అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి
గులాబీ కండువాను తీసివేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జిల్లా నాయకులు కొందరు ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. టికెట్ దక్కక కొందరు, పాత గూటికి చేరాలని మరికొందరు, అసంతృప్తులు ఇంకొందరు టీఆర్‌ఎస్ పార్టీకి టాటా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా టీఆర్‌ఎస్ మిర్యాలగూడ టికెట్ దక్కకపోవడంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. నల్లగొండ పట్టణంలో ఇప్పటికే కొందరు హస్తం బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్‌ఎస్‌ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ యా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు నెల రోజులుగా తర్జన భర్జన పడి.. చివరకు కారు ది గాలనే నిర్ణయించుకుంటున్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఎన్.భాస్కర్‌రావుకు సిట్టింగుగా భావించి టికెట్ ప్రకటించారు. దీంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెల రోజులకు పైగా తన అనుచరులతో, దగ్గరి నాయకులతో మంతనాలు జరిపిన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారని తెలిసింది.
ప్రస్తుతం మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వమన్న నిబంధన అమలయితే.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనరల్ అభ్యర్థుల కొరత ఉందని అంటున్నారు. ఈ తరుణంలో అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఎలాంటి హామీ తీసుకోకుండానే బేషరతుగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. టికెట్లు ఆశించి భగంగపడిన నాయకులు సొంత దారులు వెదుక్కుంటున్నారని దానిలో భాగంగానే అలుగుబెల్లి ఈనిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఇప్పటికే జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ నుంచే టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. దేవరకొండ టికెట్ హామీపైనే నాడు టీఆర్‌ఎస్‌లో చేరారని, కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ ఆతర్వాత పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. తమ సిట్టింగుగానే భావించిన టీఆర్‌ఎస్ నాయకత్వం టికెట్ ఆయనకే ఖరారు చేసింది. దీంతో బాలునాయక్‌కు అవకాశం దక్కకుండా పోయింది. గతంలో ఆయన దేవరకొండ నుం చి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించా రు. 2009 ఎన్నికల్లో గెలిచిన బాలునాయక్ 2014 ఎన్నిక ల నాటికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. దీంతో పొత్తుల్లో భాగంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.
అదే దారిలో మరికొందరు నేతలు
టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కక కాంగ్రెస్‌లోకి వెళుతున్న వారే కాకుండా, ఆయా స్థానాల్లో అభ్యర్థుల పట్ల అసంతృప్తిగా ఉన్న వారు, అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి టీ ఆర్‌ఎస్‌లో చేరిన వారు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పట్టణ కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్ బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్‌ఎస్‌ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా టీఆర్‌ఎస్ నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తితో కొందరు, అవకాశాలు రాక మరికొందరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని విధితమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment