సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఎం. సంహిత్‌రెడ్డి (272 బంతుల్లో 210; 30 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. సంహిత్ దూకుడుగా ఆడటంతో జింఖానా మైదానంలో జమ్మూకశ్మీర్‌తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీస్కోరు సాధించింది. 293/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ 144 ఓవర్లలో 7 వికెట్లకు 619 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో హైదరాబాద్‌కు 267 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
సంహిత్‌తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (108) సెంచరీ సాధించగా, సాయి ప్రజ్ఞయ్‌రెడ్డి (76; 9 ఫోర్లు), వరుణ్ గౌడ్ (64; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. సంతోష్ (39), అనికేత్ (48) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్ మూడోరోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే జమ్మూ జట్టు ఇంకా 207 పరుగులు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment