లేచే కోమటిరెడ్డి ఈసారి తన జోరును మరింత పెంచారని, పదునైన విమర్శలు చేయడం ద్వారా పార్టీలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని, అందుకే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సోనియాకు లేఖ రాస్తానని కూడా చెప్పారని రాజకీయ వర్గాలంటున్నాయి.


కొన్ని రోజులుగా వార్తల్లో...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి  కొన్ని రోజులుగా వార్తల్లో ప్రముఖంగా ఉంటున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఎక్కడా తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పకుండానే, వె ళ్లడం లేదని స్పష్టం చేయకుండానే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. కోమటిరెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన అనుచరులు నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెడలో కాంగ్రెస్ కండువా లేకపోవడం పెద్ద చర్చకే దారి తీసింది. ఒకే ఫ్లెక్సీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి మెడలో కాంగ్రెస్ కండువా ఉండి, అన్న కోమటిరెడ్డి మెడలో లేకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే జూన్  ఆరో తేదీన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి. వీటికిు తోడు కోమటిరెడ్డి శనివారం హైదరాబాద్‌లో చేసిన హల్‌చల్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో.. ఏ క్షణంలో ఏం మార్పులు జరుగుతాయో అర్థం కాక సగటు కాంగ్రెస్ అభిమానులు తలలు బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలంటున్నాయి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement