సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ కొండా దంపతులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ దంపతులు, మైనారిటీ నేత పాషా కూడా రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. అందరూ కలసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొండా దంపతులు, రమేశ్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరడంపై రాహుల్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీరి చేరికలపై ఆయన సానుకూలంగా ఉన్నారని, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో మెజారీటీ స్థానాల్లో గెలుపొందేందుకు వీరి చేరికలు దోహదపడతాయని రాహుల్ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల్లో బలమైన కుటుంబంగా కొండా కుటుంబాన్ని రాహుల్ పరిగణిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రమేశ్ రాథోడ్ చేరిక ప్రభావం చూపుతుందని రాహుల్ చెప్పినట్లు తెలిపారు.
బేషరతుగా చేరిక..
ఎన్నికల్లో పోటీపై రాహుల్‌తో భేటీ సందర్భంగా ఎలాంటి చర్చ జరగలేదని, ఎలాంటి షరతుల్లేకుండా కొండా దంపతులు పార్టీలో చేరినట్లు ఉత్తమ్ చెప్పారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం టికెట్ల విషయంలో నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. కొండా సురేఖను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పంపుతామని చెప్పారు.
మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ
‘ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ నేతలు మాపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేం కాంగ్రెస్‌లో చేరాం. ఇక నుంచి కొండా దంపతుల ప్రభావమేంటో చూపిస్తాం. మాలాంటి వారందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుటుంబ లాభాపేక్ష కోసమే పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న అన్యాయంపై మాలాంటి వారు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మమ్మల్ని బయటకు పంపేలా చేశారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో భేషరతుగా పార్టీలో చేరాం. మా లక్ష్యం టికెట్లు కాదు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలందిస్తాం. వరంగల్ తూర్పుతో పాటు 5 నుంచి 6 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాకే మళ్లీ వచ్చి కలుస్తానని రాహుల్‌కు హామీ ఇచ్చాం’అని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల టీఆర్‌ఎస్‌లో చేరామని, తమను వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు కొండా మురళి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ దంపతులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment