kasireddynayana
-
బీఆర్ఎస్ను వీడనున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్త నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ను వీడుతున్నట్లు సమచారం. గుబాబి పార్టీకి బైబై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కసిరెడ్డి నారాయణ రెడ్డి 2016లో బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లోనే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. 2018లోనూ మళ్లీ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం ఈ సారి కూడా మొండిచేయి చూపించింది. దీంతో ఆయన తన రాజకీయ జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపై దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు సిట్టింగ్ స్థానాలకే ప్రధాన్యతనిచ్చింది. పార్టీలో ఈసారి టిక్కెట్ దక్కుతుందని భావించిన ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానానికి మొరపెట్టుకున్నా.. ప్రయోజనం లేకపోవడంతో కొత్తదారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత -
ఆకలి తీరుస్తున్న ఆశ్రమం
సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ఉన్నట్టుండి ఇంటికి నలుగురు అతిథులు వస్తే.. భోజన ఏర్పాట్లకు ఆ ఇల్లాలు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఏదైనా శుభకార్యం చేయాలంటే.. ఓ నెల రోజుల ముందు నుంచే వందలెక్కలు వేస్తాం.. అలాంటిది అక్కడ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా వేలాది మందికి వేడివేడిగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేస్తారు. సుమారు 50 సంవత్సరాలుగా నిత్యం కొనసాగుతున్న ఈ అన్నదాన మహత్కార్యం లక్షలాది మంది అభినందనలు అందుకుంటోంది. కరువు సీమ రాయలసీమలో నిత్యాన్నదానాలు జరగడం ఒక విశేషమైతే కాశినాయన మొట్టమొదట ప్రారంభించిన అన్నదాన సత్రం అహోబిలంలోనిది కావడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం నుంచి మూడు కిలో మీటర్లు అడవిలోపలికి వెళితే యోగానంద నృసింహస్వామి క్షేత్రం వస్తుంది. ఒకప్పుడు ప్రజలు ఏమాత్రం సంచరించేందుకు వీలులేని ప్రాంతమది. అలాంటి ప్రదేశానికి నేడు ఆటోలు, ప్రత్యేక వాహనాలు, మోటర్ సైకిళ్లు భారీగా వెళ్తున్నాయి. ఈ పెను మార్పుకు ముఖ్య కారణం అక్కడ వెలసిన కాశినాయన నిత్యాన్నదాన సత్రమే. ఎలా ఏర్పాటయిందంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన కాశినాయన 1979– 80 ప్రాంతంలో యోగానంద క్షేత్రం చేరుకున్నారు. శిథిలావస్థకు చేరిన దేవాలయాన్ని ఒకే రోజు నిర్మించి అక్కడ బాలయోగానంద స్వామిని పునః ప్రతిష్టించారు. మొదట అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారని ఆయన శిష్యులు చెబుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ నిత్యాన్నదాన ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యమంలా అన్నదానం కాశినాయన చేతులమీదుగా సుమారు 50 సంవత్సరాల క్రితం చిన్న గుడిసెలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. మొదట్లో జొన్న సంగటి, రొట్టెలు, కొర్ర అన్నం, మజ్జిగ వడ్డించే వారు. భక్తుల వితరణతో నేడు ఆధునిక పద్ధతిలో వంటలు తయారు చేస్తున్నారు. రోజూ 500 మంది వరకు భోజనానికి వస్తుండగా శని, ఆదివారాల్లో వీరి సంఖ్య వెయ్యికి పెరుగుతోంది. దేశంలోని నలుమూలలనుంచి వచ్చే భక్తులకు నల్లమల అడవిలో ఇక్కడ తప్ప మరెక్కడా భోజనవసతి ఉండదు. ఏ సమయంలో పోయినా కడుపునిండా అన్నం దొరికే ప్రదేశం కాశినాయన ఆశ్రమమని చెప్పుకుంటారు. సాధారణ భక్తులు, యాత్రికులతో పాటు ఈ ప్రాంతంలోని అనేక మంది పేద వర్గాలు తమ వివాహ, ఇతర శుభకార్యాలు సైతం ఇక్కడ చేసుకుని ఉచితంగా విందు భోజనం చేసి వెళ్తుంటారు. ఏడాదికి కనీసం 15 వివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఏమీ లేకపోయినా నిత్యాన్నదానం చేస్తున్నాం ఆశ్రమం ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడి దారిలేదు. కొండలో చెట్లలో వచ్చి చిన్న పందిరి వేశాం. అప్పుడే కాశి నాయన చెప్పినాడు ఇక్కడికి వేలల్లో భక్తులు వస్తారు.. వచ్చిన అందరికి ఆకలి తీర్చాలని. ఏమీ లేక పోయినా మనం 10 మంది ఆకలి తీరిస్తే 100 మంది ఆకలి తీర్చడానికి సరిపడా సాయం దేవుడు చేస్తాడని చెప్పేవాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. మా దగ్గర ఏమీ లేక పోయినా నిత్యం అన్నదానం కొనసాగిస్తూనే ఉన్నాం. –రామదాసు, ఆశ్రమ నిర్వాహకుడు -
అడవిలో కిలోమీటర్ దూరం నడిచిన ఎమ్మెల్సీ
కడ్తాల్ (కల్వకుర్తి): మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అడవిలో దాదాపు కిలోమీటర్ దూరం నడిచారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లికి చెందిన రైతు పుట్టి యాదయ్య పొలంలోని పాకలో కట్టేసిన లేగదూడపై ఆదివారం ఉదయం చిరుత దాడి చేసి చంపింది. అనంతరం దానిని సమీపంలోని అడవిలోకి దాదాపు కిలోమీటరు దూరం వరకు లాకెళ్లింది. లేగదూడపై చిరుత దాడి విషయం తెలుసుకున్న నారాయణరెడ్డి ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం లేగదూడను చిరుత లాక్కెళ్లిన స్థలం వరకు అడవిలో సుమారు కిలోమీటర్ దూరం రైతులతో నడుచుకుంటూ వెళ్లి లేగదూడ కళేబరాన్ని పరిశీలించారు. చిరుతను వెంటనే బంధించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్సీతోపాటు సర్పంచ్ సుగుణసాయిలు, ఎంపీటీసీ ఉమావతి తదితరులు ఉన్నారు. -
నన్ను క్షమించండి! : కసిరెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తిలో నెలకొన్న టీఆర్ఎస్ అసమ్మతి కథ సుఖాంతమైంది. నెలన్నర రోజులుగా అనేక మలుపుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వెనక్కి తగ్గారు. కసిరెడ్డి కోసం గతంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పలుమార్లు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం రెండు సార్లు చర్చలు జరపడంతో పాటు స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడటంతో ఆయన మెత్తబడ్డారు. కల్వకుర్తిలో గురువరం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరు కావడంతో అసమ్మతి సద్గుమణిగినట్లయింది. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతానని, ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్ విజయానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. నన్ను క్షమించండి! ప్రజాఆశీర్వాద సభా వేదికపై కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తనను అభిమానించే నేతలు, కార్యకర్తలు క్షమిం చాలని వేడుకున్నారు. తనకు పార్టీ టికెట్ నిరాకరించిన నాటి నుంచి అండగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు నిలిచారన్నారు. వారందరూ కూడా ఎన్నికల బరిలో నిలవాలని పట్టుబట్టినా.. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి రావాలనే ఆలోచనతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో మనసు మార్చుకున్నానని వివరించారు. రైతుల కళ్లలో ఆనందం నిండాలన్నా.. ఈ ప్రాంతం పచ్చబడాలన్నా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తనను అభిమానించే వారి మనస్సు నొప్పించినందుకు క్షమించాలంటూ కసిరెడ్డి విన్నవించారు. ప్రచారానికి హాజరయ్యేనా? ప్రస్తుతం వెనక్కి తగ్గిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి... పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారా అనేది ఇప్పటికీ టీఆర్ఎస్ శ్రేణులను ఆలోచింప చేస్తోంది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నేపథ్యంలో పార్టీ శ్రేణులందరూ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకుపార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరించిన కసిరెడ్డి మున్ముందు ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజా ఆశీర్వాద సభకు కసిరెడ్డి హాజరైనప్పటికీ అతని అనుచరగణం మాత్రం దూరంగా ఉండిపోయింది. తన వర్గంగా ముద్రపడిన వారందరితో కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌ను కోరినట్లు కసిరెడ్డి సభా వేదికగా ప్రకటించారు. దీంతో కసిరెడ్డి వర్గంతో కేటీఆర్ చర్చలు జరిపితే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగమేఘాలపై ఫ్లెక్సీపై ఫొటో ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గైర్హాజరవుతారనే ఉద్దే శంతో స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఆయన ఫొటో ఏర్పాటు చేయలేదు. కేవలం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఫొటోలతో పాటు నియోజకవర్గానికి చెందిన నేతలవి మాత్రమే ముద్రించారు. కసిరెడ్డితో ఉదయం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో పాటు సమావేశానికి కూడా మంత్రి కేటీఆర్‌తో కలిసి వస్తున్నట్లు సభా నిర్వాహకులకు సమాచారం అందింది. దీంతో ఆగమేఘాల మీద కసిరెడ్డి ఫొటోను ఆ ఫ్లెక్సీపై అతికించారు. -
కసిరెడ్డికి కాంగ్రెస్ గాలం!
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుర్తి వ్యవహారం చర్చనీయాంశంగా మారబోతుంది. టీఆర్ఎస్ అసంతృప్తి నేత, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కసిరెడ్డి అనుచరులు, అభిమానులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై గురిపెట్టిన కాంగ్రెస్ చాలావేగంగా పావులు కదుపుతోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో మంచి ఆదరణ పొందిన నారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్పై ఎదురుదాడి చేయొచ్చని ఎత్తులు వేస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు మార్లు కాంగ్రెస్ నాయకులు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అతి ముఖ్యమైన నేత రంగంలోకి దిగి కసిరెడ్డితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన మాత్రం వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. వ్యూహాలకు పదును.. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే దిగువ స్థాయి కార్యకర్తల విషయంలో పోటాపోటీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఒక స్థాయి కలిగిన నేతలను చేర్చుకునేందుకు రెండు పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్లో టిక్కెట్లను ప్రకటించిన వెంటనే వెల్లువెత్తే అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో భారీగా కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా చేరికలు సైతం సాగుతున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా చేరికలు చేపట్టారు. ఇదివరకే మహబూబ్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ తరఫున గతంలో పోటీచేసిన ఇబ్రహీం, నారాయణపేటకు చెందిన కుంభం శివకుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కూడా చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కసిరెడ్డిని చేర్చుకుని పాలమూరులో టీఆర్ఎస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు. సంకటస్థితిలో కసిరెడ్డి! తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎటూ తేల్చుకోలేక పోతున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లోకి కసిరెడ్డిని తీసుకునేందుకు ఆ పార్టీ ముఖ్యులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుర్తిలో స్థానం కల్పించకపోయినా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మున్ముందు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు కల్పిస్తున్నారు. అయితే కసిరెడ్డి మాత్రం కల్వకుర్తిని వదిలి వచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న మంత్రి కేటీఆర్‌తో కసిరెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయన కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కసిరెడ్డిని టీఆర్ఎస్లోనే కొనసాగించేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కసిరెడ్డి కోసం ఏకంగా ఈనెల 14న వెల్దండలో నిర్వహించాల్సిన బహిరంగ సభను సైతం కేటీఆర్ రద్దు చేసుకున్నారు. -
కనుల పండువగా జ్యోతి ఆరాధన
బండిఆత్మకూరు: కాశినాయన 21వ ఆరాధన ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. సోమవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీపాలతో నడుచుకుంటూ కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చేరుకునా్నరు. అక్కడ ఆశ్రమంలో పెంచిన గుర్రంపై కాశినాయన చిత్రపటాన్ని పెట్టి ఊరేగించారు. రాత్రి 12గంటల సమయంలో గాయత్రిదేవి ఆలయం సమీపంలో జ్యోతిని వెలిగించారు. ఆ తర్వాత కూర్మగిరి క్షేత్రంలోనూ ఇదే విధంగా జ్యోతిని పూజారులు పూజలు నిర్వహించి వెలిగించారు. తొలిసారిగా ఓంకార క్షేత్రం ఆవరణలో ఉన్న కాశినాయన ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ జ్యోతి ఉత్సవాలను తిలకించడానికి జనం భారీగా తరలివచ్చారు.