సమ్మయ్య, సాయిలీల
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అధికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య దంపతులను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో చేపట్టనున్న బస్సుయాత్ర సందర్భంగా సమ్మయ్య దంపతులు సొంతగూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత కరువవడంతో కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న కావేటి సమ్మయ్య, ఆయన సతీమణి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ కావేటి సాయిలీలను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది.
ఈ మేరకు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కావేటి సమ్మయ్యతో ఫోన్‌లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. తన అనుయాయులు, సన్నిహితులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో పార్టీ మారే విషయంలో సమ్మయ్య, సాయిలీలతుది నిర్ణయం తీసుకుంటానని ఉత్తమ్‌తో సమ్మ య్య చెప్పినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
2014 ఎన్నికల్లో ఓటమితో తెరవెనక్కి...
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కావేటి సమ్మయ్య తన సతీమణి సాయిలీలను 2001లో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలిపించుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తా చాటారు. ఈ నేపథ్యంలో సాయిలీల కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పొందారు. ఏఐసీసీ సభ్యురాలిగా, పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా కూడా సేవలు అందించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇక్కడ కాంగ్రెస్ నుంచి కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కావేటి సమ్మయ్య దంపతులు ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో 2007లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సమ్మయ్య 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
అసెంబ్లీ ముట్టడిలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. 2009లో గెలిచిన తరువాత రెండుసార్లు ఉప ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించినప్పటికీ, 2014 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) తరుపున పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించి, ఆ వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు. కోనప్ప అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా మారిపోవడంతో సమ్మయ్యకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. దాంతో ఆయన కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రభుత్వంలో ప్రాధాన్యత కరువు
ఐదేళ్లు సిర్పూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కావేటి సమ్మయ్య 2014లో ఓడిపోగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఆర్‌ఎస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కోనప్పతో పాటు బీఎస్‌పీ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిని కూడా గులాబీ గూటికి చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చింది. అయితే కోనప్పను పార్టీలో చేర్చుకున్నప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సమ్మయ్యకు టీఆర్‌ఎస్‌లో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు భావించారు.
అయితే నాలుగేళ్లయినా సమ్మయ్యకు ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఆయన వర్గీయులు కూడా రాజకీయంగా తెర వెనక్కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్, బీఎస్‌పీ ప్రయత్నించాయి. అయితే కేసీఆర్ మీద నమ్మకంతో నాలుగేళ్లు వేచిచూసిన ఆయన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనల్లో పడ్డట్టు సమాచారం.
2019లో సిర్పూర్ టిక్కెట్టుపైహామీ ఇచ్చిన ఉత్తమ్!
టీఆర్‌ఎస్‌లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న కావేటి సమ్మయ్యను సొంతగూటికి రావలసిందిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టిక్కెట్టుతో పాటు కావేటి సాయిలీలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనను టిక్కెట్టు హామీతోనే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర్పించారు.
అలాగే పీసీసీ సభ్యుడిగా పనిచేస్తున్న గోసుల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కావేటి సమ్మయ్య సొంతగూటికి చేరితే కాంగ్రెస్ టిక్కెట్టు కోసం చతుర్ముఖ పోటీ నెలకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment