చర్చనీయాంశంగా.. జెడ్పీ! | Nalgonda ZP Chairman Join In Congress | Sakshi
Sakshi News home page

చర్చనీయాంశంగా.. జెడ్పీ!

Published Sat, Sep 29 2018 11:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Nalgonda ZP Chairman Join In Congress - Sakshi

సాక్షిప్రతినిధి, నల్గొండ : నల్గొండ  జిల్లా పరిషత్‌ రాజకీయం రసకందాయంలో పడింది. జెడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలునాయక్‌ తిరిగి సొంతగూటికి చేరడంతో జిల్లా పరిషత్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెస్‌నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన బాలు.. చైర్మన్‌గా ఎన్నికై ఆరు నెలలకే టీఆర్‌ఎస్‌లో చేరారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన మరో 19 మంది జెడ్పీటీసీ సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌లోకి వలసెళ్లారు. జెడ్పీ పాలక వర్గంలో 59 మంది సభ్యులకుగాను స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 43 వంది,  టీఆర్‌ఎస్‌ నుంచి 13 మంది, టీడీపీ ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో ఎస్టీలకు రిజర్వుడు  అయిన నల్లగొండ జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని ఎక్కే అ దృష్టం చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన బాలునాయక్‌ను వరించింది.

అప్పటికీ ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వివిధ కారణాలతో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం, ఆ తరువాత 19 మంది కాంగ్రెస్‌ సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌లోకి చేరడంతో జెడ్పీలో వారి బలం 32కు పెరిగింది. కాంగ్రెస్‌ సంఖ్యా బలం తగ్గి, టీఆర్‌ఎస్‌ బలం పెరగడంతో జెడ్పీలో నా లుగేళ్లపాటు వారి ఆధిపత్యమే కొనసాగింది. జిల్లా పరిషత్‌కు కేటాయించే సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధుల పంపకాల్లో అధికార పార్టీ సభ్యులదే పైచేయిగా ఉండేది. పనుల పంపకాల్లో సభ్యులు అందరికీ కలిపి ఒక వాటా ఇస్తే.. చైర్మన్‌కు ప్రత్యేకమైన వాటా తీసుకునేవారు. ఈ పంపకాల విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. నిధుల పంపకాల్లో మంత్రి, ఎమ్మెల్యేల సహకారం కూడా చైర్మన్‌కు ఉండడంతో ప్రతిపక్ష సభ్యులకు నోరుమెదిపే అవకాశం లేకుండా పోయింది. చివరకు జెడ్పీ వైస్‌ చైర్మ¯Œన్‌ కర్నాటి లింగారెడ్డి సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన లింగారెడ్డి కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి లింగారెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. అధికార సభ్యుల బలంతో నాలుగేళ్ల పాటు రాజ్యమేలిన జెడ్పీ పాలక వర్గం ఇప్పుడు చైర్మన్‌ తిరిగి సొంత గూటికి చేరడంతో జెడ్పీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
పాలకవర్గానికి పది నెలల గడువు
జెడ్పీ పాలకవర్గం 2014 జులై 5న కొలువుదీరింది. ఈ ఏడాది జూలై నాటికి నాలుగేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది జులై 4వ తేదీ నాటికి సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అంటే ఇంకా పది నెలల గడువు మిగిలి ఉంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బాలునాయక్‌ తిరిగి మరోసారి ఎమ్మెల్యే కావాలనే, తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ రాష్ట్ర పార్టీ ఒకవేళ ఆయనకు టికెట్‌ కేటాయిస్తే, ఆ ఎన్నికల్లో ఆయన గెలిస్తే.. చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే, ఒకవేళ ఓడిపోతే మాత్రం తిరిగి ఆయన చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీఆర్‌ఎస్‌ మెజార్టీ సభ్యులు ఉన్న జెడ్పీలో బాలునాయక్‌ను చైర్మన్‌గా కొనసాగనిస్తారా? లేదంటే అవిశ్వాస తీర్మానానికి సభ్యులు సిద్ధపడతారా..? అన్న విషయం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేకున్నా కాంగ్రెస్‌ సభ్యులు మాత్రం సంతోషంగా ఉన్నారని అంటున్నారు. ఈ పదినెలల కా లంలో జెడ్పీకి వచ్చే నిధుల్లో కాంగ్రెస్‌ సభ్యులకు మెజార్టీ వాటా దక్కుతుందని ఆశపెట్టుకున్నారు.

అవిశ్వాసం అనివార్యమైతే..!
ఒకవేళ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తే మొత్తం సభ్యుల్లో నాలుగో వంతు మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. జెడ్పీ రాజకీయ ఎలా ఉండబోతుందో ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం అక్టోబర్‌ 11వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుందంటున్నారు. ఆ రోజున జరగనున్న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరు పార్టీల సభ్యులు ఎలా వ్యవహరించబోతున్నారు? చైర్మ¯Œన్‌ విషయంలో వారి వైఖరి ఎలా ఉండబోతోందోనన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement