కొండా దంపతులు
సాక్షి, వరంగల్: సంచలన నిర్ణయాలతో జిల్లా రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్న కొండా దంపతులు ‘కారు’ దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. వరంగల్ తూర్పులో కొండా సురేఖ పేరును పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతులు మీడియా సమావేశం పెట్టి టీఆర్‌ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. తన అభ్యర్థిత్వాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టారో స్పందించాలని.. లేకుంటే రెండు రోజుల్లో మా నిర్ణయాన్ని మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టం చేస్తామని ప్రకటించారు. ఇది టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఈ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీకే చెందిన ఓ నేత వారిని సముదాయించడంతో మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టలేదని సమాచారం. అయితే వినాయక నవరాత్రులను కీడుగా భావించే కొండా దంపతులు ప్రెస్‌మీట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొండా దంపతులు పార్టీని వీడితే వరంగల్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో పార్టీకి నష్టం కలుగుతుందని పలువురు నేతలు అధినేత కేసీఆర్‌కు నచ్చజెప్పడంతో ఆయన కొంత మెత్తపడినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాజకీయంగా వస్తున్న ఇబ్బందులను పరిష్కరిస్తున్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాత్రం కొండా దంపతుల పట్ల కఠిన వైఖరితో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో సైతం పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన కొండా సురేఖకు టికెట్ ఇచ్చేది లేదనే వ్యాఖ్యలు వాట్సప్‌లలో చక్కర్లు కొట్టాయి.
ఈ పరిణామక్రమంలో కొండా దంపతులు కాంగ్రెస్ అధిష్టానంతో ఒక నిర్ణయానికి వచ్చారని, పార్టీలో చేరేందుకు రంగం మొత్తం సిద్ధమైందని ఆయన అనుచర వర్గాలు తెలిపాయి. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, వాపపక్షాల పొత్తుల కారణంగా పరకాల టికెట్‌ను టీడీపీ అడుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పరకాల నుంచి పోటీ చేస్తారా... వరంగల్ తూర్పు నుంచి నిలబడతారా.. సురేఖతో పాటు ఆమె కూతును సుష్మితాపటేల్ పోటీ చేస్తారా.. అనేది వేచిచూడాల్సిందే. కొండా దంపతులు మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోనే తమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, కొండా దంపతులు ఈనెల 26వ తేదీన కాంగ్రెస్‌లో పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని వారి అనుయాయాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment