cricket tourney
-
దివ్యాంగుల క్రికెట్ టోర్నీని ప్రారంభించిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను (Physically Diabled Cricket Tourney) భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (Hyderabad Cricket Association) (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రారంభించారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ... హెచ్‌సీఏ తరఫున దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తాము మిగిలిన వారిలానే క్రికెట్ ఆడగలమని నిరూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ క్రికెటర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దివ్యాంగ క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ తరహాలో ఒక లీగ్‌ను నిర్వహించే ఆలోచనను చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ పాల్గొన్నారు. -
పంచె కట్టులో.. గ్రౌండ్లో సత్తా చాటిన రైతన్నలు
సాక్షి, నిర్మల్: రైతు అంటే.. పొలం దున్ని, పంటలు పండించాలా?.. వాళ్లలోనూ అదనపు టాలెంట్లు ఉంటాయి. వాళ్లు వినోదాన్ని కోరుకుంటారు. అలాంటి కొందరు రైతులు క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. పొలంలోనే కాదు.. మైదానంలోనూ పంచె పైకి బిగించికట్టి అద్భుతంగా క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో ఆదివారం అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంతపేట్, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట్ గ్రామాల రైతులు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఈ పోటీలను ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. వయసుతో సంబంధం లేకుండా .. రైతులు మైదానంలో చురుగ్గా పరుగులు తీస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రైతుల క్రికెట్ చూసేందుకు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..?
ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? అయితే మీ కోరిక నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బ్యాటింగ్ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో-ఆసియా క్రికెట్ కప్‌ను పునఃప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది. వివిధ కారణాల చేత 2007లో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరన్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ కనుక ఏసీసీ ప్రతిపాదనకు ఓకే చెబితే రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది లాంటి ప్రపంచస్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు. కాగా, ఈ టోర్నీ తొలిసారి 2005లో జరిగింది. నాడు షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఆసియా ఎలెవెన్ తరఫున భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల ఆటగాళ్లు ఆడగా.. ఆఫ్రికా ఎలెవెన్ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాల క్రికెటర్లు ఆడారు. చదవండి: పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. -
ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం
England Batsman Dan Lincoln Stormy Century Of 31 Balls: డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఎలెవెన్, ఇటలీ జట్ల మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఇంగ్లీష్ ఆటగాడు డ్యాన్ లింకన్ 31 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో మెరుపు శతకం(105 నాటౌట్) సాధించాడు. 26 ఏళ్ల లింకన్ 338.70 స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని విధ్వంసం ధాటికి ప్రత్యర్ధి నిర్ధేశించిన 142 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. వివరాల్లోకి వెళితే.. యూరోపియన్ ఛాంపియన్షిప్ గ్రూప్ సి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఇటలీ కెప్టెన్ బల్జిత్ సింగ్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ డ్యాన్ లింకన్ ప్రత్యర్ధి బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీని నమోదు చేసింది. లింకన్ బుల్లెట్ ఇన్నింగ్స్‌లో 98 పరుగులు సిక్సర్లు, బౌండరీల రూపంలో రావడం విశేషం. చదవండి: వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..! -
43 బంతుల్లో 92 పరుగులతో విధ్వంసం; థ్రిల్లింగ్ విక్టరీ
లండన్: భారత బ్యాట్స్‌వుమెన్ జెమిమా రోడ్రిగ్స్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్స్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో విధ్వంసం సృష్టించింది. టోర్నీలో రోడ్రిగ్స్ నార్తన్ సూపర్‌చార్జర్స్ వుమెన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 43 బంతుల్లోనే 92 పరుగులు చేసిన ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆమె ధాటికి మరో 15 బంతులు ఉండగానే థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ మహిళల జట్లు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నార్తన్ సూపర్‌చార్జర్స్ బౌలింగ్‌లో స్మిత్ 3, కేతి లెవిక్, అలిస్ రిచర్డ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ లారెన్ విన్‌ఫిల్డ్ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత 19 పరుగుల వ్యవధిలో వరుస విరామాల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక నార్తన్ మ్యాచ్ ఓడిపోతుదనుకుంటున్న తరుణంలో రోడ్రిగ్స్ బౌండరీల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టించింది. చూస్తుండగానే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న రోడ్రిగ్స్ 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపింయింది. ఇక బెస్ హెత్ 12, అలిస్ రిచర్డ్స్ 23 పరుగులతో ఆమెకు సహకరించారు. ప్రస్తుతం జేమీ రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
యాంకరింగ్‌తో అలరించిన హీరో తనీష్
సాక్షి, విశాఖపట్నం : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం పోర్టు స్టేడియంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మనిషిలో లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉండాలని, అది సీఎం వైఎస్ జగన్‌లో పరిపూర్ణంగా ఉందని చెప్పారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదురొడ్డి ముందుకు సాగుతూ తన లక్ష్యాన్ని సీఎం చేరుకున్నారని గుర్తు చేశారు. నేటి యువత సీఎం వైఎస్ జగన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణించాలనే విశాఖ యువత అభిలాషను సాకారం చేసేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. వజ్ర సంకల్పంతో కృషి చేస్తే యువత తమ లక్ష్యాన్ని సాధించగలరని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా సౌకర్యాలు, వనరులు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలరించిన సినీ హీరో తనీష్ సినీ హీరో తనీష్ వేదికపై యాంకరింగ్ చేస్తూ అలరించారు. పంచ్ డైలాగ్‌లతో యువతలో ఉత్సాహం నింపారు. 422 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో విజేత జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. 20 రోజుల పాటు 14 వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడా జ్యోతితో స్టేడియంలో ఎంపీ విజయసాయిరెడ్డి నడవగా.. మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎన్సీసీ క్యాడెట్లు వెంట పరుగులు తీశారు. జట్ల కెప్టెన్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. అరకులోని 18 గిరిజన తెగల మహిళలు ధింసా నృత్యంతో అలరించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విశాఖలో మరిన్ని క్రీడా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇటీవలే క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రూ.3కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ విశాఖను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దాలన్నారు. వైఎస్సార్ అనే పదంలోనే వైబ్రేషన్ ఉందన్నారు. ఈ టోర్నీ విశాఖలో యువత కెరీర్‌కు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖను క్రీడా హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక రచిస్తే ముఖ్యమంత్రి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా యువత విస్తృతంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నీలో పోటీ పడాలన్నారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యువతను మహాశక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. జీవీఎంసీ కమిష నర్ జి.సృజన మాట్లాడుతూ మనిషి సంపూర్ణ అభివృద్ధిలో విద్యే కాకుండా ఆటలు కూడా దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా సృజనాత్మకత, విద్య, వినోదానికి దూరంగా ఉన్న యువతకు ఈ టోర్నమెంట్ మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు, అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఎస్.ఎ.రెహమాన్, సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్, నగర మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణబాబు, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ప్రగతి భారతి ఫౌండేషన్ సభ్యులు గోపీనాథ్ రెడ్డి, మావూరి వెంకటరమణ, ఉమేష్‌కుమార్, బాలాజీ, ముఖ్య నాయకులు ఫరూఖీ, రవిరెడ్డి, కొండా రాజీవ్, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, గెడ్డం ఉమ, వార్డు అధ్యక్షు లు, కార్పొరేట్ అభ్యర్థులు, క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
మ్యాచ్ అంటే ఇది.. జట్టులోని సభ్యులంతా డకౌట్
ముంబై: క్రికెట్లో అద్భుతాలు జరగడం అంటే ఇదేనేమో. క్రికెట్లో ఎక్కువ మంది డకౌటైతేను ఇదేం బ్యాటింగ్‌రా అనుకుంటాం. కానీ మొత్తం జట్టులోని సభ్యులంతా సున్నాకే పరిమితమైతే ఏమనుకోవాలి. మ్యాచ్ అంటే ఇదీ అనుకోవడం తప్పితే ఏం చేస్తాం. ఇప్పుడు అదే జరిగింది. అది ఏ స్థాయి మ్యాచ్ అయినా కానీ వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు డకౌట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోతే ఏమవుతుంది. ఘోర పరాజయం ఎదరవుతుంది. అలా క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది చిల్డ్రన్స్ అకాడమీ అంథేరీ స్కూల్ టీమ్. హార్రిస్ షీల్డ్ అండర్-16 టోర్నమెంట్లో భాగంగా బుధవారం ఆజాద్ మైదానంలో స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ బోరివాలీతో జరిగిన మ్యాచ్‌లో చిల్డ్రన్స్ అకాడమీ అంధేరీ జట్టు 754 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వారు ఛేదించాల్సిన లక్ష్యం 761 పరుగులు కాగా, కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. మొత్తం జట్టంతా సున్నాకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఓపెనర్లు మొదలుకొని కడవరకూ డకౌట్లనే కొనసాగించింది అంథేరీ చిల్డ్రన్స్ జట్టు. స్వామి వివేకానంద బౌలర్లలో అలోక్ పాల్ ఆరు వికెట్లతో అంథేరీ డకౌట్ల పతనాన్ని శాసించగా, వరాద్ వాజే రెండు వికెట్లు తీశాడు. ఇక రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వివేకానంద ఇంటర్నేషనల్ బొరివాలీ జట్టు 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 605 పరుగులు చేసింది. వివేకానంద ఇంటర్నేషనల్ బొరివాలీ మయేకర్ (338) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కాగా, 45 ఓవర్లను అంథేరీ జట్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవంతో 156 పరుగుల పెనాల్టీ పడింది. దాంతో అంథేరీ లక్ష్యం 761 పరుగులు అయ్యింది. -
రిషికేత్ మరో డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్ కాలేజి, స్కూల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో జాహ్నవి డిగ్రీ కాలేజి బ్యాట్స్‌మన్ రిషికేత్ సిసోడియా (135 బంతుల్లో 200; 8 ఫోర్లు, 18 సిక్సర్లు) మరోసారి దుమ్మురేపాడు. మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇటీవలే పేజ్ జూనియర్ కాలేజీతో జరిగిన మ్యాచ్‌లో అజేయ 291 పరుగులతో విజృంభించిన రిషికేత్ ఐదు రోజుల వ్యవధిలోనే మరో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు. దీంతో భవన్స్ వివేకానంద సైన్స్ కాలేజీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జాహ్నవి జట్టు 189 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జాహ్నవి జట్టు రిషికేత్ మెరుపు డబుల్ సెంచరీతో 42 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగుల భారీస్కోరు సాధించింది. అనంతరం భవన్స్ జట్టు 28.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. పి. నితీశ్ రెడ్డి (51) అర్ధసెంచరీతో పోరాడాడు. హర్షవర్ధన్ సింగ్ సెంచరీ బ్యాటింగ్‌లో హర్షవర్ధన్ సింగ్ (83 బంతుల్లో 102; 11 ఫోర్లు), బౌలింగ్‌లో అనికేత్ రెడ్డి (4/19) చెలరేగడంతో జాన్సన్ గ్రామర్ స్కూల్ (నాచారం)తో జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జిల్లా 127 పరుగులతో గెలుపొందింది. హర్షవర్ధన్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా 32 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. అజిత్ (30) రాణించాడు. అనంతరం అనికేత్ ధాటికి జాన్స న్ గ్రామర్ స్కూల్ 82 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు: ∙నల్లగొండ జిల్లా: 149, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్): 39 (రాజీవ్ 4/11, ముజాహిద్ 4/9). ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం): 135 (సాయి కౌశిక్ 60; నారాయణ్ తేజ 3/44), ఖమ్మం జిల్లా: 142/5 (సునీల్ అరవింద్ 31, విశాల్ 40, రాకేశ్ 35). హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్): 203/9 (పృథ్వీ రెడ్డి 37; ఆదిత్య 34; హర్ష సంక్పాల్ 3/34, క్రితిక్ రెడ్డి 3/37), గౌతమ్ జూనియర్ కాలేజి: 138 (క్రితిక్ రెడ్డి 57; ఇబ్రహీం ఖాన్ 4/38, పృథ్వీ రెడ్డి 6/22). ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్: 102 (కుశాల్ అగర్వాల్ 35; ఫర్దీన్ ఫిరోజ్ 3/27), భవన్స్ అరబిందో కాలేజి: 105/1 (ఇషాన్ శర్మ 43, నిశాంత్ 39 నాటౌట్). వరంగల్ జిల్లా: 155 (సుకృత్ 60; జైదేవ్ గౌడ్ 3/40), సర్దార్ పటేల్: 156/4 (జైదేవ్ గౌడ్ 32, అబ్దుల్ అద్నాన్ 47 నాటౌట్). మహబూబ్‌నగర్ జిల్లా: 284/5 (హర్ష 117, అరుణ్ 48 నాటౌట్), లయోలా డిగ్రీ కాలేజి: 90 (జుబేర్ 3/12, అరుణ్ 3/15). -
భారత అండర్–19 జట్టులో తిలక్ వర్మ
సూరత్: హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో భారత యువ జట్టు పర్యటించనుంది. ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రియమ్ గార్గ్ నాయకత్వంలో 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆ పర్యటనలో టీమిండియా ముక్కోణపు టోర్నమెంట్లో ఆడనుంది. ఆతిథ్య ఇంగ్లండ్తోపాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు ఆ టోర్నీలో పాల్గొంటాయి. జూలై 21న మొదలయ్యే ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు జూలై 15న ఇంగ్లండ్‌కు బయలుదేరుతుంది. భారత అండర్–19 జట్టు: ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఠాకూర్ తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, ధ్రువ్ చంద్ జురెల్ (వికెట్ కీపర్), శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయ్, విద్యాధర్ పాటిల్, సుశాంత్ మిశ్రా, రసిక్ సలామ్, సమీర్ రిజ్వీ, ప్రజ్నేశ్ కాన్పిలెవర్, కమ్రాన్ ఇక్బాల్, ప్రియేశ్ పటేల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, పూర్ణాంక్ త్యాగి, అన్షుల్ ఖంబోజ్. -
విజేత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గీతాంజలి దేవశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను అందుకుంది. ఆదివారం జరిగిన నాసర్ స్కూల్‌తో జరిగిన ఫైనల్లో హెచ్‌పీఎస్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. అమన్ (57; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. వైభవ్ (21) రాణించాడు. అనంతరం నాసర్ జట్టు 99 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్షిల్ మిశ్రా (42) ఒంటరిపోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్, ఆదిత్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
రాజూస్ క్రికెట్ క్లబ్ జట్లకు టైటిల్స్
హైదరాబాద్: శ్రీలంకలో జరిగిన జూనియర్ చాలెంజ్ కప్, కొలంబో సెంట్రల్ సీనియర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో రాజూస్ క్రికెట్ క్లబ్ జట్లు సత్తా చాటాయి. ఈ రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. కదిరిన క్రికెట్ గ్రౌండ్లో జరిగిన జూనియర్ చాలెంజ్ కప్ ఫైనల్లో రాజూస్ జట్టు 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. జూనియర్స్ విభాగంలో రుద్విక్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’, అజయ్ ‘ఉత్తమ బ్యాట్స్‌మన్’, అక్షయ్ ‘ఉత్తమ బౌలర్’ పురస్కారాలను గెలుచుకున్నారు. సీనియర్స్ కేటగిరీలో కమల్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. మే 19 నుంచి 26 వరకు శ్రీలంకలో ఈ టోర్నీ జరిగింది. -
దక్షిణ మధ్య రైల్వేకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రైల్వేస్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రాణించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎస్సీఆర్ 39 పరుగుల తేడాతో నార్త్ వెస్ట్రన్ రైల్వేస్, జైపూర్ జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో వెస్ట్రన్ రైల్వేస్‌పై గెలుపొందిన ఎస్సీఆర్ జట్టు...సెమీస్‌లో సెంట్రల్ రైల్వే చేతిలో పరాజయం పాలై మూడోస్థానం కోసం నార్త్ వెస్ట్రన్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సీఆర్ 49.5 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎం. సురేశ్ (95 బంతుల్లో 51; 2 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. జగదీశ్ కుమార్ (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), కపిల్ (33) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో వినీత్ 4 వికెట్లతో చెలరేగగా... గజేంద్ర సింగ్, మధుర్ ఖత్రి చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 207 పరుగుల సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నార్త్ వెస్ట్రన్ జట్టును ఎస్సీఆర్ బౌలర్లు సురేశ్ (5/45), సుధాకర్ (4/64) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి ఆ జట్టు 42.4 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. వినీత్ (52), నిఖిల్ (43) పోరాడారు. శరత్ బాబు ఒక వికెట్ తీశాడు. -
మల్లికార్జున్ మెరుపు సెంచరీ
సాక్షి, హైదరాబాద్ : జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో మెదక్ మావెరిక్స్ జట్టు బ్యాట్స్‌మన్ జె. మల్లికార్జున్ (52 బంతుల్లో 110; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఎంఎల్ఆర్ డిగ్రీ కాలేజి గ్రౌండ్లో గురువారం జరిగిన మ్యాచ్‌లో మెదక్ 43 పరుగుల తేడాతో కాకతీయ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు సాధించింది. మల్లికార్జున్ విజృంభణకు తోడు మికిల్ జైశ్వాల్ (39 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బౌండరీలతో హడలెత్తించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్ పోరాడి ఓడిపోయింది. బౌలర్లు వై. చైతన్య కృష్ణ (3/21), వి. భరత్ కుమార్ (3/46) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎం. యశ్వంత్‌రెడ్డి (22 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), యతిన్ రెడ్డి (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన జె. మల్లికార్జున్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ థండర్ బోల్ట్స్ 39 పరుగుల తేడాతో ఖమ్మం టిరా జట్టుపై గెలుపొందింది. బ్యాటింగ్‌లో చందన్ సహాని (50 బంతుల్లో 92; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు సాధించింది. విఠల్ అనురాగ్ (30) రాణించాడు. అనంతరం ఖమ్మం టిరా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసి ఓడిపోయింది. కె. రోహిత్ రాయుడు (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జునైద్ అలీ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో జయరామ్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. చందన్ సహాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు కరీంనగర్ వారియర్స్: 156/6 (జి. వినీత్ రెడ్డి 30, అమోల్ షిండ్ 52), నల్లగొండ లయన్స్: 160/3 (ఎ. వరుణ్ గౌడ్ 63 నాటౌట్, శశిధర్ రెడ్డి 44). ఆదిలాబాద్ టైగర్స్: 184/8 (టి. రవితేజ 30, నీరజ్ బిస్త్ 44, హితేశ్ యాదవ్ 45; కనిష్క్ నాయుడు 2/35, మెహదీహసన్ 2/24), రంగారెడ్డి రైజర్స్: 143/9 (అక్షత్ రెడ్డి 55; జి. సదన్ రెడ్డి 3/23, హితేశ్ యాదవ్ 2/16). -
అజీజుద్దీన్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అండర్–14 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ సయ్యద్ అజీజుద్దీన్ (155 బంతుల్లో 101; 15 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అజీజ్ అద్భుత ప్రదర్శనతో కేరళ వేదికగా గోవాతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు భారీస్కోరు సాధించింది. మయాంక్ గుప్తా (112బంతుల్లో 68; 10 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 69 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఎన్. రిషిత్ రెడ్డి (40) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో దీపక్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గోవా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులతో నిలిచింది. హైదరాబాద్ బౌలర్ రిషిత్ రెడ్డి (3/6) గోవాకు షాకిచ్చాడు. -
సంహిత్‌రెడ్డి డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఎం. సంహిత్‌రెడ్డి (272 బంతుల్లో 210; 30 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. సంహిత్ దూకుడుగా ఆడటంతో జింఖానా మైదానంలో జమ్మూకశ్మీర్‌తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీస్కోరు సాధించింది. 293/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ 144 ఓవర్లలో 7 వికెట్లకు 619 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో హైదరాబాద్‌కు 267 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సంహిత్తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (108) సెంచరీ సాధించగా, సాయి ప్రజ్ఞయ్‌రెడ్డి (76; 9 ఫోర్లు), వరుణ్ గౌడ్ (64; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. సంతోష్ (39), అనికేత్ (48) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్ మూడోరోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే జమ్మూ జట్టు ఇంకా 207 పరుగులు చేయాల్సి ఉంది. -
