
పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి
భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు
స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ ఆరోగ్యకర సమాజంలో భాగం
అభిప్రాయాలతో విభేదించాలే గానీ.. ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాన్ని అణిచివేయకూడదు
ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ఫిర్యాదుదారుకు తెలియజేయాలి
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలి
మేం విన్న మాటలు, చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు
అయినా కూడా పౌరుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది
న్యాయస్థానాలు ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వైపే ఉండాలి
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగ్రాహి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత
సాక్షి, అమరావతి: పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే విషయంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులు, పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ ఆలోచనలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడమనేది ఆరోగ్యకరమైన, నాగరిక సమాజంలో అంతర్భాగమని పేర్కొంది.
స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదని పేర్కొంది.
పోలీసులు విఫలమైతే కోర్టులు బాధ్యత తీసుకోవాలి...
‘‘పోలీసులు లేదా కార్యనిర్వాహక సంస్థలు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులను గౌరవించడం, పరిరక్షించడంలో విఫలమైతే న్యాయస్థానాలు ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగే సంస్థ మరొకటి ఏదీ లేదు. మనది గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా మౌలిక సూత్రాలలో మనం ఇలా అస్థిరంగా ఉండకూడదు.
కేవలం ఒక కవిత పఠనం, వినోద రూపంలో కళా ప్రదర్శన చేయడం లాంటివి సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించడం ఎంత మాత్రం సరైంది కాదు. ఇలాంటి దృక్పథాన్ని అంగీకరించడమంటే అది ప్రజాస్వామ్యంలో న్యాయసమ్మతమైన అన్ని అభిప్రాయాలను అణిచివేయడమే అవుతుంది. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాగే అందులోని ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని విమర్శించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా కేసులు బనాయిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇమ్రాన్ ప్రతాప్‌గ్రాహిపై కేసు కొట్టివేత...
ఇన్‌స్ట్రాగామ్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గ్రాహిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఇమ్రాన్‌పై మోపిన నేరం ఏదీ ఆయనకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తీర్పులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
విభేదించవచ్చు.. కానీ గౌరవించాలి!
ఓ వ్యక్తి వ్యక్తం చేసే అభిప్రాయాలతో ఎంతోమంది విబేధించవచ్చునని, అయితే ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును అందరూ గౌరవించడంతో పాటు ఆ హక్కును పరిరక్షించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సాహిత్యం, కవిత్వం, నాటకాలు, సినిమాలు, వ్యంగ్య రచనలు, కళలు మానవ జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తాయని, వాటిని విద్వేషాలను రెచ్చగొట్టేవిగా పరిగణించరాదని సూచించింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు అవి అమలయ్యేలా చూడటం న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యమని సుప్రీంకోర్టు తెలిపింది.
కొన్నిసార్లు తమకు వినబడిన, రాయబడిన మాటలను న్యాయమూర్తులుగా తాము ఇష్టపడకపోవచ్చునని, అయినప్పటికీ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే న్యాయమూర్తులుగా రాజ్యాంగాన్ని, అందులోని ఆదర్శాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందంది. పౌరుల హక్కులను రక్షించే విషయంలో సదా ముందు ఉండటం న్యాయస్థానాల బాధ్యతని వ్యాఖ్యానించింది.
ప్రాథమిక హక్కులను కోర్టులు పరిరక్షించాలి...
ప్రధానంగా రాజ్యాంగ న్యాయస్థానాలు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు అగ్రభాగంలో ఉండాలని సుప్రీం సూచించింది. రాజ్యాంగం, ఆదర్శాలను అణిచివేయకుండా చూడాల్సిన ఉత్కృష్ట బాధ్యత న్యాయస్థానాలపై ఉందని పేర్కొంది. న్యాయస్థానాలు ఎప్పుడూ పౌరుల ప్రాథమిక హక్కులను ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించి, దానిని ప్రోత్సహించే వైపే ఉండాలని తెలిపింది. ఇది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు అని తేల్చి చెప్పింది.
పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటని తెలిపింది. పోలీసులు కూడా ఈ దేశ పౌరులేనని, అందువల్ల రాజ్యాంగాన్ని అనుసరించడం, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం వారి బాధ్యతని తెలిపింది. విచారణకు స్వీకరించదగ్గ నేరం చేశారన్న సమాచారం అందినప్పుడు సదరు పోలీసు అధికారి మొదట ప్రాథమిక విచారణ చేపట్టాలంది.
ప్రాథమిక విచారణ తరువాత ఆ నేరం విచారణకు స్వీకరించదగ్గదని తేలితే, అప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొంది. విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలంది. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారని తెలిపింది.
» స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుంది
» విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలి. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారు.
» ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదు.
» స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు.. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటి.