ఈగ వాలింది, పదవి దక్కింది
రాజమౌళి సినిమాతో హీరోగా మారిన ఈగ...మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే ఈగనే చూసిన మనం... ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే పెత్తనం తీసుకుంది. చిలక జోస్యం మాదిరిగానే ఏకంగా ఓ గ్రామానికి ఉప సర్పంచి పోస్ట్కు అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తిమీద వేసుకుంది. ఇదంతా తమాషా అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేద్ (రాజ్గురు నగర్)తాలూకా సత్కారష్తల్ అనే గ్రామంలో జరిగిన ఈ వింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు విషయానికి వస్తే సత్కారష్తల్ గ్రామ పంచాయతీలో మొత్తం 9మంది వార్డు మెంబర్లు ఉండగా, వారిలో ముగ్గురు ఉప సర్పంచ్ పదవికి పోటీపడ్డారు. అయితే ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే బాధ్యతను పంచాయతీ పెద్దలు ...ఈగకు అప్పగించారు. ఈగ ఏ చిట్టీపై వాలితే అందులో పేరున్న వ్యక్తే ఉప సర్పంచ్గా ఎన్నిక అవుతారు. దాంతో ఈగ గారి నిర్ణయమే శిలాశాసనం. వార్డు మెంబర్లు అంతా ఆ వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. పదవికి పోటీ పడిన ముగ్గురి పేర్లు చీట్టీలు రాసి స్థానిక భైరవనాథ్ ఆలయంలో ఉంచారు. రాజు గారి తీర్పు కోసం ప్రజలు ఎదురు చూసినట్లు ఈగ తీర్పు కోసం వారు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. పది నిమిషాలు వేచి చూసిన తర్వాత కానీ ఈగగారు ఆ చిట్టీపై వాలలేదు.
ఈ వాలుడు తీర్పులో సంజీవని తింగ్లే అనే మహిళకు ఉప సర్పంచ్ పదవి వరించింది. తనకు పదవిని కట్టబెట్టిన ఈగగారికి కృతజ్ఞత తెలుపుకుని ఆమె ఉప సర్పంచ్గా బాధ్యతలు కూడా స్వీకరించేసింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జిల్లా అధికారులు ఠాఠ్... ఈగ పెత్తనం చెల్లందంటూ అభ్యంతరం తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం మా ఆచారం మాది... మీ అభ్యంతరాలు మీవి అంటూ తోసిపుచ్చారు.
గతంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే పద్దతి అనుసరించామని చెప్పుకొచ్చారు. అయితే ఈ తతంగంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈగ గారి ఘనకార్యం లోకల్ న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్లో మారుమోగిపోయాయి. ఖేద్ గ్రామం సెలబ్రెటీగా మారిపోయిందని ఆ గ్రామ ప్రజులు మురిసిపోతుంటే ... ఈగ చలవ వల్ల ఉప సర్పంచ్ పదవి దక్కిన మహిళ మాత్రం తన అదృష్టానికి ఖుషీ అయిపోతుంది.