![Medak Fight Between Sarpanch and Sub Sarpanch in the Matter of Sewer Construction - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/27/Medak.jpg.webp?itok=Vglf-5mP)
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు.
పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్‌పై దాడి
పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్‌తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్‌పై దాడి చేశారు. దీంతో ఎస్‌ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment