కసిరెడ్డికి కాంగ్రెస్‌ గాలం! | MLC Kasireddy Narayan Reddy Join Congress Mahabubnagar | Sakshi
Sakshi News home page

కసిరెడ్డికి కాంగ్రెస్‌ గాలం!

Published Tue, Oct 16 2018 9:00 AM | Last Updated on Tue, Oct 16 2018 9:00 AM

MLC Kasireddy Narayan Reddy Join Congress Mahabubnagar - Sakshi

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుర్తి వ్యవహారం చర్చనీయాంశంగా మారబోతుంది. టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేత, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్న  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం టిక్కెట్‌ కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కసిరెడ్డి అనుచరులు, అభిమానులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని ఒత్తిడి తీసుకొచ్చారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతలపై గురిపెట్టిన కాంగ్రెస్‌ చాలావేగంగా పావులు కదుపుతోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో మంచి ఆదరణ పొందిన నారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయొచ్చని ఎత్తులు వేస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు మార్లు కాంగ్రెస్‌ నాయకులు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అతి ముఖ్యమైన నేత రంగంలోకి దిగి కసిరెడ్డితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన మాత్రం వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది.
 
వ్యూహాలకు పదును.. 
ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే దిగువ స్థాయి కార్యకర్తల విషయంలో పోటాపోటీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఒక స్థాయి కలిగిన నేతలను చేర్చుకునేందుకు రెండు పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి.

టీఆర్‌ఎస్‌లో టిక్కెట్లను ప్రకటించిన వెంటనే వెల్లువెత్తే అసంతృప్తిని క్యాచ్‌ చేసుకోవడానికి కాంగ్రెస్‌ ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో భారీగా కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా చేరికలు సైతం సాగుతున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా చేరికలు చేపట్టారు. ఇదివరకే మహబూబ్‌నగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ తరఫున గతంలో పోటీచేసిన ఇబ్రహీం, నారాయణపేటకు చెందిన కుంభం శివకుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కూడా చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కసిరెడ్డిని చేర్చుకుని పాలమూరులో టీఆర్‌ఎస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు.
  
సంకటస్థితిలో కసిరెడ్డి!
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎటూ తేల్చుకోలేక పోతున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లోకి కసిరెడ్డిని తీసుకునేందుకు ఆ పార్టీ ముఖ్యులు శతవిధాలా  ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుర్తిలో స్థానం కల్పించకపోయినా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, మున్ముందు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు కల్పిస్తున్నారు.

అయితే కసిరెడ్డి మాత్రం కల్వకుర్తిని వదిలి వచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో నంబర్‌ 2గా ఉన్న మంత్రి కేటీఆర్‌తో కసిరెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయన కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కసిరెడ్డిని టీఆర్‌ఎస్‌లోనే కొనసాగించేందుకు కేటీఆర్‌ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కసిరెడ్డి కోసం ఏకంగా ఈనెల 14న వెల్దండలో నిర్వహించాల్సిన బహిరంగ సభను సైతం కేటీఆర్‌ రద్దు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement