భీమా కోరేగావ్‌ చరితను మరుగు పరిచే కుట్రలు! | The Battle of Bhima Koregaon History and Memorial | Sakshi
Sakshi News home page

Bhima Koregaon: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు

Published Wed, Jan 1 2025 5:14 PM | Last Updated on Wed, Jan 1 2025 5:27 PM

The Battle of Bhima Koregaon History and Memorial

చరిత్రను మట్టితో కప్పేస్తే అది పుడమిని చీల్చుకుంటూ ఏదో ఒక రోజు బహిర్గతమవుతుంది. అందుకు మంచి ఉదాహరణ భీమా కోరేగావ్‌ యుద్ధ చరిత్ర. మహారాష్ట్రలోని ప్రస్తుత పుణే జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం భీమా కోరేగావ్‌ (Bhima Koregaon). 1818 జనవరి1న అక్కడ ఓ యుద్ధం జరిగింది. మరాఠా (Maratha) సమాఖ్యలోని పీష్వా వర్గానికీ, బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకీ మధ్య జరిగిన యుద్ధాన్ని స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరిస్తూ అసలైన చరితను మరుగున పరిచే కుట్రలు జరిగాయి.

అసలేం జరిగిందంటే...
బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ నాయకత్వంలో 500 మంది మహర్‌ సైనికులు, 250 మంది అశ్వికదళం, 24 గన్నర్లతో బెటాలియన్‌ తరలి వెళ్తున్న సమయంలో ‘కోరేగావ్‌’ గ్రామంలో (పుణేకు 30 కిమీ) 20,000 పదాతి దళం, 8,000 మంది అశ్విక దళంతో కూడిన పీష్వాల సైన్యం అనుకోకుండా ఎదురైంది. దాదాపు 50 రెట్లు అథికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా, ముందుకు దూకింది మహర్‌ సైన్యం. మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్విక దళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారూ పారిపోయినా మహర్లు (Mahars) వెనకడుగు వేయకుండా పోరాడసాగారు. ఒకానొక దశలో ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్‌ స్టాటన్‌ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనను లొంగి పొమ్మని ఆజ్ఞాపించాడు.

అప్పుడు మహర్‌ సైన్యం నాయకుడు శికనాగ్‌ యుద్ధాన్ని విరమించడానికి నిరాకరించాడు. వందల సంవత్సరాలుగా తమని బానిసలుగా మార్చి పశువులకన్నా హీనంగా చూస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఇదే అవకాశం అని వాదించాడని అంటారు. మొత్తానికి కెప్టెన్‌ స్టాటన్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్‌ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్‌ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్‌. దీంతో పీష్వా సైన్యం, ఫూల్గావ్‌ లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు. వారిని భీమా నది దాటేదాకా తరిమింది మహర్‌ సైన్యం.

చరిత్రలో ఈ ఘటనకు బ్రిటిష్‌ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో–మరాఠా యుద్ధంగా, అందులో పోరాడిన పీష్వాను  స్వాతంత్య్ర సమరయోధునిగా చెబుతారు సంప్రదాయ చరిత్రకారులు. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్‌ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కోరేగావ్‌ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో ‘విజయస్తూపం’ ఏర్పాటు చేసింది బ్రిటిష్‌ ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్‌ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది.

చ‌ద‌వండి: ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...

‘ఇది మహర్‌ పోరాట యోధుల చరిత్ర. యావత్‌ సమాజానికి స్ఫూర్తినిచ్చే పోరాట’మని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 1927 నుండీ చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా ఈ విజయ స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు. బాబాసాహెబ్‌ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న ‘సమతా సైనిక్‌ దళ్‌’వారు ఇప్పటికీ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళులు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అసలైన చరిత్రను భావితరాలకు అందజేద్దాం. అసమానతలు లేని సమ సమాజం వైపు పయనిద్దాం.

– ములక సురేష్, ఉపాధ్యాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement