deputy sarpanch
-
పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఉప సర్పంచి, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు (37) నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు. అతడి మృతితో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈనెల 4న పాకాలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లు కౌంటింగ్‌కు వెళ్లాడు. ఆయన కుమారుడు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్నాడు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈనెల 4వ తేదీ ఉదయం ఏడుగంటల సమయంలో నాగమల్లేశ్వరరావును ట్రబుల్ మంగర్స్ బైండోవర్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో రెంటపాళ్లలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై, ఎస్సీ కాలనీపై దాడులకు దిగారు. నాగమల్లేశ్వరరావు ఇంట్లో ఆయన భార్య నందిని, కుమార్తె యశస్విని ఉన్నారు. ఇంటిమీద దాడిచేస్తున్న విషయాన్ని యశస్విని తన తండ్రి నాగమల్లేశ్వరరావుకు ఫోన్‌చేసి చెప్పింది. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయన ఫోన్ మాట్లాడబోతుండగా పోలీసులు ఫోన్ లాక్కున్నారు. ఈ నెల 5న సాయంత్రం మర్యాదగా గ్రామం విడిచి వెళ్లు .. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానంటూ సత్తెనపల్లి రూరల్ సీఐ రాజే‹Ùకుమార్ బెదిరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు దూరంగా ఉంటే గొడవలు సర్దుబాటవుతాయని భావించిన తండ్రి వెంకటేశ్వర్లు కూడా నాగమల్లేశ్వరరావును గుంటూరులో సోదరుడు కొర్లకుంట శ్రీకాంత్ వద్దకు పంపాడు. తనపై ఒక్క కేసు కూడా లేకపోయినా, ఇంటిపైకి వచ్చి గొడవచేసి దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులను వదిలేసి పోలీసులు తనను బెదిరించటంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఈనెల 6న పేరేచర్ల వద్ద గడ్డిమందు కొనుగోలు చేసి 14వ మైలు వద్ద తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడిన నాగమల్లేశ్వరరావు ఆదివారం మరణించాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదును ట్యాంపరింగ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతి వార్తతో రెంటపాళ్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసు బలగాలను మోహరించారు. నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, అంబటి అల్లుడు ఉపేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, నాయకులు నల్లబోతు శివనారాయణ, చల్లా శ్రీను, కొమెర శివశంకర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లును ఓదార్చారు. తన కుమారుడి మృతికి కారకులపై పోలీసు ఉన్నతా«ధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
గుర్జకుంట సర్పంచ్, ఉపసర్పంచ్‌పై ఫిర్యాదు!
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని గుర్జకుంట గ్రామ పంచాయతీలో జరిగినఅవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ నిధుల ఖర్చు వివరాలపై సర్పంచ్ మమతా రాంరెడ్డి, ఉపసర్పంచ్ సత్యనారాయణలను అడగగా..వారు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారన్నారు. ఈ విషయంపై నంగి చంద్రం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్నారనన్నారు. ఆ వివరాలను పరిశీలించగా పంచాయతీ నిధుల ఖర్చులో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, అట్టి వివరాలతో సంబంధిత జిల్లా, మండల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఉపసర్పంచ్ హత్య.. లేఖలో హెచ్చరిక
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం కుర్నవల్లి గ్రామ ఉపసర్పంచ్, సీపీఎం నాయకుడు ఇర్పా రాము అలియాస్ రాముడు(36)ను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి హతమార్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాము, అతడి భార్య ఇంటి వరండాలో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి 12 గంటలకు సాధారణ దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు రామును నిద్ర లేపారు. మాట్లాడే పనుందంటూ తీసుకెళ్తుండగా, రాము భార్య కనకమ్మ ఇంట్లో నిద్రిస్తున్న అత్త, మామలు, మరిదిని లేపింది. వాళ్లు లేచేలోపే రామును తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి రహదారి వెంట రాత్రి 2గంటల వరకు వెదికారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి వెదుకుతుండగా ఛత్తీస్‌గఢ్‌లోని నిమ్మలగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై రక్తపు మడు గులో రాము మృతదేహం కనిపించింది. ముఖం, తల భాగంలో గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే ఈ శిక్ష విధించామనిమావోయిస్టు చర్ల–శబరి ఏరియా కమిటీ పేరిట ఒక లేఖ వదలివెళ్లారు. ఇన్ఫార్మర్లుగా మారి ప్రజాద్రోహులుగా తయారైతే ఎవరికైనా ఇదే శిక్ష విధిస్తామని లేఖలో హెచ్చరించారు. -
సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
నిర్మల్: సర్పంచ్‌పై మహిళా ఉపసర్పంచ్ చెప్పుతో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లలాలో గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నిర్మల్ జిల్లా మహాగామ్ గ్రామంలో చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణపై గురువారం విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ రాకేష్‌కు, ఉప సర్పంచ్ శారదకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. (చదవండి: వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) ఈ క్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉప సర్పంచ్ శారద.. సర్పంచ్ రమేష్‌ని చెప్పుతో కొట్టింది. -
తన్నుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్‌పై దాడి పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్‌తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్‌పై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్ -
ముప్పిరెడ్డిపల్లి ఉపసర్పంచ్‌పై వేటు
సాక్షి, మనోహరాబాద్(తూప్రాన్): కొత్త చట్టం ప్రకారం మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాసం సోమవారం నెగ్గింది. గత నెల 18న ఉప సర్పంచ్ రొడ్డ భిక్షపతి పనితీరు బాగాలేదని తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయంలో ఆరుగురు వార్డు సభ్యులు ఆయనపై అవిశ్వాస ఫిర్యాదు చేశారు. దీంతో గత పదిరోజుల క్రితం పాలకవర్గానికి అవిశ్వాస నోటీసులను అందజేశారు. దీంతో సోమవారం ముప్పిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఆర్డీఓ శ్యాంప్రకాష్ ఆధ్వర్యంలో డీఎల్పీఓ వరలక్ష్మీ, ఎంపీడీఓ జైపాల్‌రెడ్డిలు అవిశ్వాస పరీక్షను నిర్వహించారు. 8మంది వార్డు సభ్యులుండగా ఐదుగురు సభ్యులు చేతులు లేపడంతో భిక్షపతిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇట్టి విషయాన్ని కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు. అనంతరం నూతన ఉప సర్పంచ్ ఎన్నికకై త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి విషయం బయటకు తెలియడంతో గ్రామ పంచాయతీ వద్ద కొంత మంది దూషణలకు దిగడంతో ఎస్ఐ రాజుగౌడ్ తన సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరాల ప్రభావతి, కార్యదర్శి స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు -
ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్
సాక్షి, వరంగల్ రూరల్: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ సర్పంచ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉప సర్పంచ్ బండారి సమ్మయ్య కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సంపేట మండలం ఆకులతండా సర్పంచ్ బానోత్ రాము తీర్మానాలు లేకుండా పనులు చేస్తున్నాడని ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు రమ, శ్రీకాంత్, సమ్మాలు, అరుణ కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే సమన్వయంతో ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పంచాయతీల పరువు రచ్చకెక్కుతోంది. ఏదో ఒక సాకుతో విమర్శలు చేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల దాడులు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య జాయింట్ చెక్‌పవర్ విభేదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టంతో నేరుగా నిధులు.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం–2018 అమలులోకి రావడంతో పంచాయతీలకు నేరుగా నిధుల మంజూరు, ప్రతి జీపీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఉండడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండా పోయింది. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్‌లకు చెప్పకుండానే అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. దీంతో ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు పెట్టకుండా మొండికేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆదిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకుంటుండగా.. మెజార్టీ గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేక ఆ “పంచాయితీ’లను అధికారుల వద్దకు తెస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఒకరిమీద ఒకరు చేసుకున్న ఫిర్యాదులు 100కు పైగా వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో 50 వరకు పరిష్కరించినట్లు సమాచారం. ముందుకు సాగని పనులు మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య ఆదిపత్య పోరు.. సమన్వయ లోపం.. విభేదాల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలుపొందిన సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమన్వయంతో ముందుకు సాగాలి.. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో ముందుకు సాగి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ మేరకు వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం. చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని, సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు వారిని పలిపించి మాట్లాడడంతో పాటు ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నాం. – చంద్రమౌళి, డీపీఓ -
ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ఉపసర్పంచ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కొణిచర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొణిచర్ల మండలం బోడియాతండా గ్రామ ఉపసర్పంచ్ బాబురావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ( సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్! ) శనివారం తాను పురుగుల మందు తాగి, భార్య రంగమ్మ, ఇద్దరు చిన్న పిల్లలు మహని (4) హనిస్విని(3)లకు తాగించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సర్పంచ్ల చేతికొచ్చిన ‘పవర్’
దమ్మపేట: గ్రామపంచాయతీల్లో ఏడాదిన్నర కాలంగా ఖర్చు కాకుండా ఉన్న నిధులను వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పండింది. ప్రభుత్వం వారం రోజుల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చింది. వివిధ పథకాల కింద పంచాయతీలకు మంజూరవుతున్న నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు సూచించింది. అందులో భాగంగా సర్పంచులకు నిధుల వ్యయం, పనుల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ అమలులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామాల్లో ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించింది. ఇప్పటికైనా సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు తగిన చొరవ చూపాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ఆయా పంచాయతీల సర్పంచులు బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల్లో అత్యవసరమైన సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో వ్యయం చేశారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు నెలకొంటున్నా ఒక సొంతంగా నిధులను భరించలేమని చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పండింది. నిధుల వ్యయంపై దృష్టి.. గతంలో సర్పంచి, గ్రామ కార్యదర్శికి ఉమ్మడి చెక్‌పవర్ ఉండటంతో అవసరమైన నిధులు డ్రా చేయడం అంత సులువుగా జరిగేది కాదు. ప్రతి ఏటా నిర్వహించే ఆడిట్ సమయలో గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాల్సి వస్తుందన్న కారణంతో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకునే వారు. ఎంబీ రికార్డుల ఆధారంగా నిధులు డ్రా చేసేవారు. ప్రస్తుతం సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ రావడంతో నిధుల వ్యయంపై కార్యదర్శులకు బాధ్యత తప్పింది. ఇదే సమయంలో ఇద్దరికి ఇవ్వడం వల్ల కూడా ఇష్టానుసారంగా నిధులను డ్రా చేసే పరిస్థితి ఉండదు. గ్రామసభల్లోనూ నిధుల అందుబాటు, వ్యయం వివరాలు చర్చకు వస్తుండటంతో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం.. కొత్త చట్టంలో గ్రామసభలకు హాజరయ్యే ప్రజల సంఖ్యపై కచ్చితమైన నిబంధనలను ప్రభుత్వం పేర్కొంది. దీంతో గ్రామపంచాయతీలో ఏం జరుగుతోంది? పాలన ఎలా ఉంది? నిధుల వ్యయం పరిశీలన, ఎలాంటి పనులను చేపడతారు? అనే విషయాలు అందరికీ తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ జనాభా ఆధారంగా గ్రామసభకు ఎంత మంది హాజరు అవ్వాల్సి ఉందన్న దానిపై స్పష్టత ఇచ్చింది. గ్రామంలో 500 మంది జనాభా ఉంటే 50 మంది, వెయ్యి మంది ఉంటే 75 మంది, 3 వేలు మంది ఉంటే 150, 5 వేలు ఉంటే 200, 10 వేల జనాభా ఉంటే 300 మంది హాజరు కావాలి. ఇలా కాకుండా హాజరైన సంఖ్య తగ్గితే కోరం లేనట్లుగానే పరిగణిస్తారు. ఈ నిబంధనలతో పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతగా నడుచుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. హాజరు అంతంత మాత్రమే.. ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు పరిశీలిస్తే ప్రజలు ఎక్కడా ఆశించిన స్థాయిలో హాజరైన సందర్భాలు లేవు. గ్రామసభలు నిర్వహించే సమయాన్ని కూడా పంచాయతీలు కొన్ని సందర్భాల్లో ప్రజలకు తెలపని సంఘటనలున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మరో వైపు కోరం నిబంధనతో సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
చెక్ ‘పవర్’ ఉండేనా?
మద్దూరు(హుస్నాబాద్) : పంచాయతీ కొత్త చట్టం ప్రకారం సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఉపసర్పంచ్ పదవులకు గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ పెరిగింది. ఈ పదవులను దక్కించుకొనేందుకు నాయకులు రూ.లక్షలలో ఖర్చులు చేశారు. అలాగే కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవులకు చేసిన ఖర్చులతో సమానంగా ఖర్చులు చేశాంటే ప్రభుత్వం ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తామని చెప్పడంమే కారణం. అలాగే సర్పంచ్ పోటీలో ఉన్న ఆశావహులను ఉపసర్పంచ్ పదవులతో పార్టీలు బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి. వార్డు సభ్యుల అధిక ఖర్చులు.. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని ఆశావహులు వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన నుంచే రూ.లక్షలలో ఖర్చులు చేశారు. ప్రతీ గ్రామం నుంచి మూడు వార్డులకు పైన ఎవరికీ వారే ఉపసర్పంచ్లగా భావించి అధిక మొత్తంలో ఖర్చులు చేశారు. అనంతరం గెలిచిన సభ్యులను ప్రలోభ పెట్టి ఉపసర్పంచ్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అంత డిమాండ్ ఎందుకంటే కేవలం చెక్ పవర్ కోసమే. మరి ఇప్పుడు ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుందా? లేదా? అన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఆలోచనలో ఉపసర్పంచులు.. సర్పంచ్ ఎన్నికలు ముగిసి కొత్త పంచాయితీల బాధ్యతలు స్వీకరించి పదిహేను రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు జాయింట్ చెక్ పవర్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని, పంచాయతీరాజ్ కమిషన్ నుంచి కాని ఎలాంటి జీఓ రాక పోవడంతో ఉపసర్పంచ్లు ఎన్నికైన వారందరిలో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. అలాగే ప్రజలు ప్రస్తుతం ఉపసర్పంచ్ చెక్ పవర్‌పై చర్చలు సాగిస్తున్నారు. దీనికి తోడు మహిళ సర్పంచ్‌లు ఉన్న దగ్గర వార్డు మెంబర్లుగా పోటీ చేసి పదవులు దక్కించుకొన్నా నాయకులు ఆలోచనలో పడ్డారు. ప్రతీ అభివృద్ధి పనిలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్‌పై సంతకం పెట్టాల్సి ఉండటంతో ఉపసర్పంచ్‌ల హవా ఉంటుందని చాల మంది లక్షలు ఖర్చులు చేశారు. ప్రభుత్వం మాత్రం ఇంక జీఓ విడదల చేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. జీఓ విడుదలలో జాప్యం.. ఇంతకు ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి గనుక బాధ్యతతో నిధుల దుర్వినియోగం ఆరికట్ట వచ్చని వీరిద్దరికి చెక్ పవర్ ఇచ్చారు. కొత్త చట్టంలో మాత్రం పంచాయతీ కార్యదర్శికి బదులు ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుందని చెప్నడమే తప్ప అధికారికంగా జీఓ విడదల కాలేదు. ఇదే ఇప్పడు చర్చకు దారి తీస్తుంది. హన్మతండాలో ఇప్పటి వరకు ఉప సర్పంచ్ ఎన్నిక కాక పోవడం కొస మెరుపు. మహిళా ఉప సర్పంచ్‌లే అధికం.. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 13 మంది మహిళ సర్పంచ్‌లకు రిజర్వు అయ్యాయి దీనితో పాటు మండలంలోని 7 గ్రామ పంచాయతీలలో మహిళ ఉప్ప సర్పంచ్‌లుగా ఎన్నికై మహిళలల సత్తాను నిరూపించారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఉవ్విళ్లురుతున్నారు. చెక్ పవర్ ఇవ్వాలి.. ప్రభుత్వం చెపినట్లుగా ప్రజా ప్రతి నిధులను అభివృద్ధిలో భాగస్వాములు చేయుటకు సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ అందించి ఉప సర్పంచ్‌లను గౌరవించాలి. – సింగపాక బాలమ్మ, అర్జున్‌పట్ల ఉపసర్పంచ్ అధికారిక సమాచారం లేదు.. గ్రామ పంచాయతీలలో చెక్ పవర్ ఎవ్వరెవ్వరికీ ఉంటుందనే విషయంపై ప్రభుత్వం నుంచి గాని పంచాయతీ రాజ్ కమిషన్ నుండి గాని ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. – శ్రీనివాస్ వర్మ, ఈఓపీఆర్డీ మద్దూరు -
గుండెపోటుతో నూతన ఉపసర్పంచ్ మృతి
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికైన శ్రీశైలం గుండెపోటుతో మృతి చెందారు. ఉపసర్పంచ్‌గా శ్రీశైలం గెలుపొందిన ఆనందం నుంచి బయటకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి శ్రీశైలం మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు. -
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై సర్కారు పునరాలోచన
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు ఉమ్మడిగా చెక్ పవర్ ఇచ్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దీనిని ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చి ఆమోదం పొందినా... ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ఉప సంహరించుకోవాలని భావిస్తోంది. దీనితోపాటు కొత్త చట్టంలోని పలు ఇతర నిబంధనలనూ మార్చాలని యోచిస్తోంది. ఇందుకోసం చట్టానికి సవరణలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ దిశగానే కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను అమల్లోకి తీసుకురాకుండా ‘మినహాయింపు’ పేరిట నిలిపివేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. ఇటీవలి వరకు అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. అయితే ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. గ్రామ కార్యదర్శి అధికారానికి కత్తెర వేసింది. దానికి బదులుగా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చినా.. ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ అంశాన్ని అమల్లోకి తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే దీనికి కారణం. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తే రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా, వారి మధ్య రాజకీయ స్పర్థలున్నా.. సమన్వయం లోపించి, నిధుల వినియోగం గాడి తప్పుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది. గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం సాధారణంగా గ్రామ సభ తీర్మానాలు, పాలకవర్గం నిర్ణయాలకు అనుగుణంగానే గ్రామాల్లో నిధులు ఖర్చు చేస్తారు. గ్రామ కార్యదర్శి– సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉన్నప్పుడు... సర్పంచ్ ఏదైనా చెక్కుపై సంతకం చేస్తే, ఆ నిధులను వేటికి ఖర్చు చేస్తున్నారు, సంబంధిత తీర్మానం ఉందా.. లేదా వంటి అంశాలను కార్యదర్శి పరిశీలించి సంతకం చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారి పరిశీలన విధానం కాకుండా.. నేరుగా ఇద్దరు ప్రజాప్రతినిధులకే చెక్ పవర్ కల్పించారు. దీనివల్ల నిధుల వినియోగం ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ నిబంధనను అమలుపై సర్కారు పునరాలోచనలో పడింది. మరిన్ని అంశాలపైనా సందిగ్ధం..! కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తొమ్మిది అంశాలను మాత్రం ప్రస్తుతం అమల్లోకి తేవడం లేదంటూ మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం 2018 జూలై ఆఖరుతో ముగుస్తుందని.. అనంతరం అన్ని నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. వాటిలో సవరణలు చేసే అవకాశమున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త చట్టంలో నుంచి అమలు మినహాయించిన అంశాల్లో... ఉప సర్పంచ్‌కు చెక్ పవర్, ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగించటం, గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి కార్యదర్శిపై చర్యలు, సర్పంచ్‌లను సస్పెండ్ చేసేలా కలెక్టర్‌కు అధికారాలు, కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగపర్చకుంటే చర్యలు, లేఔట్లు–భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సమకూర్చటం, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభ కోరం ఉండాలనే నిబంధనలను మినహాయించారు. ఇందులో గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెక్ పవర్ లేకున్నా కార్యదర్శులను ఆడిటింగ్ బాధ్యులను చేయటం, హరితహారం మొక్కల పెంపకంలో చర్యలు తీసుకునేలా నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల్లో సర్పంచ్‌లనే బాధ్యులుగా చేయాల్సిన సర్కారు.. కార్యదర్శులపై కటువుగా ఉండటమేమిటనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని పలు నిబంధనలను సవరించడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ఇసుక లారీ ఢీకొని ఉపసర్పంచ్ మృతి
సాక్షి, పెద్దపల్లి/మంథని : పెద్దపల్లి జిల్లాలో మరో నేరెళ్ల ఘటన పునరావృతమైంది. ఇసుక లారీ మరో ప్రాణం బలిగొనడంతో రగిలిపోయిన గ్రామస్థులు తిరగబడ్డారు. దాదాపు 200 ఇసుక లారీలపై దాడికి దిగారు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై దాదాపు ఐదుగంటల పాటు జరిగిన ఆందోళనతో 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. వివరాలిలా ఉన్నాయి..పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ ఎస్సీ కాలనీ సమీపంలో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆదివారంపేట ఉపసర్పంచ్ ఎరువాక రాజయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లడంతో, కొద్దిదూరంలో పట్టుకున్న స్థానికులు ఆ లారీ అద్దాలు, లైట్లను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో వెనుక ఆగి ఉన్న సుమారు 200 లారీల అద్దాలు, లైట్లను కూడా ధ్వంసం చేశారు. మృతదేహంతో బైఠాయించి ఐదు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి.. రాజాపూర్‌కు చెందిన రాజయ్య(65 ) గ్రామ ఉప సర్పంచ్. మరో వ్యక్తితో కలసి ద్విచక్ర వాహనంపై బేగంపేట వైపు పొలం వద్దకు బయలు దేరాడు. అదే సమయంలో మంథని నుంచి వస్తున్న ఇసుక లారీ వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రాజయ్య తలకు బలమైన గాయౖ మె అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. లారీలను నియంత్రించాలని, మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లిం చాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. -
కరెంటు షాక్‌తో ఉపసర్పంచ్ మృతి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం శాయంపేట గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ రావు(32) మంగళవారం కరెంటు షాక్‌తో మృతిచెందాడు. తన వ్యవసాయబావి వద్ద మోటారు ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోపాల్ రావుకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. -
ఉప సర్పంచ్‌పై ఉగ్రవాదుల కాల్పులు
షోపియాన్: భారత సైన్యం, బీఎస్ఎఫ్ బలగాలు, బడా నేతలేకాక గ్రమస్థాయి రాజకీయ నాయకులు సైతం ఉగ్రవాదులకు టార్గెట్ గా మారారు. జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా తహ్లీపురా ఉప సర్పంచ్ మహమ్మద్ యాకూబ్ మల్లాపై గుర్తుతెలియని ఉగ్రవాదులు మంగళవారం మద్యాహ్నం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లాను శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 'షోపియాన్ పట్టణంలో ఓ దుకాణం ముందు నిలబడి టీ తాగుతోన్న యాకూబ్ మల్లాను.. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చారు' అని పోలీసులు చెప్పారు. -
ఈగ వాలింది, పదవి దక్కింది
రాజమౌళి సినిమాతో హీరోగా మారిన ఈగ...మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే ఈగనే చూసిన మనం... ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే పెత్తనం తీసుకుంది. చిలక జోస్యం మాదిరిగానే ఏకంగా ఓ గ్రామానికి ఉప సర్పంచి పోస్ట్‌కు అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తిమీద వేసుకుంది. ఇదంతా తమాషా అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేద్ (రాజ్‌గురు నగర్)తాలూకా సత్కారష్తల్ అనే గ్రామంలో జరిగిన ఈ వింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే సత్కారష్తల్ గ్రామ పంచాయతీలో మొత్తం 9మంది వార్డు మెంబర్లు ఉండగా, వారిలో ముగ్గురు ఉప సర్పంచ్ పదవికి పోటీపడ్డారు. అయితే ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే బాధ్యతను పంచాయతీ పెద్దలు ...ఈగకు అప్పగించారు. ఈగ ఏ చిట్టీపై వాలితే అందులో పేరున్న వ్యక్తే ఉప సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. దాంతో ఈగ గారి నిర్ణయమే శిలాశాసనం. వార్డు మెంబర్లు అంతా ఆ వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. పదవికి పోటీ పడిన ముగ్గురి పేర్లు చీట్టీలు రాసి స్థానిక భైరవనాథ్ ఆలయంలో ఉంచారు. రాజు గారి తీర్పు కోసం ప్రజలు ఎదురు చూసినట్లు ఈగ తీర్పు కోసం వారు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. పది నిమిషాలు వేచి చూసిన తర్వాత కానీ ఈగగారు ఆ చిట్టీపై వాలలేదు. ఈ వాలుడు తీర్పులో సంజీవని తింగ్లే అనే మహిళకు ఉప సర్పంచ్ పదవి వరించింది. తనకు పదవిని కట్టబెట్టిన ఈగగారికి కృతజ్ఞత తెలుపుకుని ఆమె ఉప సర్పంచ్‌గా బాధ్యతలు కూడా స్వీకరించేసింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జిల్లా అధికారులు ఠాఠ్... ఈగ పెత్తనం చెల్లందంటూ అభ్యంతరం తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం మా ఆచారం మాది... మీ అభ్యంతరాలు మీవి అంటూ తోసిపుచ్చారు. గతంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే పద్దతి అనుసరించామని చెప్పుకొచ్చారు. అయితే ఈ తతంగంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈగ గారి ఘనకార్యం లోకల్ న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్‌లో మారుమోగిపోయాయి. ఖేద్ గ్రామం సెలబ్రెటీగా మారిపోయిందని ఆ గ్రామ ప్రజులు మురిసిపోతుంటే ... ఈగ చలవ వల్ల ఉప సర్పంచ్ పదవి దక్కిన మహిళ మాత్రం తన అదృష్టానికి ఖుషీ అయిపోతుంది.