మళ్లీ కాంగ్రెస్‌లోకి వినోద్‌! | TRS Leader Gaddam Vinod Join In Congress Party | Sakshi
Sakshi News home page

మళ్లీ కాంగ్రెస్‌లోకి వినోద్‌!

Published Tue, Oct 16 2018 8:22 AM | Last Updated on Tue, Oct 16 2018 5:12 PM

TRS Leader Gaddam Vinod Join In Congress Party - Sakshi

గడ్డం వినోద్‌

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: పెద్దపల్లి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జి.వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్‌ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలతో జరిపిన సంప్రదింపులు సానుకూలమైనట్లు తెలుస్తోంది. దసరాలోపు వీలుకాకపోతే ఈనెల 20న భైంసాలో జరిగే రాహుల్‌గాంధీ సభలో వినోద్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వినోద్‌తో పాటు ఆయన సోదరుడు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌ సైతం కాంగ్రెస్‌లో చేరతారా... లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వినోద్‌ ఒక్కరే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాజకీయంగా కలిసే నిర్ణయాలు తీసుకునే ‘బ్రదర్స్‌’ ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కొనసాగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్‌ నిర్ణయం కోసమే వినోద్‌ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల ముందు సీనే రిపీట్‌
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్‌ నుంచి వినోద్, వివేక్‌ బ్రదర్స్‌ తొలుత 2013 జూన్‌ 2న టీఆర్‌ఎస్‌లో చేరారు. తన తండ్రి వెంకటస్వామి  చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ద్వారానే సాధ్యమని భావించి పార్టీలో చేరినట్లు అప్పట్లో ప్రకటించారు. తెలంగాణ బిల్లు ఆమోదించిన తరువాత 2014 ఏప్రిల్‌ ఎన్నికలకు 15 రోజుల ముందు మార్చి 31న బ్రదర్స్‌ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్‌ పోటీచేసి ఓడిపోయారు.

తెలంగాణ సిద్ధించిన తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్‌ మాట మార్చి ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. వచ్చే ఎన్నికల్లో పాత స్థానాల నుంచే తాము పోటీ చేయడం ఖాయమని భావించారు. సెప్టెంబర్‌ 6న పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చెన్నూరు నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం దక్కింది. వివేక్‌ కోసమే ఎంపీగా ఉన్న సుమన్‌ను చెన్నూరు సీటుకు ఎంపిక చేసినట్లు చెపుతుండగా, మాజీ మంత్రినైన తనకు అవకాశం కల్పించకపోవడాన్ని వినోద్‌ సీరియస్‌గా తీసుకున్నారు.

 
అన్న కోసం తన సీటు  త్యాగం చేస్తానన్నా... ససేమిరా
చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇవ్వడంతో మాజీ మంత్రి వినోద్‌ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కనపెట్టి సుమన్‌కు సీటివ్వడంతో స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఓదెలు స్వీయ గృహనిర్బంధం, ఓదెలు అభిమాని గట్టయ్య ఆత్మాహుతి వంటి పరిణామా ల నేపథ్యంలో బ్రదర్స్‌ వేచిచూసే దోరణిలో ఉన్నారు. ఇటీవల వెంకటస్వామి జయంతి సందర్భంగా కలిసిన బ్రదర్స్‌ వందలాది మంది అభిమానులతో కలిసి నేరుగా మంత్రి కేటీఆర్‌ వద్దకు వెళ్లి కలిశారు.

చెన్నూరు అభ్యర్థిని మార్చాలని, చెన్నూరు అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని వివరించారు. ఈ విషయమై కేసీఆర్‌తో చర్చిస్తామని కూడా చెప్పారు. చెన్నూరు అభ్యర్థిని మార్చేది లేదని తెగేసి చెప్పిన కేటీఆర్‌ వచ్చే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా వినోద్‌కు అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ భేటీ తరువాత బ్రదర్స్‌ ఇద్దరే మరో రెండుసార్లు కేటీఆర్‌ను కలిశారు. వినోద్‌కు ఎమ్మెల్యే సీటు కోసం తాను ఎంపీ సీటును త్యాగం చేస్తానని కూడా ఓదశలో వివేక్‌ చెప్పారు. చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి గానీ, చొప్పదండి, వికారాబాద్‌ తదితర స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, సీటు ప్రకటించాలని వినోద్‌ కోరారు. కేటీఆర్‌ నుంచి ఎలాంటి హామీ రాకపోవడం, కేసీఆర్‌తో కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై బ్రదర్స్‌ కినుక వహించారు.

టీఆర్‌ఎస్‌లో గౌరవం ఇవ్వలేదని ఆవేదన
టీఆర్‌ఎస్‌లో తనకు అన్యాయం చేశారని, కాకా కొడుకుగా కానీ, మాజీ మంత్రిగా గానీ కనీస గౌరవం ఇవ్వలేదని వినోద్‌ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. ఈ విషయంపై సోదరుడితో మాట్లాడిన వినోద్‌ తాను కాంగ్రెస్‌లోకి వెళతానని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో తనకు కాంగ్రెస్‌ నేతలతో ఉన్న పరిచయాలతో కాంగ్రెస్‌ నేత షర్మిష్ట ముఖర్జీ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కూడా వివేక్‌ బ్రదర్స్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వివేక్‌ కొంత సంయమనం పాటించాల్సిందిగా వినోద్‌ను కోరుతున్నట్లు తెలిసింది.

వినోద్‌ మాత్రం 20న భైంసాలో జరిగే రాహుల్‌గాంధీ సభలో గానీ, అంతకుముందు గానీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైనట్లు సమాచారం. వినోద్‌తోపాటే వివేక్‌ కూడా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. ఈ విషయమై వినోద్‌ను ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా, టీఆర్‌ఎస్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమేనని ధ్రువీకరించారు. ‘చినబాబు(వివేక్‌)తో మాట్లాడుతున్నా... భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement