Pune district
-
భీమా కోరేగావ్ చరితను మరుగు పరిచే కుట్రలు!
చరిత్రను మట్టితో కప్పేస్తే అది పుడమిని చీల్చుకుంటూ ఏదో ఒక రోజు బహిర్గతమవుతుంది. అందుకు మంచి ఉదాహరణ భీమా కోరేగావ్ యుద్ధ చరిత్ర. మహారాష్ట్రలోని ప్రస్తుత పుణే జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం భీమా కోరేగావ్ (Bhima Koregaon). 1818 జనవరి1న అక్కడ ఓ యుద్ధం జరిగింది. మరాఠా (Maratha) సమాఖ్యలోని పీష్వా వర్గానికీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకీ మధ్య జరిగిన యుద్ధాన్ని స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరిస్తూ అసలైన చరితను మరుగున పరిచే కుట్రలు జరిగాయి.అసలేం జరిగిందంటే...బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, 250 మంది అశ్వికదళం, 24 గన్నర్లతో బెటాలియన్ తరలి వెళ్తున్న సమయంలో ‘కోరేగావ్’ గ్రామంలో (పుణేకు 30 కిమీ) 20,000 పదాతి దళం, 8,000 మంది అశ్విక దళంతో కూడిన పీష్వాల సైన్యం అనుకోకుండా ఎదురైంది. దాదాపు 50 రెట్లు అథికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా, ముందుకు దూకింది మహర్ సైన్యం. మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్విక దళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారూ పారిపోయినా మహర్లు (Mahars) వెనకడుగు వేయకుండా పోరాడసాగారు. ఒకానొక దశలో ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనను లొంగి పొమ్మని ఆజ్ఞాపించాడు.అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శికనాగ్ యుద్ధాన్ని విరమించడానికి నిరాకరించాడు. వందల సంవత్సరాలుగా తమని బానిసలుగా మార్చి పశువులకన్నా హీనంగా చూస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఇదే అవకాశం అని వాదించాడని అంటారు. మొత్తానికి కెప్టెన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్. దీంతో పీష్వా సైన్యం, ఫూల్గావ్ లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు. వారిని భీమా నది దాటేదాకా తరిమింది మహర్ సైన్యం.చరిత్రలో ఈ ఘటనకు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో–మరాఠా యుద్ధంగా, అందులో పోరాడిన పీష్వాను స్వాతంత్య్ర సమరయోధునిగా చెబుతారు సంప్రదాయ చరిత్రకారులు. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కోరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో ‘విజయస్తూపం’ ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది.చదవండి: ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...‘ఇది మహర్ పోరాట యోధుల చరిత్ర. యావత్ సమాజానికి స్ఫూర్తినిచ్చే పోరాట’మని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1927 నుండీ చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా ఈ విజయ స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు. బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న ‘సమతా సైనిక్ దళ్’వారు ఇప్పటికీ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళులు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అసలైన చరిత్రను భావితరాలకు అందజేద్దాం. అసమానతలు లేని సమ సమాజం వైపు పయనిద్దాం.– ములక సురేష్, ఉపాధ్యాయుడు -
75% ఓటింగే లక్ష్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంధ సంస్థలు ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహనకల్పిస్తున్నారు. సైకిల్ ర్యాలీలు, ప్రచార రథాలతో ఓటు విలువను తెలియజేయడం, మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఓట్ ఎక్స్‌ప్రెస్’ మినీబస్‌ను కూడా ప్రాంభించారు. పింప్రి, చించ్వడ్, బోసిరి అసెంబ్లీ నియోజక వర్గాలలో తిరిగి ప్రజల్లో ఈ వాహనం జనజాగృతి కల్పించనుంది. చించ్వడ్ ఎన్నికల అధికారి భానుదాస్ గైక్వాడ్ ఓట్ ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా వుండగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పుణే జిల్లాలో కేవలం 54.44 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 57.42 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే కేవలం మూడు శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఎన్నికల సంఘం ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కసరత్తు చేస్తోంది. మరోపక్క జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీధి సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పార్టీల ప్రచార డిజిటల్ స్క్రీన్ల రథాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు పోటీపడి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో ఎన్నికల కురుక్షేత్రం మహా సంగ్రామాన్ని తలపిస్తోంది. దీనికి తోడుగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఓట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఎన్నికల సందడి మరింత రసవత్తరంగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రవీణ్ లడకత్, నోడల్ ఆఫీసర్ యశ్వంత్ మన్కేడ్కర్, అన్నా బోదడే, శరద్ మాన్కర్, ప్రకాష్బన్, షబ్బీర్షేఖ్, అనిల్ పాసల్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘నిర్మల్’ సాధించేదెప్పుడు?
