G venkata swamy
-
మళ్లీ కాంగ్రెస్‌లోకి వినోద్!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పెద్దపల్లి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జి.వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో జరిపిన సంప్రదింపులు సానుకూలమైనట్లు తెలుస్తోంది. దసరాలోపు వీలుకాకపోతే ఈనెల 20న భైంసాలో జరిగే రాహుల్‌గాంధీ సభలో వినోద్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వినోద్‌తో పాటు ఆయన సోదరుడు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ సైతం కాంగ్రెస్‌లో చేరతారా... లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వినోద్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాజకీయంగా కలిసే నిర్ణయాలు తీసుకునే ‘బ్రదర్స్’ ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కొనసాగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్ నిర్ణయం కోసమే వినోద్ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు సీనే రిపీట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ నుంచి వినోద్, వివేక్ బ్రదర్స్ తొలుత 2013 జూన్ 2న టీఆర్ఎస్లో చేరారు. తన తండ్రి వెంకటస్వామి చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ద్వారానే సాధ్యమని భావించి పార్టీలో చేరినట్లు అప్పట్లో ప్రకటించారు. తెలంగాణ బిల్లు ఆమోదించిన తరువాత 2014 ఏప్రిల్ ఎన్నికలకు 15 రోజుల ముందు మార్చి 31న బ్రదర్స్ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్ పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ సిద్ధించిన తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చి ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. వచ్చే ఎన్నికల్లో పాత స్థానాల నుంచే తాము పోటీ చేయడం ఖాయమని భావించారు. సెప్టెంబర్ 6న పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చెన్నూరు నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం దక్కింది. వివేక్ కోసమే ఎంపీగా ఉన్న సుమన్‌ను చెన్నూరు సీటుకు ఎంపిక చేసినట్లు చెపుతుండగా, మాజీ మంత్రినైన తనకు అవకాశం కల్పించకపోవడాన్ని వినోద్ సీరియస్‌గా తీసుకున్నారు. అన్న కోసం తన సీటు త్యాగం చేస్తానన్నా... ససేమిరా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇవ్వడంతో మాజీ మంత్రి వినోద్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కనపెట్టి సుమన్‌కు సీటివ్వడంతో స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఓదెలు స్వీయ గృహనిర్బంధం, ఓదెలు అభిమాని గట్టయ్య ఆత్మాహుతి వంటి పరిణామా ల నేపథ్యంలో బ్రదర్స్ వేచిచూసే దోరణిలో ఉన్నారు. ఇటీవల వెంకటస్వామి జయంతి సందర్భంగా కలిసిన బ్రదర్స్ వందలాది మంది అభిమానులతో కలిసి నేరుగా మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి కలిశారు. చెన్నూరు అభ్యర్థిని మార్చాలని, చెన్నూరు అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని వివరించారు. ఈ విషయమై కేసీఆర్‌తో చర్చిస్తామని కూడా చెప్పారు. చెన్నూరు అభ్యర్థిని మార్చేది లేదని తెగేసి చెప్పిన కేటీఆర్ వచ్చే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా వినోద్‌కు అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ భేటీ తరువాత బ్రదర్స్ ఇద్దరే మరో రెండుసార్లు కేటీఆర్‌ను కలిశారు. వినోద్‌కు ఎమ్మెల్యే సీటు కోసం తాను ఎంపీ సీటును త్యాగం చేస్తానని కూడా ఓదశలో వివేక్ చెప్పారు. చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి గానీ, చొప్పదండి, వికారాబాద్ తదితర స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, సీటు ప్రకటించాలని వినోద్ కోరారు. కేటీఆర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడం, కేసీఆర్‌తో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై బ్రదర్స్ కినుక వహించారు. టీఆర్ఎస్లో గౌరవం ఇవ్వలేదని ఆవేదన టీఆర్ఎస్లో తనకు అన్యాయం చేశారని, కాకా కొడుకుగా కానీ, మాజీ మంత్రిగా గానీ కనీస గౌరవం ఇవ్వలేదని వినోద్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. ఈ విషయంపై సోదరుడితో మాట్లాడిన వినోద్ తాను కాంగ్రెస్‌లోకి వెళతానని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో తనకు కాంగ్రెస్ నేతలతో ఉన్న పరిచయాలతో కాంగ్రెస్ నేత షర్మిష్ట ముఖర్జీ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా వివేక్ బ్రదర్స్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వివేక్ కొంత సంయమనం పాటించాల్సిందిగా వినోద్‌ను కోరుతున్నట్లు తెలిసింది. వినోద్ మాత్రం 20న భైంసాలో జరిగే రాహుల్‌గాంధీ సభలో గానీ, అంతకుముందు గానీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైనట్లు సమాచారం. వినోద్‌తోపాటే వివేక్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. ఈ విషయమై వినోద్‌ను ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా, టీఆర్ఎస్ తీరుపై అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమేనని ధ్రువీకరించారు. ‘చినబాబు(వివేక్)తో మాట్లాడుతున్నా... భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’ అని పేర్కొన్నారు. -
మల్లికార్జున్ మెరుపు సెంచరీ
సాక్షి, హైదరాబాద్ : జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో మెదక్ మావెరిక్స్ జట్టు బ్యాట్స్‌మన్ జె. మల్లికార్జున్ (52 బంతుల్లో 110; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఎంఎల్ఆర్ డిగ్రీ కాలేజి గ్రౌండ్లో గురువారం జరిగిన మ్యాచ్‌లో మెదక్ 43 పరుగుల తేడాతో కాకతీయ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు సాధించింది. మల్లికార్జున్ విజృంభణకు తోడు మికిల్ జైశ్వాల్ (39 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బౌండరీలతో హడలెత్తించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్ పోరాడి ఓడిపోయింది. బౌలర్లు వై. చైతన్య కృష్ణ (3/21), వి. భరత్ కుమార్ (3/46) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎం. యశ్వంత్‌రెడ్డి (22 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), యతిన్ రెడ్డి (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన జె. మల్లికార్జున్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ థండర్ బోల్ట్స్ 39 పరుగుల తేడాతో ఖమ్మం టిరా జట్టుపై గెలుపొందింది. బ్యాటింగ్‌లో చందన్ సహాని (50 బంతుల్లో 92; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు సాధించింది. విఠల్ అనురాగ్ (30) రాణించాడు. అనంతరం ఖమ్మం టిరా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసి ఓడిపోయింది. కె. రోహిత్ రాయుడు (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జునైద్ అలీ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో జయరామ్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. చందన్ సహాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు కరీంనగర్ వారియర్స్: 156/6 (జి. వినీత్ రెడ్డి 30, అమోల్ షిండ్ 52), నల్లగొండ లయన్స్: 160/3 (ఎ. వరుణ్ గౌడ్ 63 నాటౌట్, శశిధర్ రెడ్డి 44). ఆదిలాబాద్ టైగర్స్: 184/8 (టి. రవితేజ 30, నీరజ్ బిస్త్ 44, హితేశ్ యాదవ్ 45; కనిష్క్ నాయుడు 2/35, మెహదీహసన్ 2/24), రంగారెడ్డి రైజర్స్: 143/9 (అక్షత్ రెడ్డి 55; జి. సదన్ రెడ్డి 3/23, హితేశ్ యాదవ్ 2/16). -
కాకా అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. పూర్తి అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుని... వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్, జైపాల్‌రెడ్డి ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్తలతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు.