join Congress party
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేశవరావు గతంలో అనేక పదవులు కూడా పొందారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి చేరారు. కేసీఆర్‌తో కలిసి పని చేసిన ఆయనకు రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. -
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ కీలక నేతలు
-
టీఆర్ఎస్ కు బై బై.. కాంగ్రెస్ కు హయ్ హయ్..!!
-
కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే?
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని ఆమెకు అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కాంగ్రెస్ గూటిలో చేరడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో తన అనుచరులతో కలిసి శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సంసిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. శ్రీదేవి టీడీపీ పక్షాన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చేరి పని చేశారు. ప్రస్తుతం ఆమె మరోమారు కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు ప్రకటించాయి. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కే.సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లోకి శతృఘ్న
న్యూఢిల్లీ: బీజేపీ తిరుగుబాటు ఎంపీ శతృఘ్న సిన్హా(72) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుని మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ వన్‌మ్యాన్ షో– టూ మెన్ ఆర్మీ’గా మారిందనీ, పార్టీలో చర్చలకు తావులేదనీ, ప్రశ్నించిన వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గాంధీజీ, నెహ్రూ వంటి మహామహులున్న పార్టీ అన్నారు. రాహుల్‌ను ప్రయత్నించిన– పరీక్షకు నిలబడిన– విజయవంతమయిన(ట్రైడ్–టెస్టెడ్–సక్సెస్ఫుల్)నేతగా అభివర్ణించారు. ‘బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 6వ తేదీనే సొంత పార్టీని వీడాల్సి రావడం చాలా బాధాకరం. ఇందుకు కారణాలు మీకందరికీ తెలుసు. బీజేపీ వన్‌మ్యాన్ షో– టూమెన్ ఆర్మీగా మారిపోయింది’ అంటూ మోదీ, అమిత్‌షాల నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా విమర్శించారు. ‘బీజేపీలో చర్చలకు తావులేకుండా పోయింది. ఎల్కే అడ్వాణీ, జశ్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా వంటి కీలక నేతలకు గౌరవం దక్కలేదు. ప్రశ్నించే సీనియర్ నేతలను మార్గదర్శక మండలిలో చేరుస్తోంది. విభేదించే వారు, ప్రశ్నించే వారిపై శత్రువులు, తిరుగుబాటుదారులంటూ ముద్రవేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిజం మాట్లాడినందుకే నేను తిరుగుబాటుదారునైతే, నేను అలాగే ఉంటా. పార్టీలో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంలోకి మారిపోతోంది. మీరు చెప్పే అబద్ధాలు, నిరర్ధక హామీలను ప్రజలు గ్రహించారు. మీ నిజ స్వరూపం బట్టబయలైంది’ అని మండిపడ్డారు. ‘ప్రతిదీ ప్రధాని కార్యాలయమే నిర్ణయిస్తోంది. మంత్రులకు స్వేచ్ఛలేదు’ అని పేర్కొన్నారు. అనంతరం ఆయన ట్విట్టర్లో..‘ మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు మతిలేని చర్య. దీని కారణంగా ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం కోసం వెచ్చించే డబ్బును అభివృద్ధిపై ఖర్చుపెడితే దేశం ఎంతో బాగయ్యేది’ అని తెలిపారు. సిన్హాకు పట్నా సాహిబ్ టికెట్ శతృఘ్న సిన్హాకు పట్నా సాహిబ్ టికెట్ కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం వెలువడింది. ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవి శంకర్‌ప్రసాద్‌తో తలపడనున్నారు. దీంతోపాటు మరికొందరి పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ ఉత్సాహవంతుడు ‘ఉత్సాహవంతుడు, దేశ భవిష్యత్ ముఖచిత్రం అంటూ రాహుల్ గాంధీని శతృఘ్న సిన్హా పొగిడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయ్ వంటి పథకం దేశంలో ఇంతకుముందెన్నడూ లేదని పేర్కొన్నారు. ‘మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి మహా నేతలు సేవలందించిన గొప్ప పార్టీ కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లో మహాకూటమి విజయం సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. రాహుల్ వంటి ఉత్సాహవంతుడి నాయకత్వంలో సరైన దిశగా ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నా. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి. కాంగ్రెస్, లాలూ, తేజస్వీ ఆర్జేడీ వర్థిల్లాలి. జైహింద్’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాకు కల్పిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నా’ అని అన్నారు. కొంతకాలంగా ఆయన సామాజిక మాధ్యమాల్లో మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాహుల్ గాంధీని, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు ఆపార్టీ నేతలపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో పార్టీ పట్నాసాహిబ్ నుంచి ఆయనకు బదులు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది. దీంతో శతృఘ్న సిన్హా మార్చి 28వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో భేటీ అయ్యారు. శనివారం కాంగ్రెస్‌లో చేరిపోయారు. -
‘కారు’ దిగుతున్న గులాబీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్లోని పలువురు కీలక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి దూరమవుతున్నారు. మరికొందరిపై టీఆర్ఎస్ అధిష్టానం స్వయంగా వేటు వేస్తోంది. కారణాలు ఏమైనా అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్కు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంత మంది ఈ జాబితాలో ఉంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ నెల 20న టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోపే మరికొందరు కీలక ప్రజాప్రతినిధులపై ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ముఖ్యలు ప్రకటిస్తున్నారు. అసంతృప్తితో ఒక్కొక్కరు.. టీఆర్ఎస్ వ్యవహారాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితం రాహుల్‌ని, ఆ తర్వాత సోనియాగాంధీని కలిశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ అధికారికంగా ప్రకటించకపోయినా టీఆర్ఎస్కు దూరమయ్యారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నుంచి పోటీ చేసే 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, రాములునాయక్, కొండా మురళీధర్‌రావు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాబుమోహన్, బొడిగె శోభ, బి.సంజీవరావు టీఆర్ఎస్ను వీడారు. వీరిలో కొండా సురేఖ, సంజీవరావు కాంగ్రెస్‌లో చేరారు. బాబుమోహన్, శోభ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, ఎన్.బాలునాయక్, రమేశ్‌రాథోడ్, కేఎస్ రత్నం సైతం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. యాదవరెడ్డిపై వేటు.. ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
రాజస్తాన్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దౌసా ఎంపీ హరీశ్ చంద్ర మీనా, నాగౌర్ బీజేపీ ఎమ్మెల్యే హబీబూర్ రెహమన్ కాంగ్రెస్‌లో చేరారు. రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి అవినాశ్ పాండే సమక్షంలో బుధవారం మీనా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకులతో పాటు హరీశ్ చంద్ర మీనా కూడా పోటీ చేయనున్నారు. రాజస్తాన్ బరిలో సచిన్, గెహ్లాట్ పోటీ రాజస్తాన్ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో పోటీచేస్తామని కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ప్రకటించారు. దీంతో సీఎం కుర్చీ కోసం అప్పుడే రాజస్తాన్ కాంగ్రెస్‌లో పోరు మొదలయినట్లైంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదనీ, తామంతా బీజేపీని సమిష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. -
కాంగ్రెస్ గూటికి తారిఖ్ అన్వర్
న్యూఢిల్లీ: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో తారిఖ్ అన్వర్ తన అనుచరులతో కలసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ..రఫేల్ విమానాల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని మోదీని వెనకేసుకుని రావటంతోనే తాను పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. బిహార్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన తారిఖ్ అన్వర్ ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. సుమారు 19 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. -
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు..!
గులాబీ కండువాను తీసివేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జిల్లా నాయకులు కొందరు ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. టికెట్ దక్కక కొందరు, పాత గూటికి చేరాలని మరికొందరు, అసంతృప్తులు ఇంకొందరు టీఆర్ఎస్ పార్టీకి టాటా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా టీఆర్ఎస్ మిర్యాలగూడ టికెట్ దక్కకపోవడంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. నల్లగొండ పట్టణంలో ఇప్పటికే కొందరు హస్తం బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్ఎస్ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ యా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు నెల రోజులుగా తర్జన భర్జన పడి.. చివరకు కారు ది గాలనే నిర్ణయించుకుంటున్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎన్.భాస్కర్‌రావుకు సిట్టింగుగా భావించి టికెట్ ప్రకటించారు. దీంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెల రోజులకు పైగా తన అనుచరులతో, దగ్గరి నాయకులతో మంతనాలు జరిపిన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారని తెలిసింది. ప్రస్తుతం మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వమన్న నిబంధన అమలయితే.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనరల్ అభ్యర్థుల కొరత ఉందని అంటున్నారు. ఈ తరుణంలో అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఎలాంటి హామీ తీసుకోకుండానే బేషరతుగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. టికెట్లు ఆశించి భగంగపడిన నాయకులు సొంత దారులు వెదుక్కుంటున్నారని దానిలో భాగంగానే అలుగుబెల్లి ఈనిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ నుంచే టీఆర్ఎస్లోకి వచ్చారు. దేవరకొండ టికెట్ హామీపైనే నాడు టీఆర్ఎస్లో చేరారని, కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ ఆతర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. తమ సిట్టింగుగానే భావించిన టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ ఆయనకే ఖరారు చేసింది. దీంతో బాలునాయక్‌కు అవకాశం దక్కకుండా పోయింది. గతంలో ఆయన దేవరకొండ నుం చి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించా రు. 2009 ఎన్నికల్లో గెలిచిన బాలునాయక్ 2014 ఎన్నిక ల నాటికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. దీంతో పొత్తుల్లో భాగంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. అదే దారిలో మరికొందరు నేతలు టీఆర్ఎస్లో టికెట్ దక్కక కాంగ్రెస్‌లోకి వెళుతున్న వారే కాకుండా, ఆయా స్థానాల్లో అభ్యర్థుల పట్ల అసంతృప్తిగా ఉన్న వారు, అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి టీ ఆర్ఎస్లో చేరిన వారు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పట్టణ కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్ బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్ఎస్ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా టీఆర్ఎస్ నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తితో కొందరు, అవకాశాలు రాక మరికొందరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని విధితమవుతోంది. -
కసిరెడ్డికి కాంగ్రెస్ గాలం!
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుర్తి వ్యవహారం చర్చనీయాంశంగా మారబోతుంది. టీఆర్ఎస్ అసంతృప్తి నేత, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కసిరెడ్డి అనుచరులు, అభిమానులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై గురిపెట్టిన కాంగ్రెస్ చాలావేగంగా పావులు కదుపుతోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో మంచి ఆదరణ పొందిన నారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్పై ఎదురుదాడి చేయొచ్చని ఎత్తులు వేస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు మార్లు కాంగ్రెస్ నాయకులు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అతి ముఖ్యమైన నేత రంగంలోకి దిగి కసిరెడ్డితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన మాత్రం వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. వ్యూహాలకు పదును.. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే దిగువ స్థాయి కార్యకర్తల విషయంలో పోటాపోటీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఒక స్థాయి కలిగిన నేతలను చేర్చుకునేందుకు రెండు పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్లో టిక్కెట్లను ప్రకటించిన వెంటనే వెల్లువెత్తే అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో భారీగా కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా చేరికలు సైతం సాగుతున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా చేరికలు చేపట్టారు. ఇదివరకే మహబూబ్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ తరఫున గతంలో పోటీచేసిన ఇబ్రహీం, నారాయణపేటకు చెందిన కుంభం శివకుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కూడా చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కసిరెడ్డిని చేర్చుకుని పాలమూరులో టీఆర్ఎస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు. సంకటస్థితిలో కసిరెడ్డి! తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎటూ తేల్చుకోలేక పోతున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లోకి కసిరెడ్డిని తీసుకునేందుకు ఆ పార్టీ ముఖ్యులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుర్తిలో స్థానం కల్పించకపోయినా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మున్ముందు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు కల్పిస్తున్నారు. అయితే కసిరెడ్డి మాత్రం కల్వకుర్తిని వదిలి వచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న మంత్రి కేటీఆర్‌తో కసిరెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయన కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కసిరెడ్డిని టీఆర్ఎస్లోనే కొనసాగించేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కసిరెడ్డి కోసం ఏకంగా ఈనెల 14న వెల్దండలో నిర్వహించాల్సిన బహిరంగ సభను సైతం కేటీఆర్ రద్దు చేసుకున్నారు. -
మళ్లీ కాంగ్రెస్‌లోకి వినోద్!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పెద్దపల్లి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జి.వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో జరిపిన సంప్రదింపులు సానుకూలమైనట్లు తెలుస్తోంది. దసరాలోపు వీలుకాకపోతే ఈనెల 20న భైంసాలో జరిగే రాహుల్‌గాంధీ సభలో వినోద్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వినోద్‌తో పాటు ఆయన సోదరుడు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ సైతం కాంగ్రెస్‌లో చేరతారా... లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వినోద్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాజకీయంగా కలిసే నిర్ణయాలు తీసుకునే ‘బ్రదర్స్’ ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కొనసాగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్ నిర్ణయం కోసమే వినోద్ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు సీనే రిపీట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ నుంచి వినోద్, వివేక్ బ్రదర్స్ తొలుత 2013 జూన్ 2న టీఆర్ఎస్లో చేరారు. తన తండ్రి వెంకటస్వామి చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ద్వారానే సాధ్యమని భావించి పార్టీలో చేరినట్లు అప్పట్లో ప్రకటించారు. తెలంగాణ బిల్లు ఆమోదించిన తరువాత 2014 ఏప్రిల్ ఎన్నికలకు 15 రోజుల ముందు మార్చి 31న బ్రదర్స్ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్ పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ సిద్ధించిన తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చి ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. వచ్చే ఎన్నికల్లో పాత స్థానాల నుంచే తాము పోటీ చేయడం ఖాయమని భావించారు. సెప్టెంబర్ 6న పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చెన్నూరు నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం దక్కింది. వివేక్ కోసమే ఎంపీగా ఉన్న సుమన్‌ను చెన్నూరు సీటుకు ఎంపిక చేసినట్లు చెపుతుండగా, మాజీ మంత్రినైన తనకు అవకాశం కల్పించకపోవడాన్ని వినోద్ సీరియస్‌గా తీసుకున్నారు. అన్న కోసం తన సీటు త్యాగం చేస్తానన్నా... ససేమిరా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇవ్వడంతో మాజీ మంత్రి వినోద్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కనపెట్టి సుమన్‌కు సీటివ్వడంతో స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఓదెలు స్వీయ గృహనిర్బంధం, ఓదెలు అభిమాని గట్టయ్య ఆత్మాహుతి వంటి పరిణామా ల నేపథ్యంలో బ్రదర్స్ వేచిచూసే దోరణిలో ఉన్నారు. ఇటీవల వెంకటస్వామి జయంతి సందర్భంగా కలిసిన బ్రదర్స్ వందలాది మంది అభిమానులతో కలిసి నేరుగా మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి కలిశారు. చెన్నూరు అభ్యర్థిని మార్చాలని, చెన్నూరు అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని వివరించారు. ఈ విషయమై కేసీఆర్‌తో చర్చిస్తామని కూడా చెప్పారు. చెన్నూరు అభ్యర్థిని మార్చేది లేదని తెగేసి చెప్పిన కేటీఆర్ వచ్చే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా వినోద్‌కు అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ భేటీ తరువాత బ్రదర్స్ ఇద్దరే మరో రెండుసార్లు కేటీఆర్‌ను కలిశారు. వినోద్‌కు ఎమ్మెల్యే సీటు కోసం తాను ఎంపీ సీటును త్యాగం చేస్తానని కూడా ఓదశలో వివేక్ చెప్పారు. చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి గానీ, చొప్పదండి, వికారాబాద్ తదితర స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, సీటు ప్రకటించాలని వినోద్ కోరారు. కేటీఆర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడం, కేసీఆర్‌తో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై బ్రదర్స్ కినుక వహించారు. టీఆర్ఎస్లో గౌరవం ఇవ్వలేదని ఆవేదన టీఆర్ఎస్లో తనకు అన్యాయం చేశారని, కాకా కొడుకుగా కానీ, మాజీ మంత్రిగా గానీ కనీస గౌరవం ఇవ్వలేదని వినోద్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. ఈ విషయంపై సోదరుడితో మాట్లాడిన వినోద్ తాను కాంగ్రెస్‌లోకి వెళతానని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో తనకు కాంగ్రెస్ నేతలతో ఉన్న పరిచయాలతో కాంగ్రెస్ నేత షర్మిష్ట ముఖర్జీ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా వివేక్ బ్రదర్స్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వివేక్ కొంత సంయమనం పాటించాల్సిందిగా వినోద్‌ను కోరుతున్నట్లు తెలిసింది. వినోద్ మాత్రం 20న భైంసాలో జరిగే రాహుల్‌గాంధీ సభలో గానీ, అంతకుముందు గానీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైనట్లు సమాచారం. వినోద్‌తోపాటే వివేక్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. ఈ విషయమై వినోద్‌ను ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా, టీఆర్ఎస్ తీరుపై అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమేనని ధ్రువీకరించారు. ‘చినబాబు(వివేక్)తో మాట్లాడుతున్నా... భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’ అని పేర్కొన్నారు. -
చర్చనీయాంశంగా.. జెడ్పీ!
సాక్షిప్రతినిధి, నల్గొండ : నల్గొండ జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ తిరిగి సొంతగూటికి చేరడంతో జిల్లా పరిషత్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెస్‌నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన బాలు.. చైర్మన్‌గా ఎన్నికై ఆరు నెలలకే టీఆర్ఎస్లో చేరారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన మరో 19 మంది జెడ్పీటీసీ సభ్యులు కూడా టీఆర్ఎస్లోకి వలసెళ్లారు. జెడ్పీ పాలక వర్గంలో 59 మంది సభ్యులకుగాను స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 43 వంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, టీడీపీ ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో ఎస్టీలకు రిజర్వుడు అయిన నల్లగొండ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎక్కే అ దృష్టం చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన బాలునాయక్‌ను వరించింది. అప్పటికీ ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వివిధ కారణాలతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఆ తరువాత 19 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో జెడ్పీలో వారి బలం 32కు పెరిగింది. కాంగ్రెస్ సంఖ్యా బలం తగ్గి, టీఆర్ఎస్ బలం పెరగడంతో జెడ్పీలో నా లుగేళ్లపాటు వారి ఆధిపత్యమే కొనసాగింది. జిల్లా పరిషత్‌కు కేటాయించే సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధుల పంపకాల్లో అధికార పార్టీ సభ్యులదే పైచేయిగా ఉండేది. పనుల పంపకాల్లో సభ్యులు అందరికీ కలిపి ఒక వాటా ఇస్తే.. చైర్మన్‌కు ప్రత్యేకమైన వాటా తీసుకునేవారు. ఈ పంపకాల విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. నిధుల పంపకాల్లో మంత్రి, ఎమ్మెల్యేల సహకారం కూడా చైర్మన్‌కు ఉండడంతో ప్రతిపక్ష సభ్యులకు నోరుమెదిపే అవకాశం లేకుండా పోయింది. చివరకు జెడ్పీ వైస్ చైర్మ¯Œన్ కర్నాటి లింగారెడ్డి సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన లింగారెడ్డి కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి లింగారెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. అధికార సభ్యుల బలంతో నాలుగేళ్ల పాటు రాజ్యమేలిన జెడ్పీ పాలక వర్గం ఇప్పుడు చైర్మన్ తిరిగి సొంత గూటికి చేరడంతో జెడ్పీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకవర్గానికి పది నెలల గడువు జెడ్పీ పాలకవర్గం 2014 జులై 5న కొలువుదీరింది. ఈ ఏడాది జూలై నాటికి నాలుగేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది జులై 4వ తేదీ నాటికి సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అంటే ఇంకా పది నెలల గడువు మిగిలి ఉంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బాలునాయక్ తిరిగి మరోసారి ఎమ్మెల్యే కావాలనే, తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఒకవేళ ఆయనకు టికెట్ కేటాయిస్తే, ఆ ఎన్నికల్లో ఆయన గెలిస్తే.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే, ఒకవేళ ఓడిపోతే మాత్రం తిరిగి ఆయన చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీఆర్ఎస్ మెజార్టీ సభ్యులు ఉన్న జెడ్పీలో బాలునాయక్‌ను చైర్మన్‌గా కొనసాగనిస్తారా? లేదంటే అవిశ్వాస తీర్మానానికి సభ్యులు సిద్ధపడతారా..? అన్న విషయం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేకున్నా కాంగ్రెస్ సభ్యులు మాత్రం సంతోషంగా ఉన్నారని అంటున్నారు. ఈ పదినెలల కా లంలో జెడ్పీకి వచ్చే నిధుల్లో కాంగ్రెస్ సభ్యులకు మెజార్టీ వాటా దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. అవిశ్వాసం అనివార్యమైతే..! ఒకవేళ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తే మొత్తం సభ్యుల్లో నాలుగో వంతు మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. జెడ్పీ రాజకీయ ఎలా ఉండబోతుందో ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం అక్టోబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుందంటున్నారు. ఆ రోజున జరగనున్న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరు పార్టీల సభ్యులు ఎలా వ్యవహరించబోతున్నారు? చైర్మ¯Œన్ విషయంలో వారి వైఖరి ఎలా ఉండబోతోందోనన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. -
మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ కొండా దంపతులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ దంపతులు, మైనారిటీ నేత పాషా కూడా రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. అందరూ కలసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొండా దంపతులు, రమేశ్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరడంపై రాహుల్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీరి చేరికలపై ఆయన సానుకూలంగా ఉన్నారని, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో మెజారీటీ స్థానాల్లో గెలుపొందేందుకు వీరి చేరికలు దోహదపడతాయని రాహుల్ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల్లో బలమైన కుటుంబంగా కొండా కుటుంబాన్ని రాహుల్ పరిగణిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రమేశ్ రాథోడ్ చేరిక ప్రభావం చూపుతుందని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. బేషరతుగా చేరిక.. ఎన్నికల్లో పోటీపై రాహుల్‌తో భేటీ సందర్భంగా ఎలాంటి చర్చ జరగలేదని, ఎలాంటి షరతుల్లేకుండా కొండా దంపతులు పార్టీలో చేరినట్లు ఉత్తమ్ చెప్పారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం టికెట్ల విషయంలో నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. కొండా సురేఖను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పంపుతామని చెప్పారు. మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ ‘ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు మాపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేం కాంగ్రెస్‌లో చేరాం. ఇక నుంచి కొండా దంపతుల ప్రభావమేంటో చూపిస్తాం. మాలాంటి వారందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుటుంబ లాభాపేక్ష కోసమే పనిచేశారు. టీఆర్ఎస్లో జరుగుతున్న అన్యాయంపై మాలాంటి వారు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మమ్మల్ని బయటకు పంపేలా చేశారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో భేషరతుగా పార్టీలో చేరాం. మా లక్ష్యం టికెట్లు కాదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలందిస్తాం. వరంగల్ తూర్పుతో పాటు 5 నుంచి 6 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాకే మళ్లీ వచ్చి కలుస్తానని రాహుల్‌కు హామీ ఇచ్చాం’అని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరామని, తమను వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు కొండా మురళి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ దంపతులు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ గూటికే కొండా దంపతులు
సాక్షి, వరంగల్: సంచలన నిర్ణయాలతో జిల్లా రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్న కొండా దంపతులు ‘కారు’ దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. వరంగల్ తూర్పులో కొండా సురేఖ పేరును పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతులు మీడియా సమావేశం పెట్టి టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. తన అభ్యర్థిత్వాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టారో స్పందించాలని.. లేకుంటే రెండు రోజుల్లో మా నిర్ణయాన్ని మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టం చేస్తామని ప్రకటించారు. ఇది టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకే చెందిన ఓ నేత వారిని సముదాయించడంతో మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టలేదని సమాచారం. అయితే వినాయక నవరాత్రులను కీడుగా భావించే కొండా దంపతులు ప్రెస్‌మీట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొండా దంపతులు పార్టీని వీడితే వరంగల్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో పార్టీకి నష్టం కలుగుతుందని పలువురు నేతలు అధినేత కేసీఆర్‌కు నచ్చజెప్పడంతో ఆయన కొంత మెత్తపడినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాజకీయంగా వస్తున్న ఇబ్బందులను పరిష్కరిస్తున్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాత్రం కొండా దంపతుల పట్ల కఠిన వైఖరితో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో సైతం పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన కొండా సురేఖకు టికెట్ ఇచ్చేది లేదనే వ్యాఖ్యలు వాట్సప్‌లలో చక్కర్లు కొట్టాయి. ఈ పరిణామక్రమంలో కొండా దంపతులు కాంగ్రెస్ అధిష్టానంతో ఒక నిర్ణయానికి వచ్చారని, పార్టీలో చేరేందుకు రంగం మొత్తం సిద్ధమైందని ఆయన అనుచర వర్గాలు తెలిపాయి. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, వాపపక్షాల పొత్తుల కారణంగా పరకాల టికెట్‌ను టీడీపీ అడుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పరకాల నుంచి పోటీ చేస్తారా... వరంగల్ తూర్పు నుంచి నిలబడతారా.. సురేఖతో పాటు ఆమె కూతును సుష్మితాపటేల్ పోటీ చేస్తారా.. అనేది వేచిచూడాల్సిందే. కొండా దంపతులు మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోనే తమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, కొండా దంపతులు ఈనెల 26వ తేదీన కాంగ్రెస్‌లో పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని వారి అనుయాయాలు తెలిపారు. -
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!
చేవెళ్ల (రంగారెడ్డి): మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖారారైంది. ఈనెల 27న కాంగ్రెస్ పార్టీలో చేరాలని దాదాపు ఖారారు అయిందని విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో నిరాశ చెందిన ఆయన తన అనుచరగణంతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ఆయన అనుచరులతో చర్చించి వారిని పెద్ద ఎత్తున వెంట తీసుకెళ్లేందుకు సోమవారం చేవెళ్లలో మారోసారి ఆయన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరి అధిష్టానం ఎవరికి టికెట్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్‌పై నమ్మకంతోనే చేరికలు
మధిర : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతోనే పలు పార్టీల నుంచి వలసలు వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమా ర్క తెలిపారు. మండలంలోని వంగవీడులో టీడీపీకి చెందిన అయిలూరి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాల వారు భట్టి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సత్యనారాయణరెడ్డితో పాటు భూక్యా గోరియా, గుడిద నర్సింహా, ఓబుల వెంకటనర్సిరెడ్డి, బొగ్గుల ఉద్దండురెడ్డి, పలగాని లక్ష్మయ్య తదితరులు పార్టీలో చేరగా, భట్టి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వంగవీడు గ్రామాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేసిందన్నారు. సీసీరోడ్లు, ఇందిర మ్మ ఇళ్లు, సాగర్‌నీరు, జాలిముడి ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు వం టి అనేక అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నది టీఆర్ఎస్సేనని ఆరో పించారు. నియోజకవర్గ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అన్నదాతలకు నీరందించి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలంగా ఉంచడమే తన ధ్యేయమని తెలిపారు. గ్రామపంచాయతీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. డబుల్బెడ్రూం ఇళ్లను ఆశగా చూపి ప్రజలను కెసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు, అవినీతికి పరాకాష్టగా మారిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం భట్టిని ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, కృష్ణాపురం సర్పంచ్ కర్నాటి రామారావు, నాయకులు శీలం వెంకటరెడ్డి, దుంపా వెంకటేశ్వరరెడ్డి, అద్దం కి రవికుమార్, దారా బాలరాజు పాల్గొన్నారు. -
జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
త్రిపురారం : మండలంలోని కాపువారిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ అబంగాపురం ఎంపీటీసీ హంజీ, మాజీ సర్పంచ్ మంగ్లానాయక్‌తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మర్ల చంద్రారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధనావత్ భాస్కర్‌నాయక్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎల్పీనేత జానారెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని ఆకాంక్షించి టీఆర్ఎస్లోకి వలసలు వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా ఉండి వచ్చే 2019 ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో నేనావత్ జాంమ్లా, పానుగోతు గాస్యా, సీతారాంనాయక్, మూడు హన్మంతు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు అనుముల నర్సిరెడ్డి, బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మైలారిశెట్టి సైదయ్య, నాయకులు అల్లంపల్లి జానయ్య, మట్టాయ్యచారి, వస్త్రాం, ధర్మానాయక్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన మోహన్, ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి నాయకుడు పృథ్వీ రాజ్ యాదవ, తెలంగాణ ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుంతియా, సునితా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. -
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అధికార టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య దంపతులను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో చేపట్టనున్న బస్సుయాత్ర సందర్భంగా సమ్మయ్య దంపతులు సొంతగూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్లో ప్రాధాన్యత కరువవడంతో కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న కావేటి సమ్మయ్య, ఆయన సతీమణి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కావేటి సాయిలీలను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కావేటి సమ్మయ్యతో ఫోన్లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. తన అనుయాయులు, సన్నిహితులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో పార్టీ మారే విషయంలో సమ్మయ్య, సాయిలీలతుది నిర్ణయం తీసుకుంటానని ఉత్తమ్‌తో సమ్మ య్య చెప్పినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2014 ఎన్నికల్లో ఓటమితో తెరవెనక్కి... కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కావేటి సమ్మయ్య తన సతీమణి సాయిలీలను 2001లో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలిపించుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తా చాటారు. ఈ నేపథ్యంలో సాయిలీల కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పొందారు. ఏఐసీసీ సభ్యురాలిగా, పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా కూడా సేవలు అందించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇక్కడ కాంగ్రెస్ నుంచి కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కావేటి సమ్మయ్య దంపతులు ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో 2007లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సమ్మయ్య 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. 2009లో గెలిచిన తరువాత రెండుసార్లు ఉప ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించినప్పటికీ, 2014 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరుపున పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించి, ఆ వెంటనే టీఆర్ఎస్లో చేరారు. కోనప్ప అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మారిపోవడంతో సమ్మయ్యకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. దాంతో ఆయన కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంలో ప్రాధాన్యత కరువు ఐదేళ్లు సిర్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కావేటి సమ్మయ్య 2014లో ఓడిపోగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కోనప్పతో పాటు బీఎస్పీ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిని కూడా గులాబీ గూటికి చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చింది. అయితే కోనప్పను పార్టీలో చేర్చుకున్నప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సమ్మయ్యకు టీఆర్ఎస్లో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు భావించారు. అయితే నాలుగేళ్లయినా సమ్మయ్యకు ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఆయన వర్గీయులు కూడా రాజకీయంగా తెర వెనక్కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్, బీఎస్పీ ప్రయత్నించాయి. అయితే కేసీఆర్ మీద నమ్మకంతో నాలుగేళ్లు వేచిచూసిన ఆయన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనల్లో పడ్డట్టు సమాచారం. 2019లో సిర్పూర్ టిక్కెట్టుపైహామీ ఇచ్చిన ఉత్తమ్! టీఆర్ఎస్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న కావేటి సమ్మయ్యను సొంతగూటికి రావలసిందిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టిక్కెట్టుతో పాటు కావేటి సాయిలీలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనను టిక్కెట్టు హామీతోనే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర్పించారు. అలాగే పీసీసీ సభ్యుడిగా పనిచేస్తున్న గోసుల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కావేటి సమ్మయ్య సొంతగూటికి చేరితే కాంగ్రెస్ టిక్కెట్టు కోసం చతుర్ముఖ పోటీ నెలకొంటుంది. -
కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి
నిర్మల్అర్బన్ : సీఎం కేసీఆర్ ఆరాచక పాలనకు చరమగీతం పాడాలని డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మామడ మండలానికి చెందిన 500మంది యువకులు, మహిళలు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి మహేశ్వర్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ మోసం చేశారన్నారు. తన కుటుంబసభ్యుల్లో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాల పేరిట కమీషన్లకు తెరలేపారని, అందుకే ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు కట్టాబెడుతున్నారని ఆరోపించారు. ఇంటింటికి తాగునీరు అందిస్తామని రోడ్లన్నీ నాశనం చేస్తున్నారన్నారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.2లక్షల కోట్ల అప్పుల రాష్ట్రం మార్చారని మండిపడ్డారు. భారీగా చేరికలు.. మామడ మండలానికి చెందిన పండరి సురేందర్, పవన్, ఆశన్న, నవీన్‌ల ఆధ్వర్యంలో 300మంది, కొత్త సాంగ్వి గ్రామానికి చెందిన గాంధీరెడ్డి ఆధ్వర్యంలో 100మంది, చందారం గ్రామానికి చెందిన 50మంది వినాయక్‌రెడ్డి ఆధ్వర్యంలో, గోండుగూడకు చెందిన 50 మంది కాంగ్రెస్‌లో చేరారు. మామడ మండల బ్లాక్ అధ్యక్షుడు బాపురెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కల రమణారెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, నాయకులు నవీన్‌కుమార్, అశోక్, భాస్కర్, ఆశ న్న, సంతోష్‌కుమార్, పాషా తదితరులు పాల్గొన్నారు. -
హస్తం గూటికి మాజీమంత్రి ..
సాక్షి, నాగర్‌కర్నూల్ : మాజీమంత్రి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించా రు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ నాగం కొంతకాలంగా చెబుతున్నప్పటికీ ఇన్నాళ్లూ అందుకు అనువైన పరిస్థితులు రాలేదు. బీజేపీకి రాజీనామా చేసిన నాగం ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అనుకోని అవాంతరాలు ఎదురవడంతో ఆయన రాక కాస్త ఆలస్యమైంది. ఇన్నాళ్లూ టికెట్టు కోసం తర్జనభర్జన కాంగ్రెస్ అధిష్టానం నుంచి నాగంకు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తామన్న స్పష్టత లభించలేదు. దీంతో ఆయన ఇన్నాళ్లూ పార్టీలో చేరే విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవలే పార్టీలో యువతకు ప్రాతినిథ్యం కల్పిస్తామని ప్రకటించారు. అప్పటినుంచి నాగం టికెట్టుకోసం తర్జన భర్జన పడినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్ అసెంబ్లీలో పోటీ చేసేందుకే ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి తనకు చివరి ఎన్నికలని ఆయనే స్వయంగా చెప్పుకుంటూ ప్రజల సానుభూతి కోసం ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉండగా దానిపై ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వర్గం మరోలా ప్రచారం చేస్తోంది. నాగంకు అవకాశం కల్పిస్తే పార్టీకి చాలా మంది దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. అయోమయంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి అయోమయంగా మారింది. నాగం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని ప్రకటించారు. గతంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఆయనను బహిరంగంగానే అడ్డుకుంటామని వారు కూడా ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిరోజులుగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ తన కుమారుడే కాబోయే కాంగ్రెస్ అభ్యర్థి అంటూ సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను పరిచయం చేశారు. నాగం పార్టీలోకి వస్తున్నారన్న ప్రకటన అనంతరం దామోదర్‌రెడ్డి సైతం పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తల అండదండలతో వస్తా.. కందనూలు : ‘కార్యకర్తలే నా బలం.. వారి అభీష్టం మేరకు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా.. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో త్వరలోనే చేరిక ఉంటుంది.. అని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, రానున్న రోజుల్లో ఆ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చేస్తున్నవి కేవలం ప్రగల్బాలేనని, ప్రాజెక్టులను ఉద్దరించడానికి కాదన్నారు. ఉమ్మడి జిల్లాకు 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి జిల్లాలో ఉన్న నెట్టెంపాడు, భీమ, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద కేవలం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోందని తెలిపారు. కాల్వలు, టెన్నల్ సామర్థ్యం పెంచంకుండా, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ లేకుండా 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందని, దోచుకోవడమే పనిగా నాయకులు బేరాలు ఆడుతున్నారని ఆరోపిం చారు. సమావేశంలో సింగి ల్ విండో చైర్మెన్ వెంకట్రా ములు, నాయకులు అర్థం రవి, కాశన్న, నసీర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గూటికి ‘అచ్చ’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అచ్చ విద్యాసాగర్ 2009లో పోటీ చేశారు. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ అచ్చ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గతంలో బహిరంగ లేఖ రాశారు. వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ విషయమై పార్టీ నుంచి స్పందన లేదు. దీంతో కొంత కాలం వేచి చూసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి రావడం, రాజకీయ భవితవ్యంపై కచ్చితమైన హామీ రావడంతో టీఆర్ఎస్ ను వీడేందుకు అచ్చ ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 11న గాంధీభవన్, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కార్యక్రమానికి వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు 150 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా వెళ్లేందుకు అచ్చ అనుచరులు అంతా సిద్ధం చేస్తున్నారు. -
కేసీఆర్ మోసాలను చూసే కాంగ్రెస్‌లోకి చేరికలు
తిప్పర్తి : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీసీసీబీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పజ్జూరులో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజ లను మోసపూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పలు అభివృ ద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సిం గం సత్తయ్య, మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, ఎంపీటీసీ కి న్నెర అంజి, దొంతినేని నాగేశ్వర్రావు, సురిగి రామకృష్ణ, జంజారాల సైదులు, దొడ్డ సోమయ్య, కస్పరాజు అయోధ్య, పల్లెసైదులు, భాస్కర్, ఆనందం, లింగస్వామి, యాదగిరి, బాలయ్య, భి క్షం, నర్సింహ, వార్డు సభ్యులు పల్లె సైదులు, నాగమ్మ ఉన్నారు. -
టీడీపీ, టీఆర్ఎస్ నుంచి...కాంగ్రెస్‌లోకి...
మిర్యాలగూడ టౌన్ : ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆదర్శిస్తునే పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని సీఎల్పీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో త్రిపురారం మండల పార్టీ అధ్యక్షులు మర్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీలోని లోక్యతండాకు చెందిన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 50 కుటుంబాల కార్యకర్తలు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే కానీ టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో జి. రాజు, జి. వెంకటేశ్వర్లుతో పాటు మరో 50 కుటుంబాల కార్యకర్తలున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్ల చంద్రారెడ్డి, స్కైలాబ్‌నాయక్, బసవయ్య, శంకర్‌నాయక్, ఖరీం ఉన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన కృష్ణపూనియా
మహిళా డిస్కస్ త్రోయర్ కృష్ణపూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన పూనియా.. రాజస్థాన్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో లాంఛనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన పూనియా త్వరలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 'నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. క్రీడల్లో దేశం కోసం పతకాలు సాధించా. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చా' అని పూనియా చెప్పారు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం సాధించారు. ఇతర అంతర్జాతీయ వేదికలపైనా సత్తాచాటారు.