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు అనేక సంవత్సరాలుగా నిర్మల్ గ్రామాలుగా ఎంపిక కాలేకపోతున్నాయి. స్వచ్ఛత, పర్యావరణం లాంటి అంశాలను పాటించడం తదితర ప్రాతిపదికన నిర్మల్ గ్రామ పథకానికి ఎంపిక అవుతాయి. ఇలాంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సదరు గ్రామాలకు లక్షలాది రూపాయలు పారితోషికంగా ఇస్తోంది. అర్హతలేని 994 గ్రామాలు జిల్లాలో మొత్తం 1,404 గ్రామాలుండగా, 2014 వరకు జిల్లాలోని 994 గ్రామాలు ఈ పోటీలకు కనీస అర్హత కూడా సాధించలేకపోయాయి. ఖేడ్ తాలూకాలో అత్యధికంగా 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందాపూర్ తాలూకాలో 98, జున్నార్‌లో 90, శిరూర్‌లో 78, హవేలిలో 72, ముల్షీలో 69, పురంధర్లో 66, భోర్‌లో 63 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలలో సరైన నీటి వసతి, డ్రైనేజీ, మరుగుదొడ్లు, చెత్త కండీలు లాంటి కనీస సదుపాయలు కూడా లేకపోవడంతో నిర్మల్ గ్రామాలకు అర్హత సాధించలేకపోయాయి. ఇక బారామతి తాలూకాలో 54, దౌండ్‌లో 57, వేల్హా తాలూకాలో 45 గ్రామాలదీ ఇదే దుస్థితి. భోర్ తాలూకాలో 92 గ్రామ పంచాయతీలు నిర్మల్ గ్రామాల సరసన చేరేందుకు కనీసం ప్రయత్నం చేయగా, ఇందులో 59 గ్రామాలు నిర్మల్ గ్రామాలుగా అర్హత సాధించాయి. ఖేడ్‌లో 32, బారామతి తాలూకాలో 44 గ్రామాలకు నిర్మల్ గ్రామ పురస్కారాలు అందాయి. తాలూకాల వారీగా.. నిర్మల్ గ్రామ పంచాయతీలు ఇవే.. ఆంబేగావ్ 103, (40 గ్రామాలు నిర్మల్ గ్రామ పంచాయతీలుగా అర్హత సాధించాయి), బారామతి 97 (44), భోర్ 155 (59), దౌండ్ 79 (28), హవేలి 100 (28), ఇందాపూర్ 113 (13), జున్నార్ 142 (37), ఖేడ్ 163 (32), మావల్ 104 (24), ముల్షీ 95 (27), పురంధర్ 90 (27), శిరూర్ 93 (16), వేల్హే 70 (36) ఉన్నాయి. -
ఈగ వాలింది, పదవి దక్కింది
రాజమౌళి సినిమాతో హీరోగా మారిన ఈగ...మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే ఈగనే చూసిన మనం... ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే పెత్తనం తీసుకుంది. చిలక జోస్యం మాదిరిగానే ఏకంగా ఓ గ్రామానికి ఉప సర్పంచి పోస్ట్‌కు అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తిమీద వేసుకుంది. ఇదంతా తమాషా అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేద్ (రాజ్‌గురు నగర్)తాలూకా సత్కారష్తల్ అనే గ్రామంలో జరిగిన ఈ వింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే సత్కారష్తల్ గ్రామ పంచాయతీలో మొత్తం 9మంది వార్డు మెంబర్లు ఉండగా, వారిలో ముగ్గురు ఉప సర్పంచ్ పదవికి పోటీపడ్డారు. అయితే ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే బాధ్యతను పంచాయతీ పెద్దలు ...ఈగకు అప్పగించారు. ఈగ ఏ చిట్టీపై వాలితే అందులో పేరున్న వ్యక్తే ఉప సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. దాంతో ఈగ గారి నిర్ణయమే శిలాశాసనం. వార్డు మెంబర్లు అంతా ఆ వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. పదవికి పోటీ పడిన ముగ్గురి పేర్లు చీట్టీలు రాసి స్థానిక భైరవనాథ్ ఆలయంలో ఉంచారు. రాజు గారి తీర్పు కోసం ప్రజలు ఎదురు చూసినట్లు ఈగ తీర్పు కోసం వారు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. పది నిమిషాలు వేచి చూసిన తర్వాత కానీ ఈగగారు ఆ చిట్టీపై వాలలేదు. ఈ వాలుడు తీర్పులో సంజీవని తింగ్లే అనే మహిళకు ఉప సర్పంచ్ పదవి వరించింది. తనకు పదవిని కట్టబెట్టిన ఈగగారికి కృతజ్ఞత తెలుపుకుని ఆమె ఉప సర్పంచ్‌గా బాధ్యతలు కూడా స్వీకరించేసింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జిల్లా అధికారులు ఠాఠ్... ఈగ పెత్తనం చెల్లందంటూ అభ్యంతరం తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం మా ఆచారం మాది... మీ అభ్యంతరాలు మీవి అంటూ తోసిపుచ్చారు. గతంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే పద్దతి అనుసరించామని చెప్పుకొచ్చారు. అయితే ఈ తతంగంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈగ గారి ఘనకార్యం లోకల్ న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్‌లో మారుమోగిపోయాయి. ఖేద్ గ్రామం సెలబ్రెటీగా మారిపోయిందని ఆ గ్రామ ప్రజులు మురిసిపోతుంటే ... ఈగ చలవ వల్ల ఉప సర్పంచ్ పదవి దక్కిన మహిళ మాత్రం తన అదృష్టానికి ఖుషీ అయిపోతుంది.