పింప్రి, న్యూస్‌లైన్: పుణే జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంధ సంస్థలు ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహనకల్పిస్తున్నారు. సైకిల్ ర్యాలీలు, ప్రచార రథాలతో ఓటు విలువను తెలియజేయడం, మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ‘ఓట్ ఎక్స్‌ప్రెస్’ మినీబస్‌ను కూడా ప్రాంభించారు. పింప్రి, చించ్‌వడ్, బోసిరి అసెంబ్లీ నియోజక వర్గాలలో తిరిగి ప్రజల్లో ఈ వాహనం జనజాగృతి కల్పించనుంది. చించ్‌వడ్ ఎన్నికల అధికారి భానుదాస్ గైక్వాడ్ ఓట్ ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా వుండగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పుణే జిల్లాలో కేవలం 54.44 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 57.42 శాతం ఓటింగ్ నమోదైంది.
గతంతో పోలిస్తే కేవలం మూడు శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఎన్నికల సంఘం ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కసరత్తు చేస్తోంది. మరోపక్క జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీధి సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పార్టీల ప్రచార డిజిటల్ స్క్రీన్‌ల రథాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు పోటీపడి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో ఎన్నికల కురుక్షేత్రం మహా సంగ్రామాన్ని తలపిస్తోంది. దీనికి తోడుగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఓట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఎన్నికల సందడి మరింత రసవత్తరంగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రవీణ్ లడకత్, నోడల్ ఆఫీసర్ యశ్వంత్ మన్‌కేడ్కర్, అన్నా బోదడే, శరద్ మాన్కర్, ప్రకాష్‌బన్, షబ్బీర్‌షేఖ్, అనిల్ పాసల్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
75% ఓటింగే లక్ష్యం
Published Mon, Oct 6 2014 10:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement