చర్ల: పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం కుర్నవల్లి గ్రామ ఉపసర్పంచ్, సీపీఎం నాయకుడు ఇర్పా రాము అలియాస్ రాముడు(36)ను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి హతమార్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాము, అతడి భార్య ఇంటి వరండాలో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి 12 గంటలకు సాధారణ దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు రామును నిద్ర లేపారు.
మాట్లాడే పనుందంటూ తీసుకెళ్తుండగా, రాము భార్య కనకమ్మ ఇంట్లో నిద్రిస్తున్న అత్త, మామలు, మరిదిని లేపింది. వాళ్లు లేచేలోపే రామును తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి రహదారి వెంట రాత్రి 2గంటల వరకు వెదికారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి వెదుకుతుండగా ఛత్తీస్‌గఢ్‌లోని నిమ్మలగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై రక్తపు మడు గులో రాము మృతదేహం కనిపించింది.
ముఖం, తల భాగంలో గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే ఈ శిక్ష విధించామనిమావోయిస్టు చర్ల–శబరి ఏరియా కమిటీ పేరిట ఒక లేఖ వదలివెళ్లారు. ఇన్‌ఫార్మర్లుగా మారి ప్రజాద్రోహులుగా తయారైతే ఎవరికైనా ఇదే శిక్ష విధిస్తామని లేఖలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment