మెదక్ మావెరిక్స్ జట్టు
సాక్షి, హైదరాబాద్ : జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో మెదక్ మావెరిక్స్ జట్టు బ్యాట్స్‌మన్ జె. మల్లికార్జున్ (52 బంతుల్లో 110; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఎంఎల్‌ఆర్ డిగ్రీ కాలేజి గ్రౌండ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో మెదక్ 43 పరుగుల తేడాతో కాకతీయ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు సాధించింది.
మల్లికార్జున్ విజృంభణకు తోడు మికిల్ జైశ్వాల్ (39 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బౌండరీలతో హడలెత్తించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్ పోరాడి ఓడిపోయింది. బౌలర్లు వై. చైతన్య కృష్ణ (3/21), వి. భరత్ కుమార్ (3/46) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎం. యశ్వంత్‌రెడ్డి (22 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), యతిన్ రెడ్డి (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన జె. మల్లికార్జున్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ థండర్ బోల్ట్స్ 39 పరుగుల తేడాతో ఖమ్మం టిరా జట్టుపై గెలుపొందింది. బ్యాటింగ్‌లో చందన్ సహాని (50 బంతుల్లో 92; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు సాధించింది. విఠల్ అనురాగ్ (30) రాణించాడు. అనంతరం ఖమ్మం టిరా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసి ఓడిపోయింది. కె. రోహిత్ రాయుడు (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జునైద్ అలీ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో జయరామ్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. చందన్ సహాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
కరీంనగర్ వారియర్స్: 156/6 (జి. వినీత్ రెడ్డి 30, అమోల్ షిండ్ 52), నల్లగొండ లయన్స్: 160/3 (ఎ. వరుణ్ గౌడ్ 63 నాటౌట్, శశిధర్ రెడ్డి 44).
ఆదిలాబాద్ టైగర్స్: 184/8 (టి. రవితేజ 30, నీరజ్ బిస్త్ 44, హితేశ్ యాదవ్ 45; కనిష్క్ నాయుడు 2/35, మెహదీహసన్ 2/24), రంగారెడ్డి రైజర్స్: 143/9 (అక్షత్ రెడ్డి 55; జి. సదన్ రెడ్డి 3/23, హితేశ్ యాదవ్ 2/16).
Comments
Please login to add a commentAdd a comment