
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా బయట ఫుడ్ తినాలంటేనే జనాలు జంకుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ భయాన్ని జిహ్వచాపల్యం అణిచివేస్తుంది. ముఖ్యంగా నగరవాసులు ఆహారం కోసం ఎక్కువగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలమీదే ఆధారపడుతారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఈగ వచ్చిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భాగ్యనగరానికి చెందిన బెల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కొండాపూర్‌లోని సుబ్బయ్యగారి హోటల్ నుంచి స్విగ్గీలో బుట్ట భోజనం ఆర్డర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ అతని ఆహారాన్ని తీసుకువచ్చి ఇవ్వగానే ఎంతో ఆతృతగా దాన్ని ఓపెన్ చేశాడు. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!)
ఇంతలో హల్వాలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని మరింత పరిశీలించి చూడగా అది ఈగ అని తెలిసింది. దీంతో అతను సోషల్ మీడియాలో స్వీటు ఫొటోను పోస్ట్ చేశాడు. "ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కరోనా కాలంలోనూ మంచి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్తారు. కానీ తీరా ఇలాంటి అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తారు. అదృష్టం బాగుండి నేను దాన్ని తినకముందే చూశాను" అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన స్విగ్గీ క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పేర్కొంది. (ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం?)