వరుణ్ గౌడ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వరుణ్ గౌడ్ (263 బంతుల్లో 238; 38 ఫోర్లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. వరుణ్‌తో పాటు బౌలింగ్‌లో అజయ్ దేవ్ గౌడ్ (5/26), సంకేత్ (5/59) చెలరేగడంతో హైదరాబాద్ గెలుపు ముంగిట నిలిచింది. ఉప్పల్ మైదానంలో ఏ అండ్ ఏ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఒకేరోజు 14 వికెట్లు నేలకూల్చడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 311/5తో రెండోరోజు సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 129 ఓవర్లలో 7 వికెట్లకు 527 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 114 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన వరుణ్ 245 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. అలంకృత్ (111 బంతుల్లో 51; 6 ఫోర్లు), టి. సంతోష్ గౌడ్ (59 బంతుల్లో 65; 4 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. అలంకృత్తో కలిసి ఆరో వికెట్‌కు 157 పరుగుల్ని జోడించిన వరుణ్, సంతోష్ గౌడ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రత్యర్థి బౌలర్లలో అల్ఫ్రెడ్ 2 వికెట్లు పడగొట్టగా, సాబీర్ ఖాన్, అభిషేక్ ఆనంద్, తహ్మీద్ తలా వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఏ అండ్ ఏ జట్టు 33.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్‌కు 497 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అభిషేక్ ఆనంద్ (54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సోను కుమార్ గుప్తా (30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఏ అండ్ ఏ జట్టు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులతో నిలిచింది. హైదరాబాద్ బౌలర్ అజయ్ దేవ్ గౌడ్ (4/10) ధాటికి నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్గానే పెవిలియన్ చేరారు. -
హైదరాబాద్ కెప్టెన్‌గా పూజ
సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ అండర్–16 మహిళా జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా వంకా పూజ వ్యవహరించనుంది. కేరళలోని ఎర్నాకుళంలో ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ టోర్నీ జరగుతుంది. జట్టు వివరాలు: వి. పూజ (కెప్టెన్), జి. త్రిష, హెన్రిట్టా ఫ్లేవియా పెరీరా, త్రిషా పూజిత, ఎం.మమత (వికెట్ కీపర్), అలివేలు (వికెట్ కీపర్), సువార్త, పి. చరిష్మా, హర్లీన్ కౌర్, బి. శ్రీవైష్ణవి, హాసిని, కె. ప్రియాంక, పీవీ చంద్రస్మిత, ఎ. భవిష్య, క్రాంతి రెడ్డి. -
సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం
-
సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్డేడియంలో మ్యాచ్ ఆడేందుకు సినీతారలు రావడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. శ్రీకాంత్, తరుణ్, అల్లరి నరేశ్, ఆదర్శ్, సంపూర్ణేశ్ బాబు సహా తదితర సెలబ్రిటీలను చూసేందుకు స్థానికులు రావడంతో స్డేడియంలో ఉత్సాహం ఉప్పొంగింది. అర్చన, ప్రణీతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సినీతారలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. 2011 నుంచి అనంతపురం వేదికగా సినీతారల క్రికెట్ కప్‌ను సీసీసీ చైర్మన్ షకీల్ షఫీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి టోర్నీని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి కాల్వ శ్రీనివాసులు వచ్చారు. టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. సినీతారలే ప్రధాన ఆటగాళ్లుగా తలపడనున్న మ్యాచ్‌లోని ఓ జట్టుకు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ కెప్టెన్ కాగా, మరో జట్టుకు కెప్టెన్‌గా హీరో తరుణ్ వ్యవహరించారు. 36 మంది సినీ తారలతో పాటు ఎంఎల్ఎన్ అకాడమీకి చెందిన సింగర్స్ హాజరై క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనంతపురంలో సినీతారల క్రికెట్ టోర్ని
-
హెచ్‌పీఎస్ జట్టుకు టైటిల్
క్రికెట్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. మీట్లో భాగంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి టైటిల్‌ను సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో గీతాంజలి స్కూల్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గీతాంజలి స్కూల్ 62 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ (21) ఒక్కడే రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అనిరుధ్ 3 వికెట్లు పడగొట్టగా, అజీమ్, శార్దుల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆతిథ్య హెచ్‌పీఎస్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లకు 63 పరుగులు చేసింది. అజీమ్ (27) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో గీతాంజలి 12 పరుగుల తేడాతో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, హెచ్‌పీఎస్ 80 పరుగుల తేడాతో సుజాత స్కూల్‌పై గెలుపొందింది. వాలీబాల్‌లోనూ శుభారంభం ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ వాలీబాల్ ఈవెంట్లోనూ హెచ్‌పీఎస్ జట్టు శుభారంభం చేసింది. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 15–8, 15–5తో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్‌పై గెలిచి శుభారంభం చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎస్డీఏ సెకండరీ స్కూల్ 15–11, 15–8తో ఫ్యూచర్కిడ్స్పై, హెరిటేజ్ వ్యాలీ 12–15, 14–4, 15–8తో సెయింట్ జోసెఫ్ కింగ్ కోఠిపై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–4, 15–2తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై గెలుపొందాయి. జూనియర్ బాలుర లీగ్ మ్యాచ్‌ల ఫలితాలు హెచ్‌పీఎస్ కడప 15–11, 15–5తో లిటిల్ ఫ్లవర్ స్కూల్‌పై, షేర్వుడ్ 15–5, 15–11తో ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఇండియన్ బ్లోసమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 15–11, 15–5తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ 15–7, 15–9తో సెయింట్ మేరీస్‌పై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–12, 15–11తో అభ్యాస స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ మలక్‌పేట్ 15–3, 15–5తో సెయింట్ జోసెఫ్ కింగ్కోఠిపై, సెయింట్‌ఆన్స్ 15–13, 15–13తో ఫ్యూచర్‌కిడ్స్ జట్లపై గెలిచి ముందంజ వేశాయి. -
క్రికెట్ టోర్నీ ప్రారంభం
ధరూరు : క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసాన్నిస్తాయని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ముస్తఫా స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు మైదానంలో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని కోరారు. ప్రతి ఓటమి గెలుకు పునాది లాంటిదన్నారు. అంతకు ముందు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు జాకీర్, నిర్వాహకులు ప్రవీణగౌడ్, మహ్మద్, మునీర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
నెల్లూరు(అర్బన్): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం బీవీ శివయ్య పేర్కొన్నారు. స్థానిక కనుపర్తిపాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీజీబీ ఎంఏసీసీ సొసైటీ అంతర్ జిల్లా క్రికెట్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వైఎస్సార్ కడప జిల్లా ఆర్ఎం కే రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆట విడుపునకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏసీసీ సొసైటీ అధ్యక్షుడు కే హనుమంతరావు, బ్యాంకు అధికారులు చంద్రమౌళిరెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
వెంకటగిరి : పట్టణంలోని తారక రామా క్రీడాప్రాంగణంలో గురువారం జరిగిన అండర్ –19 అంతర్ జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. గురువారం కర్నూలు, కృష్ణా జట్లు మధ్య జరిగిన పోటీల్లో కృష్ణా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 43 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టానికి 202 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నూలు జట్టు కంటే కృష్ణా జిల్లా జట్టు 86 పరుగుల ఆధిక్యత సాధించింది. శుక్రవారం మ్యాచ్ కొనసాగనుంది. తూర్పుగోదావరి, ప్రకాశం జట్లు మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.2 ఓవర్లల్లో 82 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జట్టు ఆటముగిసే సమయానికి 46 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. శుక్రవారం ఆట కొనసాగించనున్నారు.