Housefly
-
Hyderabad: చికెన్ బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఓ బిర్యానీ హౌజ్ నిర్వాహకులకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీచేసినట్లు బాధితుడు బస్వరాజుల రాజేష్ బుధవారం వివరించారు. ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాలలో చదువుతున్న రాజేష్ గత ఏడాది అక్టోబర్ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్‌లో భోజనం చేస్తున్న సమయంలో ఈగ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. అయితే నిర్వాహకులు పట్టించుకోకుండా బిర్యానీకి బిల్లు వసూలు చేశారు. దీంతో రాజేష్ వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఫోరం వారు కేసును విచారణ చేపట్టి ఫిర్యాదుదారుడికి నష్టపరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదనే ఫోరంలో కేసు వేసినట్లు రాజేష్ పేర్కొన్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?) -
బుట్ట భోజనం ఆర్డర్: ఓపెన్ చేస్తే ఈగ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా బయట ఫుడ్ తినాలంటేనే జనాలు జంకుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ భయాన్ని జిహ్వచాపల్యం అణిచివేస్తుంది. ముఖ్యంగా నగరవాసులు ఆహారం కోసం ఎక్కువగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలమీదే ఆధారపడుతారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఈగ వచ్చిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భాగ్యనగరానికి చెందిన బెల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కొండాపూర్‌లోని సుబ్బయ్యగారి హోటల్ నుంచి స్విగ్గీలో బుట్ట భోజనం ఆర్డర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ అతని ఆహారాన్ని తీసుకువచ్చి ఇవ్వగానే ఎంతో ఆతృతగా దాన్ని ఓపెన్ చేశాడు. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!) ఇంతలో హల్వాలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని మరింత పరిశీలించి చూడగా అది ఈగ అని తెలిసింది. దీంతో అతను సోషల్ మీడియాలో స్వీటు ఫొటోను పోస్ట్ చేశాడు. "ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కరోనా కాలంలోనూ మంచి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్తారు. కానీ తీరా ఇలాంటి అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తారు. అదృష్టం బాగుండి నేను దాన్ని తినకముందే చూశాను" అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన స్విగ్గీ క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పేర్కొంది. (ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం?) -
ఈగ వాలింది, పదవి దక్కింది
రాజమౌళి సినిమాతో హీరోగా మారిన ఈగ...మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే ఈగనే చూసిన మనం... ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే పెత్తనం తీసుకుంది. చిలక జోస్యం మాదిరిగానే ఏకంగా ఓ గ్రామానికి ఉప సర్పంచి పోస్ట్‌కు అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తిమీద వేసుకుంది. ఇదంతా తమాషా అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేద్ (రాజ్‌గురు నగర్)తాలూకా సత్కారష్తల్ అనే గ్రామంలో జరిగిన ఈ వింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే సత్కారష్తల్ గ్రామ పంచాయతీలో మొత్తం 9మంది వార్డు మెంబర్లు ఉండగా, వారిలో ముగ్గురు ఉప సర్పంచ్ పదవికి పోటీపడ్డారు. అయితే ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే బాధ్యతను పంచాయతీ పెద్దలు ...ఈగకు అప్పగించారు. ఈగ ఏ చిట్టీపై వాలితే అందులో పేరున్న వ్యక్తే ఉప సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. దాంతో ఈగ గారి నిర్ణయమే శిలాశాసనం. వార్డు మెంబర్లు అంతా ఆ వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. పదవికి పోటీ పడిన ముగ్గురి పేర్లు చీట్టీలు రాసి స్థానిక భైరవనాథ్ ఆలయంలో ఉంచారు. రాజు గారి తీర్పు కోసం ప్రజలు ఎదురు చూసినట్లు ఈగ తీర్పు కోసం వారు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. పది నిమిషాలు వేచి చూసిన తర్వాత కానీ ఈగగారు ఆ చిట్టీపై వాలలేదు. ఈ వాలుడు తీర్పులో సంజీవని తింగ్లే అనే మహిళకు ఉప సర్పంచ్ పదవి వరించింది. తనకు పదవిని కట్టబెట్టిన ఈగగారికి కృతజ్ఞత తెలుపుకుని ఆమె ఉప సర్పంచ్‌గా బాధ్యతలు కూడా స్వీకరించేసింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జిల్లా అధికారులు ఠాఠ్... ఈగ పెత్తనం చెల్లందంటూ అభ్యంతరం తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం మా ఆచారం మాది... మీ అభ్యంతరాలు మీవి అంటూ తోసిపుచ్చారు. గతంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే పద్దతి అనుసరించామని చెప్పుకొచ్చారు. అయితే ఈ తతంగంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈగ గారి ఘనకార్యం లోకల్ న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్‌లో మారుమోగిపోయాయి. ఖేద్ గ్రామం సెలబ్రెటీగా మారిపోయిందని ఆ గ్రామ ప్రజులు మురిసిపోతుంటే ... ఈగ చలవ వల్ల ఉప సర్పంచ్ పదవి దక్కిన మహిళ మాత్రం తన అదృష్టానికి ఖుషీ అయిపోతుంది.